బాన్సువాడ/ఎల్లారెడ్డి రూరల్, ఫిబ్రవరి 1: న్యాయ ప్రాంగణం ఒక దేవాలయమని, ఆ పవిత్రతను కాపాడుకుందామని హైకోర్టు న్యాయమూర్తులు శ్రీనివాస్‌రావు, లక్ష్మీనారాయణ అలిశెట్టి అన్నారు. న్యాయమూర్తులు, న్యాయవాదులకు బార్ అసోసియేషన్ వారధి లాంటిదన్నారు. చాలా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, న్యాయవాదులు న్యాయమూర్తులకు సహకరిస్తే సత్వర పరిష్కా రం లభిస్తుందన్నారు. బాన్సువాడ, ఎల్లారెడ్డిలో నిర్మించనున్న కోర్టు భవనాలకు హైకోర్టు జడ్జీలు శనివారం శంకుస్థాపన చేశారు. కామారెడ్డి జిల్లా కోర్టు జడ్జి, డాక్టర్ సీహెచ్వీఆర్ఆర్ వరప్రసాద్, బాన్సువాడ జూనియర్ సివిల్ జడ్జి భార్గవి, ఎల్లారెడ్డి కోర్టు న్యాయమూర్తి హారిక, సబ్ కలెక్టర్ కిరణ్మయి కొప్పిశెట్టి, న్యాయవాదులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో కామారెడ్డి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ ఇన్చార్జి, జడ్జి శ్రీనివాస్‌రావు మాట్లాడారు. బాన్సువాడకు రావడం ఇదే మొదటిసారి అని, మార్గమధ్యంలో పచ్చని పంట పొలాలు, అడవిలో ప్రయాణం చేయడం ఆహ్లాదకరంగా అనిపించిందన్నారు. తనకు నిజామాబాద్ జిల్లాతో చాలా అనుబంధం ఉన్నదని, తనది పక్కనే ఉన్న కరీంనగర్ జిల్లా అని తెలిపారు. బిచ్కుంద కోర్టుకు న్యాయమూర్తి నియామకానికి కృషి చేస్తానని, దీనిపై న్యాయమూర్తుల కమిటీతో చర్చిస్తామని చెప్పారు. బిచ్కుంద, బాన్సువాడ ప్రాంతాలకు చెందిన కక్షిదారులకు సత్వర న్యాయం జరగడానికి సీనియర్ సివిల్ కోర్టు బాన్సువాడలో ఉంటే బాగుంటుందని చెప్పారని, ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని సీనియర్ సివిల్ కోర్టు ఉండేలా ప్రయత్నం చేస్తానన్నారు.
తప్పు చేస్తేనే కోర్టుకు వెళ్తున్నామనే భావన వీడాలని సూచించారు. సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించుకోవడానికి, చట్టపరంగా మీ హక్కును పొందడానికే కోర్టుకు వస్తున్నారన్న భావన ఉండాలన్నారు. మధ్యవర్తుల ద్వారా ఊర్లలో జరుగుతున్న పంచాయతీల తీర్పు చట్టబద్ధత కాదు కాబట్టి కోర్టు ద్వారా వారి హక్కులను కాపాడుకోవడానికి కోర్టుకు వస్తున్నారన్నారు. లోక్ అదాలత్‌లో ఇరు పార్టీల సమ్మతి ఉంటేనే పరిష్కరించాలని, ఏ ఒక్కరూ సమ్మతిగా లేకపోయినా కోర్టు ద్వారానే పరిష్కారం జరుగుతుందన్నారు. కష్టపడి చదివి ఉన్నతోద్యోగాల్లో స్థిరపడాలని అక్కడున్న విద్యార్థులకు సూచించారు.
ఎల్లారెడ్డి కోర్టు నిర్మాణాన్ని చూసి హైకోర్టు న్యాయమూర్తులు శ్రీనివాస్‌రావు, లక్ష్మీనారాయణ అలిశెట్టి ముచ్చటపడ్డారు. హైదరాబాద్‌లో 1918లో నిర్మించిన హైకోర్టు భవన నిర్మాణానికి, ఎల్లారెడ్డిలో 1936లో నిర్మించిన మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు భవన నిర్మాణానికి చాలా పోలికలు ఉన్నాయన్నారు. హైకోర్టు బార్ అసోసియేషన్ సభ్యుడు రాజేందర్‌రెడ్డి, బాన్సువాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ మూర్తి, న్యాయవాదులు, అధికారులు పాల్గొన్నారు.