నిజామాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) ; ఇందూరు ముద్దుబిడ్డ, పీసీసీ మాజీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ (75) ఇకలేరు. అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. డీఎస్‌గా రాష్ట్ర రాజకీయాల్లో అందరికీ సుపరిచితుడైన ఆయన స్వస్థలం నిజామాబాద్ జిల్లా వేల్పూర్. సాధారణ కార్యకర్తగా కాంగ్రెస్‌లో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయా హోదాల్లో విశేషంగా రాణించారు. హస్తం పార్టీని వరుసగా రెండు సార్లు అధికారంలోకి తేవడంలో డీఎస్ కీలక పాత్ర పోషించారు. ఆయన సారథ్యంలోనే 2004, 2009 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న సూత్రాన్ని బలంగా నమ్మిన ఆయన ఏ హోదాలో ఉన్నా దర్పం ప్రదర్శించలేదు. నిత్యం ప్రజలతో వారి అవసరాలను గుర్తించి తీర్చడంలో డీఎస్‌ను మించిన వారు లేరు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తనదైన శైలిలో ముద్ర వేసుకున్న ఆయన తన రాజకీయ చతురతతో ప్రత్యర్థి పార్టీలను దీటుగా ఎదుర్కొన్నారు. తన రాజకీయ ప్రస్థానంలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న డీఎస్‌కు ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్రంలోనూ అనుచరగణం భారీగా ఉండడం గొప్ప విషయం. ఆయన శిష్యరికంలో రాజకీయ అవకాశాలను అందిపుచ్చుకుని అందలం ఎక్కిన వారు జిల్లాలో చాలా మంది ఉన్నారు.
వేల్పూర్ నుంచి పీసీసీ చీఫ్ దాకా..
నాటి హైదరాబాద్ రాష్ట్రంలో 1948 సెప్టెంబర్ 27న సాధారణ వ్యవసాయ కుటుంబంలో ధర్మపురి శ్రీనివాస్ వేల్పూర్‌లో జన్మించారు. అనంతరం రాజకీయాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరి కార్యకర్తగా అసమాన సేవలను అందించారు. వివిధ హోదాల్లో పార్టీ పదవులను దక్కించుకుని అనతి కాలంలోనే రాష్ట్ర స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. తొలిసారిగా 1989లో ఎమ్మెల్యేగా నిజామాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 1994లో టీడీపీ అభ్యర్థి సతీష్ పవార్ చేతిలో ఓడిన డీఎస్ ఆ తర్వాత 1999, 2004 ఎన్నికల్లో వరుసగా గెలిచి సత్తా చాటారు. 2004 సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి రాష్ర్టానికి పీసీసీ అధ్యక్షుడిగా సేవలందించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయిన కేబినెట్లో గ్రామీణాభివృద్ధి, ఉన్నత విద్యా శాఖ మంత్రిగా సేవలందించారు. టీడీపీ ప్రభుత్వాన్ని పడగొట్టి 2004లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకు రావడంలో డీఎస్ కృషి ఎంతో ఉంది. పీసీసీ చీఫ్‌గా వైఎస్‌కు తోడూనీడగా నిలిచి తన రాజకీయ చతురతతో కాంగ్రెస్‌ను గద్దెనెక్కించారు. ఆ కారణంగా 2009 సార్వత్రిక ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు మరోసారి పీసీసీ అధ్యక్ష పీఠాన్ని కట్టబెట్టింది. వైఎస్, డీఎస్ జోడిగా ఎన్నికల బరిలోకి దిగిన కాంగ్రెస్ మరోసారి సత్తా చాటి వరుసగా రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకుంది. కానీ డీఎస్ అనూహ్యంగా నిజామాబాద్‌లో ఓడిపోయారు. తెలంగాణ ఉద్యమ వేడిలో 2012 ఉప ఎన్నికల్లోనూ డీఎస్‌కు ఓటమి తప్పలేదు. దీంతో ప్రత్యక్ష రాజకీయాలకు దూరం కావాల్సి వచ్చింది. తెలంగాణ స్వరాష్ట్రంలో శాసనమండలిలో తొలి ప్రతిపక్ష నాయకుడిగా 2014 జూన్ 3 నుంచి 2015 జూలై 2 దాకా డీఎస్ సేవలందించారు.
