మహాలక్ష్మీ పథకం తమ బతుకులను ఆగం జేసిందని.. కుటుంబాలను పోషించుకోలేక రోడ్డున పడే పరిస్థితి దాపురించిందని ఆటోవాలాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆటోవాలాలు బుధవారం రోడ్డెక్కి నిరసనలకు దిగారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంలో సవరింపులు చేయాలని.. లేదంటే తమకు ప్రత్యామ్నాయం చూపాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మీ పథకం తమ బతుకులను ఆగం చేస్తున్నదని ఆటోవాలాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మహిళలందరూ బస్సుల్లోనే ప్రయాణం చేస్తున్నారని, ఆటోల్లో ఎవరూ ఎక్కడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఆటోల్లో కనీసం పెట్రోల్, డీజిల్ పోసేందుకు కూడా డబ్బులు రావడం లేదని నిరాశ వ్యక్తం చేస్తున్నారు. కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పటుతున్నదని, మహాలక్ష్మీ పథకాన్ని సవరించాలని వారు కోరుతున్నారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో బుధవారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తహసీల్ కార్యాలయాల్లో అధికారులకు వినతిపత్రాలను సమర్పించడంతోపాటు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తంచేశారు.