డిచ్పల్లి, జూలై 27 : బంజారాల ఐక్యతతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆలిండియా బంజారా సేవా సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్ అన్నారు. మండలంలోని బర్దిపూర్లోని ఓ ఫంక్షన్ హాలులో ఆదివారం బంజారా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆలిండియా బంజారా సేవా సంఘ్ జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ ఉమేశ్ జాదవ్, రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాములునాయక్ మాట్లాడుతూ.. తాను గత ప్రభుత్వ హయాంలో తండాలను పంచాయతీలుగా చేయించానన్నారు.
బంజారాలు సేవాలాల్ మహరాజ్ చరిత్రను తెలుసుకుని, ఆయన అడుగుజాడల్లో నడవాలని సూచించారు. రానున్న స్థానిక ఎన్నికల్లో బంజారాలు అత్యధిక స్థానాలను గెలిచి, తండాల అభివృద్ధి కృషి చేయాలని కోరారు. తండాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే రూ.500 కోట్ల నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన అభివృద్ధికి ఆటంకం కలిగించేవారిని సహించేది లేదన్నారు. మాజీ ఎంపీ సోయాం బాపురావు కుట్రలను తిప్పి కొట్టడానికి ప్రతిఒక్కరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ఆలిండియా బంజారా సేవా సంఘ్ జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ ఉమేశ్ జాదవ్ మాట్లాడుతూ.. బంజారాలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. కర్ణాటక, మహారాష్ట్రలో ముగ్గురు బంజారాలకు మంత్రి పదవులు ఇచ్చారని, తెలంగాణలో బంజారాలకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రానున్న ఎన్నికల్లో బంజారాల జనాభాకనుగుణంగా అన్ని రాజకీయ పార్టీలు టికెట్లను కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీహరి, రాష్ట్ర సలహాదారుడు కిషన్‌సింగ్, గౌరవ అధ్యక్షుడు రామారావు, జిల్లా అధ్యక్షుడు మోహన్‌నాయక్, రాంచందర్, నరహరి, రవికుమార్, ఓమాజీ, దశరథ్, శివలాల్, పీర్సింగ్, డాక్టర్ మోతీలాల్, 33 జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు.