ఇందల్వాయి, మే 23 : కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం అడవి జంతువులకు శాపంగా మారింది. జాతీయ రహదారుల పక్కన రక్షణ కంచె నిర్మించడంలో కేంద్రం నిస్తేజంగా వ్యవహరిస్తున్నది. టోల్ వసూలుపైనే దృష్టి సారించిన జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ).. రోడ్డుకు ఇరువైపులా ఫెన్సింగ్ నిర్మించకుండా గాలికొదిలేసింది. దీంతో వన్యమృగాలు రోడ్డు దాటుతూ ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో నాలుగు చిరుతలు ఇలా రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడ్డాయి. అయినప్పటికీ అటు కేంద్రం కానీ, ఇటు ఎన్హెచ్ఏఐ కానీ రక్షణ కంచెలు నిర్మించడానికి ముందుకు రావడం లేదు.
వాస్తవానికి జాతీయ రహదారి నిర్మించే సమయంలోనే రోడ్డుకు ఇరువైపులా రక్షణ కంచెలు నిర్మించాలి. గ్రామాలతో పాటు అటవీ ప్రాంతంలోనూ వీటిని ఏర్పాటు చేయడం తప్పనిసరి. హైవేలపై వాహనాలు వేగంగా వెళ్లే క్రమంలో మనుషులతోపాటు పశువులు అకస్మాత్తుగా రోడ్డుపైకి రాకుండా ఉండడానికి కంచెలను ఏర్పాటు చేస్తారు. అయితే, 44వ జాతీయ రహదారికి ఇరువైపులా చాలా చోట్ల వీటిని ఏర్పాటు చేయకుండా వదిలేశారు. ఫలితంగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా వన్య ప్రాణులు వాహనాలు ఢీకొని చనిపోతున్నాయి.
ఫిబ్రవరిలో చంద్రయాన్‌పల్లి గ్రామ శివారులోని దగ్గి వద్ద చిరుత పులి రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మృత్యువాత పడింది.
గతేడాది సెప్టెంబర్ 15న కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం దగ్గి అటవీ ప్రాంతంలో రెండేళ్ల వయస్సున్న చిరుత రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందింది.
2018 మే 11న దేవీతండా వద్ద ఇలాగే మరో చిరుత కూడా మృత్యువాత పడింది.
నాలుగు కిలోమీటర్ల వ్యవధిలోనే ఈ మూడు ఘటనలు చోటు చేసుకోవడం గమనార్హం. అదే రక్షణ కంచెలు ఉంటే ఇలాంటి ఘటనలు చోటు చేసుకునేవి కావు. అధికారుల పర్యవేక్షణాలోపం, నిర్మాణ సంస్థ నిర్లక్ష్యం వన్య ప్రాణులకు శాపంగా మారింది.
వసూళ్లపైనే దృష్టి..
కేంద్ర ప్రభుత్వానికి, నిర్మాణ సంస్థకు వసూళ్లపై ఉన్న దృష్టి వన్యప్రాణుల సంరక్షణపై లేదు. టోల్‌ప్లాజాలు పెట్టి రోజూ లక్షల్లో వసూలు చేస్తున్న ఎన్హెచ్ఏఐ, నిర్మాణ సంస్థ.. ఫెన్సింగ్ నిర్మాణాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు.ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో 44వ జాతీయ రహదారికి ఇరువైపులా రక్షణ కంచెలు నిర్మించిన ఎన్హెచ్ఏఐ.. వన్యప్రాణులు రోడ్డుపైకి రా కుండా చర్యలు చేపట్టింది. అదే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మాత్రం గాలికొదిలేసింది. ఫలితంగా మూగ జీవాలు మృత్యువాత పడుతున్నాయి. టోల్ వసూళ్ల ద్వారా నిత్యం లక్షల్లో ఆదాయం ఆర్జిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. ఫెన్సింగ్ ఏర్పాటుపై దృష్టి సారిస్తే బాగుంటుంది.
వన్యప్రాణుల రక్షణ చర్యలు చేపడుతాం..
రహదారి నిర్మాణం సమయంలోనే రక్షణ కంచె ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని ఎన్హెచ్ఏఐకి విన్నవించాం. అటవీ ప్రాంతంలో వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని టోల్ ప్లాజా నిర్వాహకులకు సూచించాం. వాహనదారులు కూడా వన్యప్రాణులను దృష్టిలో ఉంచుకొని డ్రైవింగ్ చేయాలి.
– హిమచందన, ఎఫ్ఆర్వో ఇందల్వాయి