కామారెడ్డి, జూన్ 9 : జాతీయ రహదారులతోపాటు కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో చోరీలకు పాల్పడిన అంతర్జిల్లా దొంగల ముఠాను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు కామారెడ్డి అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఠాకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. చోరీలకు పాల్పడుతున్న నాందేడ్‌కు చెందిన నాందేవ్ అలియాస్ రాంకిషన్ బోస్లే, రాందాస్, కర్ణాటకకు చెందిన క్రిష్ణ బాబు షిండే అలియాస్ క్రిష్ణకుమార్ షిండే, నాందేడ్‌కు చెందిన రాథోడ్ అజిత్ రమేశ్ అలియాస్ అజయ్, నాందేడ్‌కు చెందిన రిసీవర్ గజానంద్ రామారావును అరెస్టు చేసినట్లు తెలిపారు.
మరొక వ్యక్తి భాస్కర్ చౌహాన్ అలియాస్ భాస్కర్ దాదా రావు చౌహాన్ పరారీలో ఉన్నాడని త్వరలోనే పట్టుకుంటామని అన్నా రు. ఈ దొంగల ముఠా సభ్యులు రహదారులపై ఆగి ఉన్న వాహనదారులను లక్ష్యం చేసుకొని వారిపై మారణాయుధాలతో దాడి చేసి దారి దోపిడీకి పాల్పడుతుంటారని తెలిపారు. అలాగే రహదారులకు సమీపంలో ఉన్న తాళం వేసి ఇండ్లల్లో చోరీ చేస్తుంటారని అన్నారు. ఈ ముఠా సభ్యులను పట్టుకోవడానికి రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సోమవారం మొండిసడక్ చౌరస్తా వద్ద గాంధారి పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా, ముగ్గురు వ్యక్తులు రెండు ద్విచక్ర వాహనాలపై బాన్సువాడ నుంచి గాంధారి వైపు వస్తుండడాన్ని గమనించి వారిని పట్టుకొన్నట్లు తెలిపారు. విచారించగా నలుగురు సభ్యులు ఒక ముఠాగా ఏర్పడి నేరాలకు పాల్పడుతున్నట్లు ఒప్పుకున్నారని తెలిపారు.
వారితోపాటు సొత్తును కొనుగోలు చేసే వ్యక్తి గజానంద్ రామారావును కూడా అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచామని పేర్కొన్నారు. నిందితుల నుంచి మూడు తులాల బంగారం, 12 తులాల వెండి, రెండు కత్తులు, ఒక ఇనుపరాడ్డు, రెండు టార్చిలైట్లు, ఒక స్పానర్ , మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. కేసును ఛేదించిన సీసీఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సదాశివనగర్ సీఐ సంతోష్ కుమార్, ఎస్సైలు ఆంజనేయులు, రంజిత్, ఉస్మాన్, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, రాజేందర్, శ్రావణ్, లక్ష్మీకాంత్, స్వామి, మైసయ్య, రవి, సిబ్బందిని ఎస్పీ రాజేశ్ చంద్ర, అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి అభినందించారు.