Bail Granted | వినాయక్ నగర్, జులై 18 : బీఆర్ఎస్ నాయకుల పై పెట్టే కుట్ర కేసులను అడ్డుకుంటామని, అక్రమ కేసులు బనాయిస్తామంటే చూస్తూ ఊరుకోబోమని బీఆర్ఎస్ లీగల్ సెల్ నిజామాబాద్ జిల్లా కన్వీనర్ దాదన్నగారి మధుసూదన్ రావు కాంగ్రెస్ పార్టీ నాయకులను హెచ్చరించారు. మాజీ ఎంపీపీ మహేష్ పై అక్రమ హత్యాయత్నం కేసులు పెట్టి అర్ధరాత్రి అరెస్ట్ చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు, పోలీసులు సాధించింది ఏంటని ఆయన ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు.
భారాస లీగల్ టీమ్ వాదనల మేరకు గౌరవ న్యాయస్థానం రిమాండ్ కేసు కాగితాలు పరిశీలించి, అధ్యయనం చేసి హత్యాయత్నం ఛాయలు లేవని నిర్ధారిస్తూ మాములు ఘర్షణ కేసుగా పరిగణలోకి తీసుకొని కేసులోని సెక్షన్ లన్నీ ముద్దాయిలకు బెయిలు ఇవ్వదగినవిగా పేర్కొంటూ మహేష్ కు బెయిలు మంజూరు చేసిందని ఆయన తెలిపారు. గురువారం అర్ధరాత్రి జ్యూడీషియల్ రిమాండ్ కు తేవాల్సిన అవసరం వేల్పూర్ పోలీస్ అధికారులకు ఏమోచ్చిందని ప్రశ్నించినట్లు పేర్కొన్నారు.
హత్యలు, హత్యాయత్నాలు, కుట్రలు కాంగ్రెస్ పార్టీకి అలవాటేనని పేర్కొంటూ కుట్రలను భారాస లీగల్ టీమ్ ఛేదిస్తుందని మధుసుదన్ రావు తెలిపారు. భారాస నాయకులు, కార్యకర్తలకు అండగా భారాస లీగల్ టీమ్ న్యాయవాదులు నిలబడతారని అన్నారు. భారాస లీగల్ టీమ్ న్యాయవాదులు రమేష్, కృష్ణంరాజు, పోడేటి శంకర్, మధుసుధన్ రావు, బాల్కొండ శాసన సభ్యులు, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, మాజీ శాసన సభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దాదాన్నగారి విట్టల్ రావు అభినందించారు.