బిచ్కుంద, ఆగస్టు 25: మండలంలోని షెట్లూర్ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో సోమవారం మధ్యాహ్న భో జనం వికటించి 22 మంది విద్యార్థులు అస్వస్థతకు గు రయ్యారు. వీరిని 108 అంబులెన్సుల్లో స్థానిక ప్రభు త్వ దవాఖానకు తరలించి చికిత్స అందించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తెలిపిన వివరాల ప్రకారం.. పాఠశాలలో మొత్తం 44 మంది విద్యార్థులు చదువుతుండగా, సోమవారం 28మంది హాజరయ్యారు.
రోజు మాదిరిగా విద్యార్థులు మధ్యా హ్న భోజనం చేశారు. భోజనంలో ఉడికి ఉడకని అన్నంతోపాటు మిల్ మేకర్ కర్రీని వడ్డించారు. గంట తర్వాత 22 మంది విద్యార్థులు వాంతులు, విరేచనాలు చేసుకోవడంతో గమనించిన ఉపాధ్యాయులు రెండు 108 అంబులెన్సుల్లో బిచ్కుంద ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు దవాఖానకు చేరుకొని ఆందోళన వ్యక్తంచేశారు. బాన్సువాడ సబ్‌కలెక్టర్ కిరణ్మయి విద్యార్థులను పరామర్శించి, ఘటనపై ఆరా తీశారు. విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు.
పాఠశాలకు సరఫరా చేసే బియ్యంలో చాలా కాలం నుంచి పురుగులు వస్తున్నాయని సబ్ కలెక్టర్ దృష్టికి పలువురు తీసుకెళ్లారు. నీటి సౌకర్యం లేక పోవడంతో మిషన్ భగీరథ నీటితో మధ్యాహ్న భోజనం వండుతున్నారని, ఐదు రోజులుగా నీరు రంగు మారి వస్తుందని తెలిపారు. పురుగుల అన్నం రంగుమారిన నీళ్లతోనే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని గ్రామస్తులు వాపోయారు. ఈ విషయం ఎంఈవోకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పందించిన సబ్ కలెక్టర్ విచారణ చేపట్టి నివేదికను పంపించాలని, మధ్యాహ్న ఏజెన్సీ నిర్వాహకులను మార్చాలని డీఈవో రాజును ఆదేశించారు.
విద్యార్థులను పరామర్శించిన షిండే
మధ్యాహ్న భోజనం వికటించి దవాఖానలో చికిత్స పొందుతున్న విద్యార్థులను జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పరామర్శించారు. అస్వస్థతకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మె రుగైన వైద్యం అందించాలని సిబ్బందికి సూచించారు. షిండే వెంట నాల్చర్రాజు, బస్వరాజ్ పటేల్ ఉన్నారు.