అనారోగ్యంతో డి.శ్రీనివాస్ కన్నుమూత
కాంగ్రెస్‌లో విశేష సేవలందించిన డీఎస్‌ను ఒక దశలో ఏఐసీసీ నిర్లక్ష్యానికి గురి చేసింది. రాజ్యసభ సీటు ఇవ్వకుండా మొండిచేయి చూపింది. ఈ సమయంలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ డీఎస్‌ను చేరదీశారు. పార్టీలో ఎంతో మంది ఆశావహులు ఉన్నప్పటికీ రాజకీయాల్లో డీఎస్ పాత్రను గుర్తించి, ఆయన వయసును గౌరవించి 2016లో రాజ్యసభ సభ్యుడిగా చేశారు. కొద్ది కాలం ఎంపీగా జిల్లా, రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్న డి.శ్రీనివాస్ ఆ తర్వాత కొన్ని కారణాలతో అనూహ్యంగా బీఆర్ఎస్కు కు దూరమయ్యారు. ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలోనే తను కుమారులు ఇద్దరు చెరో పార్టీలో కొనసాగడం విశేషం. మరోవైపు, 2022లో ఎంపీ పదవి ముగిసిన తర్వాత డీఎస్ కాంగ్రెస్ గూటికి చేరారు. ఆ తర్వాత వయోభారంతో ఇంటికి పరిమితమయ్యారు. పెద్ద కుమారుడు సంజయ్ కాంగ్రెస్‌లో, చిన్న కుమారుడు అర్వింద్ బీజేపీలో ఉండడం గమనార్హం. తండ్రి బాటలో ఇద్దరు కుమారులు రాజకీయంగా ఎదిగారు. నిజామాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో విజయం సాధించిన ధర్మపురి సంజయ్ మొదటి మేయర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఇక, తండ్రి దగ్గరే రాజకీయ పాఠాలను నేర్చుకున్న రెండో కుమారుడు అర్వింద్ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కాకుండా బీజేపీలో చేరి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ పార్టీ తరఫున ఎంపీగా 2019, 2024లో పోటీ చేసి వరుసగా రెండుసార్లు గెలుపొందారు.
అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
ఖలీల్‌వాడి, జూన్ 29: ధర్మపురి శ్రీనివాస్ పార్థివదేహాన్ని నిజామాబాద్ ప్రగతినగర్‌లోని నివాసానికి శనివారం సాయంత్రం తీసుకొచ్చారు. పార్థివదేహం వెంట తన కుమారులు ఎంపీ అర్వింద్, మాజీ మేయర్ సంజయ్ ఉన్నారు. ఆదివారం మధ్యాహ్నం 2గంటల తర్వాత బైపాస్ రోడ్‌లోని డీఎస్ వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో డీఎస్ అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశించడంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. డి.శ్రీనివాస్ అంత్యక్రియలకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యే అవకాశాలున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. దీంతో కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, అదనపు కలెక్టర్లు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, ఆది శ్రీనివాస్, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు తదితరులు డీఎస్ పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.
డీఎస్ కోసం ప్రణబ్ రాక..
జిల్లాకు చెందిన మాజీ మంత్రి అర్గుల్ రాజారాం శిష్యరికంలో డీఎస్ రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. కాంగ్రెస్ అధిష్టానానికి నమ్మిన బంటుగా మారి ఏఐసీసీ పెద్దలతో సత్సంబంధాలను కొనసాగించారు. ఈ క్రమంలోనే ఆయనకు ఆప్తుడిగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నిలిచారు. డి.శ్రీనివాస్ తన షష్టిపూర్తి మహోత్సవాన్ని నిజామాబాద్ జిల్లాలో 2008లో ఘనంగా నిర్వహించారు. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న ఆ సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి హోదాలో ప్రణబ్ ముఖర్జీ రాగా, మార్గమధ్యంలో ఆయన కాన్వాయ్‌ను ఉద్యమకారులు అడ్డుకుని తెలంగాణ ఉద్యమ సెగను రుచి చూపించారు. అర్గుల్ రాజారాం, ప్రణబ్ ముఖర్జీలను గురువులుగా భావించిన డీఎస్ వారి బాటలోనే నడిచే వారు. వారు నేర్పిన రాజకీయ విలువలను పాటించేవారు. డీఎస్ నాయకత్వంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అనేక మంది రాజకీయంగా ఎదిగారు. తన అనుచరులకు ఏ ఇబ్బంది కలిగినా రాత్రీపగలూ తేడా లేకుండా వాలి పోతారన్న గుర్తింపు డీఎస్‌కు ఉంది. నమ్మిన వారి బాగోగులు చూసుకునే డి.శ్రీనివాస్‌ను అందరూ ముద్దుగా శీనన్న అని పిలుచుకుంటారు. నిజామాబాద్ జిల్లా అభివృద్ధిలో డీఎస్ పాత్ర ఎనలేనిది. ఎత్తిపోతల పథకాల స్థాపన, నిజామాబాద్‌కు కార్పొరేషన్ హోదా, బైపాస్ రోడ్డు ఆయన కాలంలోనే ఏర్పడ్డాయి. మరోవైపు డిచ్‌పల్లిలో తెలంగాణ యూనివర్సిటీ స్థాపనకు కృషి చేశారు.
డీఎస్ జీవిత విశేషాలు..
పేరు : ధర్మపురి శ్రీనివాస్
పుట్టిన తేదీ : 1948, సెప్టెంబర్ 27
స్వస్థలం : వేల్పూర్, నిజామాబాద్ జిల్లా
సంతానం : ఇద్దరు కుమారులు (సంజయ్, అర్వింద్)
ఎమ్మెల్యేగా : 1989, 1999, 2004(మూడు పర్యాయాలు)
పీసీసీ చీఫ్‌గా : 2004-2005, 2008-2011 వరకు
రాష్ట్ర మంత్రిగా : 2004-2009
మండలిలో ప్రతిపక్ష నేతగా : 2014 జూన్ 3-2015 జూలై 2
రాజ్యసభ సభ్యుడిగా : 2016 జూన్ 22-2022 జూలై 4