Nizamabad | వినాయక్ నగర్, నవంబర్ 14: చట్టాలపై ప్రతీ ఒక్కరికీ అవగాహన కలిగి ఉండాలని, స్నేహాలు మంచి కోసం ఉపయోగపడేలా ఉండాలని జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చీఫ్ డిఫెన్స్ కౌన్సిల్, సీనియర్ న్యాయవాది రాజ్ కుమార్ సుబేదార్ అన్నారు. నిజామాబాద్ నగరంలోని నాగారం ప్రాంతంలో ఉన్న జువైనల్ జస్టిస్ బోర్డులో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలను నిర్వహించారు.
తెలిసీతెలియని వయస్సులో చేసే పనులు, స్నేహ సంబంధాలు మంచి కోసం ఉపయోగపడేలా ఉండాలని, అలాగే ఇప్పుడున్న సమయంలో చిన్న పిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు, లైంగిక వేధింపులకు గురి అవుతున్న పిల్లలకు పలు సూచనలు చేశారు. అందరూ తమ తమ జీవితాలను తప్పుదోవ పట్టకుండా జాగ్రత్తలు పడాలని తెలియజేశారు. ఈ సందర్భంగా పిల్లలకు పండ్లు, బిస్కట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జోనల్ జస్టిస్ బోర్డ్ సూపరింటెండెంట్ నాగేశ్వర్, సభ్యులు వెంకటరమణ గౌడ్, శ్రీలత, డీఎల్ఎస్ఏ సూపరింటెండెంట్ శైలజా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.