వినాయక్‌నగర్, డిసెంబర్ 26: ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఓ మాయలేడి నిరుద్యోగుల నుంచి రూ.లక్షలు వసూలుచేసి మోసం చేసిన ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఓ రైల్వే హెడ్‌కానిస్టేబుల్ సహకారంతో డబ్బులు వసూలు చేయగా, బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిజామాబాద్ నగర సీఐ శ్రీనివాస్‌రాజ్, ఫోర్త్ టౌన్ పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌వో సతీశ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గొట్టే స్వరూప కొంతకాలం క్రితం నిజామాబాద్ జిల్లాకు వచ్చి గంగాస్థాన్ ప్రాంతంలో ఓ ఇంటికి అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నది.
తాను ఆర్అండ్బీ డిపార్టుమెంట్లో అధికారిణి అంటూ చెలామణి అవుతూ, నిజామాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కుబేరుడుతో పరిచయం ఏర్పర్చుకుంది. తాను నిరుద్యోగులకు ఆర్అండ్బీ, జడ్పీ, ఎస్సీ కార్పొరేషన్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మించింది. దీంతో నగరంలోని త్రీ టౌన్ ప్రాంతానికి చెందిన ఓ యువతికి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ రూ.1.20లక్షలు, మరో ఇద్దరు యువకులకు ఎస్సీ కార్పొరేషన్లో, జడ్పీలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటు వారి నుంచి రూ.2.30లక్షలు వసూలు చేశారు. అయితే ఒక్కొక్కరికీ సుమారు రూ.4 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు ఖర్చవుతుందని నమ్మబలికారు. వారి మాటలను నమ్మిన సదరు నిరుద్యోగులు డబ్బులు చెల్లించారు. వారికి సంబంధిత డిపార్ట్మెంట్లలో ఉద్యోగాలు వచ్చినట్లు చెప్పి, జిల్లా ఉన్నతాధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి, నకిలీ అపాయింట్మెంట్ లేటర్లు, ఐడీ కార్డులను చూపించారు.
అయితే తాము సూచించిన మేరకు పూర్తి డబ్బులు ఇస్తేనే అపాయింట్మెంట్ లెటర్లు ఇస్తామని షరతులు విధించారు. దీంతో ముగ్గురు నిరుద్యోగులు తాము మోసపోయినట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మూడు కేసుల్లో స్వరూప, రెండు కేసుల్లో రైల్వే హెడ్‌కానిస్టేబుల్ కుబేరుడుపై కేసు నమోదు చేసినట్లు మూడో టౌన్ ఎస్సై హరిబాబు తెలిపారు. ఆర్యనగర్ ప్రాంతానికి చెందిన రమావత్ రాజు అనే యువకుడు సదరు మాయలేడికి రూ.4లక్షలు, వినాయకనగర్‌కు చెందిన కొత్త భరత్ అనే మరో యువకుడు రూ.2లక్షలు చెల్లించినట్లు తెలిపారు. వినాయక్‌నగర్‌కు చెందిన నట్ట సంజీవ్ అనే యువకుడు సివిల్ సప్లయ్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం కోసం రూ.2.5 లక్షలు చెల్లించి మోసపోయినట్లు నాల్గో టౌన్లో ఫిర్యాదు చేయగా, స్వరూపపై మూడు కేసులు నమోదు చేసినట్లు ఎస్‌హెచ్‌వో సతీశ్ కుమార్ తెలిపారు.
స్వరూప తాను ఆర్‌అండ్‌బీలో డివిజన్ అకౌంట్ ఆఫీసర్ అని, తమ మామ కుబేరుడు అలియాస్ ఉపేందర్ రెడ్డి హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడని పరిచయం చేసుకొని, తనకు ఉద్యోగం ఇప్పిస్తామని రూ.6 లక్షలు తీసుకొని మోసం చేశారని శక్కరకొండ శారద అనే మహిళ రూరల్ పోలీసుస్టేషన్లో శుక్రవారం ఫిర్యాదు చేసింది. స్వరూపతో పాటు కుబేరుడు పై కేసు నమోదు చేసి,దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్ వెల్లడించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు మూడోటౌన్ ఎస్సై హరిబాబు తెలిపారు.
నిరుద్యోగులను మోసం చేసిన ఇద్దరి నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఇలాంటి వారి మాటలు నమ్మి జనాలు మోసపోవద్దు. బాధితులు ఇంకా ఎవరైనా ఉంటే సంబంధిత పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలి.