ఖలీల్‌వాడి, డిసెంబర్ 9 : రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతున్నదని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అరెస్టులే అందుకు నిదర్శనమని నిజామాబాద్ జడ్పీ మాజీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి వెళ్లకుండా పోలీసులతో అడ్డుకోవడం దారుణమన్నారు. తెలంగాణ తల్లి విగ్రహ మార్పు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.
జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పార్టీ నేతలు సోమవారం క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం విలేకరులతో విఠల్‌రావు మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ సర్పంచుల అక్రమ అరెస్టులను ఖండించారు. నిర్బంధాలతో బీఆర్ఎస్ను ఆపలేరని, తెలంగాణలో తమ ఉధృతిని తట్టుకోవడం కాంగ్రెస్ తరం కాదని హెచ్చరించారు.
ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ నవంబర్ 29న ప్రారంభించిన ఆమరణ దీక్ష దేశం మొత్తాన్ని కుదిపేసిందన్నారు. దీంతో కేంద్రం దిగివచ్చి, రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని ప్రకటించిందన్నారు. రాష్ట్ర అవతరణకు పునాది వేసిన డిసెంబర్ 9వ తేదీని విజయ్ దివస్‌గా జరుపుకుంటున్నామని తెలిపారు. కేసీఆర్ మహోన్నత దీక్షాబలాన్ని, అమరుల త్యాగఫలాన్ని సగర్వంగా స్మరించుకుందామని పిలుపునిచ్చారు. సమావేశంలో బీఆర్ఎస్ నేతలు సత్యప్రకాశ్, శంకర్, రాజు, ఫయీం ఖురేషి, శంకర్, భూపతి, మల్లేశం, విజయ్, సాదిక్ తదితరులు పాల్గొన్నారు.