నిరుద్యోగ యువత కలలు సాకారమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో ఐటీ సేవలు విస్తరిస్తున్నాయి. మారుమూల ప్రాంతాలకూ అంతర్జాతీయ సంస్థలు తరలివస్తున్నాయి. ఇందూరుకు మణిమకుటంగా నిలిచిన ఐటీ టవర్‌లో సేవలు ప్రారంభించేందుకు కంపెనీలు ఉత్సుకత చూపుతున్నాయి. ఈ కోవలోనే అంతర్జాతీయంగా పేరొందిన హిటాచీగ్రూప్ సబ్సిడరీ సంస్థ గ్లోబల్ లాజిక్.. మన ఐటీహబ్‌లో కంపెనీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చొరవతో ఇందూరులో కార్యకలాపాలు ప్రారంభించడానికి ముందుకొచ్చింది. సరిగ్గా నెల క్రితం సంస్థ ప్రతినిధులు ఎమ్మెల్సీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అన్ని వసతులు కల్పిస్తామని కవిత హామీ ఇవ్వడంతో గ్లోబల్ లాజిక్ సంస్థ తన కార్యాలయాన్ని నిజామాబాద్‌లో ప్రారంభించనున్నట్లు తాజాగా ప్రకటించింది. కంపెనీ ప్రకటనపై కవిత హర్షం వ్యక్తం చేశారు. యువతకు ఉపాధి కల్పిస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నామని, గ్లోబల్ లాజిక్ సంస్థ రాకతో మరింత మందికి ఉపాధి లభిస్తుందన్నారు.
ఖలీల్‌వాడీ, ఆగస్టు 30 : నిజామాబాద్ ఐటీ హబ్‌లో మరో అంతర్జాతీయ కంపెనీ ఏర్పాటు కాబోతున్నది. ఇటీవల ప్రారంభమైన జిల్లా ఐటీ హబ్‌లో ఇప్పటికే అనేక సంస్థలు తమ కంపెనీలను ఏర్పాటు చేయగా తాజాగా అంతర్జాతీయంగా పేరొందిన ప్రముఖ హిటాచి గ్రూప్ సబ్సిడరీ సంస్థ గ్లోబల్ లాజిక్ తన కంపెనీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇంకా కంపెనీలను ఏర్పాటు చేయడానికి ప్రముఖ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. అమెరికాలోని కాలిఫోర్నియాలో ప్రధాన కార్యాలయం కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న గ్లోబల్ లాజిక్ సంస్థకు హైదరాబాద్‌లో రెండు క్యాంపస్‌లు ఉన్నాయి.
గచ్చిబౌలి, జూబ్లీహిల్స్‌లో ఉన్న వారి కంపెనీల్లో ప్రస్తుతం దాదాపు 3 వేల మంది పని చేస్తున్నారు. నిజామాబాద్ ఐటీ హబ్‌లో కంపెనీ ఏర్పాటు చేయడంపై ఈనెల మొదటి వారంలో ఆ సంస్థ ప్రతినిధులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో చర్చలు జరిపారు. పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తామని కవిత ఇచ్చిన హామీ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు ఇటీవల ఐటీ హబ్‌ను సందర్శించారు. అనంతరం కంపెనీ ఏర్పాటుకు ప్రతిపాదించగా కాలిఫోర్నియాలోని వారి ప్రధాన కార్యాలయం అనుమతులు ఇచ్చింది. కల్వకుంట్ల కవితతో సమావేశమైన కేవలం 29 రోజుల్లోనే సంస్థ ఏర్పాటు కావడం విశేషం. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ అంతర్జాతీయ సంస్థ గ్లోబల్ లాజిక్ నిజామాబాద్‌లో కంపెనీ ఏర్పాటు చేయడం శుభపరిణామమన్నారు. ఐటీ హబ్ ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే అపూర్వ స్పందన వస్తున్నదన్నారు. ఇప్పటికే అనేక మందికి ఉద్యోగాలు లభించాయని, రెండు జాబ్ మేళాలు నిర్వహించామని వివరించారు. గ్లోబల్ లాజిక్ కంపెనీ ఏర్పాటుతో స్థానిక యువతకు మరిన్ని ఉద్యోగావకాశాలు కలుగుతాయన్నారు. ఉపాధి కోసం హైదరాబాద్, బెంగుళూరు వంటి నగరాలకు వెళ్లకుండానే యువతకు స్థానికంగానే ఉద్యోగ కల్పన లక్ష్యంగా సీఎం కేసీఆర్ సహకారంతో ఐటీ హబ్‌ను భవిష్యత్తులో మరింత విస్తరిస్తామని, భవిష్యత్తులో మరిన్ని ప్రముఖ కంపెనీలు ఏర్పాటు అవుతాయని చెప్పారు.
రెండుసార్లు మెగా జాబ్ మేళాలు
ఐటీ హబ్‌లో ఉద్యోగాల కల్పనకు టాస్క్ ఆధ్వర్యంలో రెండు సార్లు మెగా జాబ్ మేళాలు నిర్వహించగా విశేష స్పందన లభించింది. గత నెల 21వ తేదీన నిర్వహించిన జాబ్‌మేళాలో 30 విదేశీ, స్వదేశీ కంపెనీలు అభ్యర్థులకు ఇంటర్వ్యూలను నిర్వహించాయి. జాబ్‌మేళాకు 13,600 మంది యువతీ యువకులు హాజరయ్యారు. ఈ నెల 29న నిర్వహించిన జాబ్‌మేళాలో 41 ప్రముఖ కంపెనీలు వచ్చాయి. సుమారు 13వేల మంది ఉద్యోగార్థులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. పదో తరగతి నుంచి ఉన్నత విద్య అభ్యసించిన వారికి సైతం ఆఫర్ లెటర్లు అందజేశాయి.
బీఆర్ఎస్వీ నాయకుల సంబురాలు
ఐటీ హబ్‌లో గ్లోబల్ లాజిక్ కంపెనీ ఏర్పాటుకు ముందుకు రావడంతో బీఆర్ఎస్వీ నాయకులు బుధవారం సంబురాలు నిర్వహించారు. కంపెనీ ఏర్పాటుతో మరిన్ని ఉద్యోగావకాశాలు వస్తాయని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.