సర్కారు దవాఖానల్లో ఎప్పటికప్పుడు సంస్కరణలు చేపడుతూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరంతరంగా కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా రోగ నిర్ధారణ పరీక్షల కోసం వేలాది రూపాయలు వెచ్చించి ప్రైవేటు కేంద్రాలకు వెళ్లాల్సిన పరిస్థితిని పేదలకు దూరం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం 57రకాల పరీక్షలను ఉచితంగా చేయించడానికి ఏర్పాట్లు చేసింది. నిజామాబాద్ జిల్లా కేంద్ర దవాఖానలో గత ఏడాది రోగ నిర్ధారణ పరీక్షల (డయాగ్నోస్టిక్ సెంటర్) కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, సామాజిక వైద్యశాలల్లో నమూనాలను ఇస్తే సరిపోతుంది. ఈ నమూనాలను జిల్లా దవాఖానకు పంపించి పరీక్షలు నిర్వహించి సంబంధిత వ్యక్తికి రిపోర్టును పంపుతారు. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు లక్షా 85వేల 181 నమూనాలను సేకరించారు. వీటి ద్వారా 3లక్షల 47వేల 125 రోగ నిర్ధారణ పరీక్షలను నిర్వహించారు. ఈ ఉచిత సేవల ద్వారా జిల్లా ప్రజలకు దాదాపు రూ.10 కోట్ల వరకు ఆదా అయినట్లు అంచనా వేస్తున్నారు.
నిజామాబాద్, అక్టోబర్ 23, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సర్కారు దవాఖానాలో రోగుల కష్టాలు తీరుతున్నాయి. ఆయా వ్యాధులతో బాధపడుతున్న వారు వైద్య పరీక్షలు చేయించుకోవాలంటే ఆర్థిక భారం తడిసి మోపెడవుతుంది. ప్రభుత్వ దవాఖానల్లో సరైన రోగ నిర్ధారణ యంత్రాలు లేకపోవడంతో ప్రైవేటు కేంద్రాల బాట పట్టాల్సిన పరిస్థితి ఉండేది. వేలాది రూపాయలు వెచ్చిస్తే గానీ పరీక్షల ఫలితాలు తెలిసే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 57రకాల పరీక్షలను ఉచితంగా చేయించడానికి ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా ప్రభుత్వ జనరల్ వైద్యశాలలో రోగ నిర్ధారణ పరీక్షల (డయాగ్నోస్టిక్) కేంద్రాన్ని గతేడాది అందుబాటులోకి తీసుకొచ్చింది. రోగ నిర్ధారణ పరీక్షల నిమిత్తం ప్రజలెవ్వరూ నిజామాబాద్‌లోని జీజీహెచ్‌కు రావాల్సిన పని లేదు. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, సామాజిక వైద్యశాలలు, జిల్లా దవా ఖానల్లో నమూనాలను అందిస్తే సరిపోతుంది. ఒకటి లేదా రెండు రోజుల్లోనే పరీక్షలకు సంబంధించిన రిపోర్టు సంబంధిత వ్యక్తికి చేరిపోతుంది. ప్రైవేటు డయాగ్నోస్టిక్ సెంటర్‌కు వెళ్లి అనవసరంగా రూ.వేలు ఖర్చు చేయకుండా ప్రభుత్వ సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం కోరుతున్నది. 2021, జూన్ 6న నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ దవాఖానలో ప్రారంభమైన డయాగ్నోస్టిక్ సేవలకు మంచి ఆదరణ దక్కుతున్నది.
3 లక్షల 47వేల రోగ నిర్ధారణ పరీక్షలు…
నిజామాబాద్ ప్రభుత్వ డయాగ్నోస్టిక్ హబ్ ఏర్పాటుతో నిజామాబాద్ జిల్లాలోని పేద, మధ్య తరగతి ప్రజలకు మేలు జరుగుతున్నది. సేవలు ప్రారంభమైన ఏడాది కాలంలోనే డయాగ్నోస్టిక్ సెంటర్ ద్వారా లక్షలాది మందికి ఆర్థిక భారం తప్పినట్లు అయ్యింది. ఆయా రోగాలతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు ప్రభుత్వ డయాగ్నోస్టిక్ సెంటర్ ద్వారా సులువుగా, వేగంగా, ఉచితంగా ఫలితాలు అందుతున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రక్త, మూత్ర నమూనాలు సేకరించి వాటిని జిల్లా కేంద్రంలోని రోగ నిర్ధారణ కేంద్రానికి పంపిస్తున్నారు. ఇలా వచ్చిన నమూనాలను అధునాతన యంత్రాల సాయంతో పరీక్షలు నిర్వహిస్తారు. నిర్ణీత కాల వ్యవధిలో వాటికి సంబంధించిన ఫలితాలను సంబంధిత ఆరోగ్య అధికారికి పంపించడం ద్వారా ప్రజల ఆరోగ్య పరీక్షల వివరాలు ఇట్టే చేరిపోతున్నాయి. పైసా ఖర్చు లేకుండానే చకచకా రోగ నిర్ధారణ పరీక్షలు జరుగుతుండడంతో సామాన్య ప్రజలెంతో మందికి ఊరట కలుగుతున్నది. నేటి వరకు ప్రభుత్వ డయాగ్నోస్టిక్ సెంటర్లో లక్షా 85వేల 181 నమూనాలను సేకరించారు. వీటి ద్వారా 3లక్షల 47వేల 125 రోగ నిర్ధారణ పరీక్షలను నిర్వహించారు. సగటున ఒక నమూనా నుంచి దాదాపు మూడేసి రోగ నిర్ధారణ పరీక్షలను చేపట్టారు. వృద్ధాప్యంలో ఉన్న చాలా మంది ఒక నమూనాతో పదుల సంఖ్యలో రోగ నిర్ధారణకు ఆసక్తి చూపుతున్నారు.
