కామారెడ్డి, ఏప్రిల్ 4 : కామారెడ్డి వైద్య కళాశాలలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాల్లో అవకతవకలు జరిగాయని, వెంటనే వాటిని రద్దు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు శుక్రవారం కళాశాలను ముట్టడించా రు. వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా కళాశాల ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కళాశాలలో అవుట్ సోర్సింగ్ విధానం ద్వారా చేపట్టిన ఉద్యోగ నియామకాల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. ఈ విషయమై గతంలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులు కలెక్టర్‌తోపాటు ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేయగా..అధికారులకు నోటీసులు ఇచ్చారని గుర్తుచేశారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం కొత్తగా నోటిఫికేషన్ జారీ చేసి గతంలో స్వీకరించిన దరఖాస్తులనే మళ్లీ స్వీకరించారని తెలిపారు. దీంతో అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగులకు అన్యాయం జరిగిందన్నారు.
నియామకాల్లో నిబంధనలు బేఖాతరు చేశారని తెలిపారు. నియామకపత్రాలు అందించిన తర్వాత మెరిట్ జాబితా ప్రదర్శించడంపై ఉన్నతాధికారులు, కళాశాల ప్రిన్సిపాల్ సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మ్యాన్‌పవర్ ఏజెన్సీ నిర్వాహకులు కూడా కొన్ని ధ్రువపత్రాలకు సంబంధించిన మార్పులు, చేర్పులు చేశారని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారని తెలిపారు. ఉద్యోగాలు పొందిన ప్రతి ఒక్కరి ఒరిజినల్ సర్టిఫికెట్లను పరిశీలించాలని డిమాండ్ చేశారు. అర్హులకు కాకుండా డబ్బులు ఇచ్చిన వారికి ఉద్యోగాలు ఇస్తున్నారని ఆరోపించారు. కళాశాల ప్రిన్సిపాల్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసి, వెంటనే సస్పెండ్ చేయాలని కోరారు. ప్రైవేట్ ఏజెన్సీని రద్దు చేసే వరకు ఉద్యమిస్తామని స్పష్టంచేశారు.
వైద్య కళాశాలలో అక్రమ నియామకాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ టీఎన్ఎస్ఎఫ్ నాయకులు కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. రోస్టర్ నిబంధనలను పాటించలేదని, డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు. కార్యక్రమంలో బీవీ ఎం రాష్ట్ర కార్యదర్శి విఠల్, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ముదాం అరుణ్, తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షుడు కుంబాల లక్ష్మణ్ యాదవ్, గిరిజన్ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు వినోద్, బీడీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు నరేందర్, నిమ్మ సురేశ్, మణికంఠ, అర్బాస్ ఖాన్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.