బోధన్, ఆగస్టు 30: భారీ వర్షాలు, మంజీర, గోదావరి వరదలతో బోధన్ నియోజకవర్గంలో జనజీవనం స్తంభించడం ఆందోళన కలిగిస్తున్నదని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ ఆవేదన వ్యక్తంచేశారు. వరదల్లో కొన్ని గ్రామాలు జలదిగ్బంధమయ్యాయని, రైతుల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని శనివారం ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తంచేశారు.
రోడ్లు దెబ్బతిన్నాయని, ఇండ్లు కూలిపోయాయని , ప్రకృతి వైపరీత్యం దురదృష్టకరమని పేర్కొన్నారు. తాను ఎప్పటికప్పుడు నియోజవర్గంలోని నాయకులతో మాట్లాడుతూ వరద, భారీ వర్షాల పరిస్థితిని తెలుసుకుంటున్నట్లు తెలిపారు. బాధితులను ఆదుకునేందుకు సహాయక చర్యలో పాల్గొనాలని బీఆర్ఎస్ నాయకులకు సూచించినట్లు తెలిపారు.