కామారెడ్డి, జూలై 18 : త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకునేలా కష్టపడాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కి ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. హడావుడిగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామంటూ మరోసారి దొంగనాటకానికి తెరలేపిందని పేర్కొన్నారు.
అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత ఆర్డినెన్స్ చేసినా చెల్లదని మేధావులు చెబుతున్నా పట్టించుకోకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ విడుదల చేసిందని గుర్తుచేశారు. అప్పుడు పీసీసీ చీఫ్ హోదాలో ఉన్న ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సమక్షంలో విడుదలచేశారని తెలిపారు. అధికారంలోకి వచ్చినా ఇచ్చిన హామీని మర్చిపోయిందని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని సూచించారు. పాలకవర్గాల పదవీకాలం ముగిసినా స్థానిక ఎన్నికలు నిర్వహించడం లేదని కోర్టు మొట్టికాయలు వేస్తే ఎన్నికలు హడావుడిగా నిర్వహించడానికి ప్రభుత్వం సమాయత్తమైందన్నారు. సర్పంచ్, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు వేర్వేరుగా లేదా ఒకేసారి నిర్వహించినా సిద్ధంగా ఉండాలని బీఆర్ఎస్ కార్యకర్తలకు సూచించారు. నాయకులు గ్రామాలు, మండలాల వారీగా కార్యకర్తలను సమన్వయం చేయాలన్నారు.
మాజీ జడ్పీటీసీలు మినుకూరి రాంరెడ్డి, గోపీగౌడ్, పార్టీ ప్రతినిధులు శ్రీనివాస్‌గౌడ్, బలవంత్‌రావు, పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్ రెడ్డి, రాంచంద్రం, గండ్ర మధుసూదన్ రావు, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ రవియాదవ్, సీనియర్ నాయకులు జూకంటి మోహన్ రెడ్డి, శంకర్, ప్రభాకర్ యాదవ్, పిట్ల వేణుగోపాల్, గరిగంటి లక్ష్మీనారాయణ, మాజీ ఫ్లోర్ లీడర్ హఫీజ్, భానుప్రసాద్ పాల్గొన్నారు.