Nizamabad | వినాయక్ నగర్, సెప్టెంబర్ 7 : నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా శనివారం ఉదయం ప్రారంభమైన గణేష్ నిమజ్జన శోభాయాత్ర ఆదివారం రెండో రోజు సైతం కొనసాగింది. శనివారం ప్రారంభమైన వివిధ గణేష్ ప్రతిమల నిమజ్జన యాత్ర భక్తుల భజనలు, నృత్యాలతో ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వివిధ ప్రాంతాల నుండి బాసర గోదావరి నదికి తరలి వెళ్లాయి.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి బాసర, ఉమ్మెడ వద్ద నిమజ్జనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు సిబ్బంది పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టారు. అలాగే సీపీ సాయి చైతన్య స్వయంగా నిమజ్జనం జరిగే ప్రదేశాలను సందర్శించి పర్యవేక్షించారు. నిమజ్జన ప్రాంతాలలో విధులు నిర్వర్తిస్తున్న అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లాలోని అన్ని ప్రాంతాలలో సీసీ కెమెరాల పర్యవేక్షణలో గణేష్ నిమజ్జన ఊరేగింపు కార్యక్రమాలు, నిమజ్జన కార్యక్రమాలు కొనసాగాయి.
వివిధ ప్రాంతాల నుండి కూడా ఎక్కువ మొత్తంలో బాసర, ఉమ్మెడ కు నిమజ్జనానికి వస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా రద్దీగా ఉండే ప్రదేశాలలో ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పోలీసులు ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టారు. ఆయనతో పాటు నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ ఏసీపీలు, సీఐలు స్పెషల్ పార్టీ సిబ్బంది బందోబస్తు నిర్వహణలో పాల్గొన్నారు.