నిజామాబాద్, జూలై 17, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నిజామాబాద్ జిల్లాలో దొంగ పత్రాలతో ఖాళీ జాగాలకు ఎసరు పెడుతున్న ముఠా లు విచ్చలవిడిగా తయారవుతున్నాయి. రాజకీయ నాయకుల పరపతిని వాడుకుంటూ, బెదిరింపులకు పాల్పడుతూ, దౌర్జన్యమే పెట్టుబడిగా ఇష్టారీతిన పేట్రేగి పోతున్నారు. ఖాళీ జాగా కనిపిస్తే చాలు… వెంటనే దొంగ పత్రాలు సృష్టించడం వీళ్లకు వెన్నతో పెట్టిన విద్యగా మారుతోంది. ఫేక్ డాక్యుమెంట్లు చేత పట్టుకుని అసలైన యజమానులను కంగుతినే విధంగా ఇష్టారీతిన బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతుండటం ఒక వ్యాపకంగా తయారైంది. తప్పుడు పత్రాలతో ఆస్తి యజమానులనే సెటిల్మెంట్లకు పిలవడం… కుదిరితే రూ.లక్షలు లాక్కోవడం లేదంటే కేసులు, కోర్టులు అంటూ తిప్పడం నిత్యం పరిపాటిగా మారింది. ఇలాంటి ముఠా గుట్టును నిజామాబాద్ నగరంలో రట్టు చేశారు. ఐదారుగురు పనీపాట లేకుండా ఇదే విధిగా పెట్టుకుని తిరుగుతూ జల్సాలు చేస్తున్నారు. వీరికి సబ్ రిజిస్ట్రార్లు, డాక్యుమెంట్ రైటర్లు వంత పాడుతున్నారు. అమాయక జనాన్ని టార్గెట్ చేసి నరకం చూపిస్తున్నారు. దశాబ్దాల తరబడి కష్టపడి సంపాదించిన ఖాళీ జాగలను, ఇళ్లను, ఇతర స్థిరాస్తికి ఎసరు పెట్టి ఎంచక్కా ఎంజాయ్ చేస్తుండటంతో పోలీసులకు చిక్కి కటకటాలకు వెళ్లారు.
దొంగ డాక్యుమెంట్లతో ఆస్తులు కాజేస్తున్న ముఠాలకు సామాన్య జనమే టార్గెట్. ఆయా కాలనీల్లో ఏజెంట్లను లేదా పరిచయం కలిగిన వ్యక్తుల నుంచి సమాచారం తెలుసుకుంటారు. ఒక రోజు రెక్కీ నిర్వహించి పకడ్భందీగా జాగాను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తారు. ఎవరైనా అడ్డు చెబితే గొడవ చేస్తారు. అవసరమైతే గట్టిగా అరుస్తూ హింసాయుతంగా పరిస్థితులను సృష్టిస్తున్నారు. ఉల్టా చోర్ ఉన్నట్లుగా రభస సృష్టించి యజమానులకే తలనొప్పులు తీసుకు వస్తారు. మరో రోజు వచ్చి ఫేక్ డాక్యుమెంట్లు చూపిస్తూ అసలైన ఆస్తిపరులను గందరగోళంలో ముంచేస్తారు. బాధిత వ్యక్తులు రాజీకి వస్తే రూ.లక్షలు డిమాండ్ చేస్తారు. లేదంటే వాటా అడుగుతారు. కుదరని పక్షంలో కబ్జాకు బరితెగిస్తారు. అడ్డొస్తే కోర్టులో కేసు వేసి సతాయిస్తారు. ఆ ఆస్తిని అమ్మకుండా, కొనకుండా చేసి టైం పాస్ చేస్తారు. ఇదంతా ఏళ్ల తరబడి సాగే ప్రక్రియ కావడంతో ఎంతకో కొంతకు ముట్టజెప్పి వివాదాస్పద జాగాను వదిలించుకోవడం అసలైన యజమానుల వంతుగా మారుతోంది. గడిచిన కొన్నేళ్లుగా నిజామాబాద్ నగరంలోని నాలుగో టౌన్, మూడో టౌన్, రూరల్ పోలీస్ స్టేషన్లో ఇదే రకమైన కేసులు అనేకం నమోదు అయ్యాయి. తాజాగా ఓ ముఠాను పట్టుకుని పోలీసులు చక్కని గుణపాఠం చెప్పారు.
అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారాలు అనేకం వెలుగు చూస్తున్నప్పటికీ సబ్ రిజిస్ట్రార్లు మాత్రం తీరు మార్చుకోవడం లేదు. దొడ్డి దారిలో డబ్బులు సంపాదించేందుకు ఎంతకైనా ఎగబడుతున్నారు. సామాన్యులను బలిపీఠం ఎక్కించి వారి రక్తం తాగుతున్నారు. ఒక తప్పుడు రిజిస్ట్రేషన్ వల్ల కుటుంబాలకు కుటుంబాలే రోడ్డున పడుతున్నప్పటికీ సబ్ రిజిస్ట్రార్లకు మానవత్వం ఉండటం లేదు. డబ్బే పరమావధిగా కొంత మంది సబ్ రిజిస్ట్రార్లు బరితెగిస్తున్నారు. ఏసీబీ దాడులు జరుగుతున్నా… శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ తీర మారడం లేదు. డాక్యుమెంట్ రైటర్ల ద్వారా అక్రమార్కులతో కుమ్మక్కై ఇష్టారీతిన పని చేస్తున్నారు. పేరుకు చట్టాలు, చట్టంలోని లొసుగులు బూచీగా చూపించి ఇష్టానుసారంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. నిజామాబాద్ నగరంలో ఫేక్ డాక్యుమెంట్ ఆధారంగా పలు ఆస్తులకు రిజిష్ర్టేషన్ జరిపిన వ్యవహారంలో సబ్ రిజిస్ట్రార్లను సైతం భాగస్వామ్యం చేయాలని బాధిత కుటుంబాలు కోరుకుంటున్నాయి.
సామాన్య జనాలను హింసించే ఈ బాగోతంలో డాక్యుమెంట్ రైటర్లే అసలు సూత్రధారులుగా నిలుస్తున్నారు. మూడు రోజుల క్రితం పోలీసులకు పట్టుబడిన దొంగ పత్రాల సృష్టికర్తల్లో డాక్యుమెంట్ రైటర్ పాత్రధారిగా తేలడంతో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. 2024లోనూ ఇదే తరహా మోసం ఒకట బయట పడింది. నెహ్రూ చౌక్ సమీపంలో శంభుని గుడి వద్ద 73 గజాల అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జాగాను దుండగులు రిజిష్ర్టేషన్ చేయించుకున్నారు. ఇందులోనూ డాక్యుమెంట్ రైటర్ల పాత్రనే కీలకంగా తేలింది. ఆ తర్వాత రిజిష్ర్టేషన్ను రద్దు చేసినప్పటికీ ఈ తరహా దందాలు మాత్రం ఆగడం లేదు. డాక్యుమెంట్ రైటర్ల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కొంత మంది చేస్తోన్న అక్రమ వ్యవహారాలు, అవినీతి దందాతో మొత్తం వ్యవస్థకు చెడ్డ పేరు వస్తోంది. చంద్రశేఖర్ కాలనీ, దుబ్బా, బైపాస్ రోడ్డు, కొత్త కలెక్టరేట్ సమీపం, అర్సపల్లి వంటి ఏరియాలో ఇలాంటి వ్యవహారాలు అనేకం సృష్టించబడినట్లుగా తెలుస్తోంది. డాక్యుమెంట్ రైటర్ల వ్యవహారాలపై పోలీసులు దాడులు నిర్వహించి సోదాలు చేస్తే అనేక అక్రమ వ్యవహారాలు వెలుగు చూసే అవకాశం ఉన్నట్లుగా ప్రజలు భావిస్తున్నారు. ఇలాంటి అక్రమ తంతు నుంచి జనాలను కాపాడాలని వేడుకుంటున్నారు.