నిజామాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రుణమాఫీ పేరిట రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మభ్యపెడుతున్నదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మె ల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. తక్కువ మందికి రుణమాఫీ చేసినందుకు సంబురాలు చేసుకోవాలా? అని ప్రశ్నించారు. గురువారం వేముల ఒక ప్రకటన విడుదల చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే ఉమ్మడి జిల్లాలో ఎక్కువ మంది రైతులకు లబ్ధి చేకూరినట్లు తెలిపారు. ఎవరెక్కువ చేశారు? ఎవరెక్కువ మందికి రుణమాఫీ ప్రయోజనం కల్పించారో? లెక్కలు చూడాలంటూ సవాల్ విసిరారు. కేసీఆర్ ప్రభుత్వంలో 2016లో మొదటిసారి లక్షలోపు రుణాలు కలిగి ఉన్న 3లక్షల 79వేల 520 మంది రైతులకు రూ.1576 కోట్లు రుణమాఫీని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చేసినట్లు తెలిపారు.
2018లో రెండోసారి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లక్షలోపు రుణాలను లక్షా 95వేల 657 మంది రైతులకు రూ.942 కోట్లు రుణమాఫీ చేశామని పేర్కొన్నారు. రెండుసార్లు కలిపి లక్షలోపు రుణాలను 5లక్షల 75వేల 177 మంది రైతులకు రూ.2,518 కోట్లు మాఫీ చేసినట్లు వివరించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కేవలం 94వేల 566 మంది రైతులకు రూ.459 కోట్లు మాత్రమే రుణమాఫీ చేశారని మండిపడ్డారు. రైతు సంక్షేమం కోసం ప్రపంచంలోనే ఏ రాజకీయ పార్టీ, ఏ రాజకీయ నాయకుడు తలపెట్టని కార్యక్రమాలను కేసీఆర్ చేసి చూపించారని తెలిపారు. 60 ఏండ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ రైతుబంధు, రైతుబీమా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వానకాలం సీజన్‌కు సంబం ధించి ఎకరానికి రూ.7500 చొప్పున రైతుభరోసా ఇవ్వా ల్సి ఉండగా రూ.11,250 కోట్లు ఎగ్గొట్టి ఆ డబ్బులతో రుణమాఫీ కింద రూ.6098 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. ఏదో ఘనకార్యం చేసినట్లుగా గ్లోబెల్స్ ప్రచారాన్ని కాంగ్రెస్ చేస్తుండడం దురదృష్టకరమని పేర్కొన్నారు.ఈ మోసానికి రైతులు సంబురాలు చేసుకోవాలా? అని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రం మొత్తం రుణమాఫీని 37లక్షల మంది రైతులకు వర్తింపజేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డు, లోన్ రీషెడ్యూల్, ఆదాయ పన్ను పేరిట కొర్రీలు పెట్టి 26లక్షల మంది రైతులను ఏరి పారేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఇప్పుడు కేవలం 11లక్షల మంది రైతులకు కుదించి రుణమాఫీ అమలు చేస్తున్నారని తెలిపారు. కేసీఆర్ సహాయం కొండంత అయితే రేవంత్ రెడ్డి సాయం పిడికెడంత మాత్రమేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకుంటున్న దుష్ప్రచారాన్ని రైతులు గమనించాలని సూచించారు. ఉద్యోగాలు చేసుకునే రైతు కుటుంబాలు, చిన్న వ్యాపారాలు చేసుకునే రైతులకు కూడా రుణమాఫీ అమలు చేయాలని వేముల డిమాండ్ చేశారు. లేదంటే రైతుల ఆగ్రహావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయమని ఆయన హెచ్చరించారు.