రూ.10 కోట్లు ఆదా…
నిజామాబాద్‌లోని ప్రైవేటు డయాగ్నోస్టిక్ సెంటర్లో పరీక్షలకయ్యే ఖర్చు పేద, మధ్యతరగతి ప్రజలకు తడిసి మోపెడవుతుంది. కొంత మంది వైద్యులు అనవసరమైన పరీక్షలు రాసి డబ్బులు గుంజేవారున్నారు. తద్వారా పేదల జేబులు గుల్లా అవుతున్న దుస్థితి ఎదురవుతుంది. కేవలం రూ.వందల్లో వసూలు చేయాల్సిన ఫీజులను రూ.వేలల్లో వసూలు చేస్తూ దందా చేస్తోన్న వారందరికీ ప్రభుత్వ డయాగ్నోస్టిక్ సేవలతో దోపిడీకి అడ్డుకట్ట పడినట్లు అయ్యింది. జీజీహెచ్‌లో అధునాతన వైద్య పరికరాలు ఏర్పాటు కావడంతో పేదలకు భారీ ఊరట దక్కింది. ప్రభుత్వ డయాగ్నోస్టిక్ సెంట్రల్ హబ్‌గా పిలుస్తున్న ఈ కేంద్రంలో దాదాపు అన్ని రోగాలకు సంబంధించిన పరీక్షలు చేసే సామర్థ్యం ఉంది. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ వైద్యశాలలో కార్పొరేట్ వైద్యానికి ధీటైన సేవలు అందుతున్నాయి. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు నిర్వహించిన డయాగ్నోస్టిక్ సెంటర్ ద్వారా ఉచితంగా సేవలు పొందడం ద్వారా ప్రజలకు దాదాపు రూ.10 కోట్లు ఆదా అయినట్లుగా అంచనా వేస్తున్నారు. ఇదంతా గతంలో ప్రైవేటు డయాగ్నోస్టిక్ సెంటర్లకే చేరేది.
పైసా ఖర్చు లేకుండా…
2021, జూన్ 6న ప్రారంభమైన డయాగ్నోస్టిక్ సెంటర్ ద్వారా గడిచిన కొద్ది రోజుల్లోనే వేలాది మందికి లబ్ధి చేకూరుతున్నది. మొత్తం 42 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, సామాజిక వైద్యశాలల నుంచి వచ్చే నమూనాలను డయాగ్నోస్టిక్ సెంటర్లో పరీక్షించి వాటి ఫలితాలను ఆయా దవాఖానలకు పంపిస్తున్నారు. తద్వారా జిల్లా వ్యాప్తంగా పేద ప్రజలందరికీ ప్రైవేటు డయాగ్నోస్టిక్ దోపిడీ తంటాలకు చెల్లు చీటి పడింది.
ప్రస్తుతం ప్రతి రోజు సగటున 300 నుంచి 400 మంది రోగులకు సంబంధించిన ఆయా రకాల పరీక్షల కోసం నమూనాలు డయాగ్నోస్టిక్ సెంటర్‌కు చేరుతున్నాయి. పైసా ఖర్చు లేకుండానే రోగ నిర్ధారణ జరుగుతుండడంతో గ్రామాల నుంచి ఆదరణ క్రమంగా పెరుగుతున్నది. థైరాయిడ్, ఐజీజీ, ఐజీఎం, చికున్ గున్యా, సీడీ కౌంట్, గ్లూకోజ్, ఆర్ఎఫ్టీ, కేఎఫ్టీ, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, అన్ని రకాల క్యాన్సర్, ఇన్ఫెక్షన్లకు సంబంధించిన సీబీపీ, యూరిన్ అనలైసిస్, విటమిన్ డీ, విటామిన్ బీ 12 లోపాలు, సి-రియాక్టివ్ ప్రొటీన్స్(సీఆర్పీ), యూరియా – సీరం, క్రియాటినైన్ – సీరం, లివర్ ఫంక్షన్ టెస్టు(ఎల్ఎఫ్టీ), లాక్టేట్ డీహైడ్రోగెన్స్(ఎల్డీహెచ్) వంటి 57 రకాల రోగ నిర్ధారణకు సంబంధించిన పరీక్షలు, వాటి ఫలితాలను విశ్లేషిస్తున్నారు.