ఖలీల్‌వాడి, నవంబర్ 20 : రైతులు, ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన కాంగ్రెస్ పార్టీ.. ఏ ముఖం పెట్టుకుని విజయోత్సవ సభ నిర్వహిస్తున్నదని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. రేవంత్ సర్కారు ఇలాగే వ్యవహరిస్తే ప్రజలు తిరగబడడం ఖాయమని హెచ్చరించారు. దేవుళ్లపై ఒట్లు పెట్టి, దేవుళ్లకే శఠగోపం పెట్టిన ఘనుడు సీఎం రేవంత్‌రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలేనని మండిపడ్డారు.
రేవంత్‌రెడ్డికి పీసీసీ, సీఎం పదవులు కేసీఆర్ పెట్టిన భిక్షేనని, ఆనాడు చావునోట్లో తలపెట్టి కేసీఆర్ తెలంగాణ తేవడం వల్లే రేవంత్‌కు అవకాశమొచ్చిందని గుర్తుచేశారు. అలాంటి కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని రేవంత్‌రెడ్డి అంటుండు. ఆయనను టచ్ చేసి చూడు రాష్ట్రం అగ్నిగుండమవుతుందని హెచ్చరించారు. నిజామాబాద్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వరంగల్‌లో జరిగింది విజయోత్సవ సభ కాదని, కాంగ్రెస్ విషాద సభ అని ఎద్దేవా చేశారు.
కేసీఆర్‌ను ముట్టుకుంటే రాష్ట్రమంతా అల్లకల్లోలమవుతుందని జీవన్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ వటవృక్షమని, ఆయనను పెకిలించడం మీ గురువు చంద్రబాబు, వైఎస్సార్, రోశయ్య, కిరణ్కుమారెడ్డిలతోనే కాలేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రైతుభరోసా, రుణమాఫీ, పది రకాల పంటలకు మద్దతు ధర ఎటు పోయిందని నిలదీశారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ను, కాంగ్రెస్ నాయకులను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, ఇదే మాదిరి పాలన కొనసాగితే గ్రామాలకు వస్తే అడ్డుకోవడం ఖాయమన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో నిజామాబాద్ ప్రథమ పౌరురాలు నీతూకిరణ్ భర్తకు రక్షణ లేకుండా పోయిందని, ఇక సామాన్య ప్రజల పరిస్థితి వేరే చెప్పనక్కర్లేదని జీవన్‌రెడ్డి అన్నారు. పట్టపగలే బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేస్తున్నారంటే కాంగ్రెస్ నాయకుల మద్దతే కారణమన్నారు. పీసీసీ ప్రెసిడెంట్ ఉన్న జిల్లాలో ప్రజలకు రక్షణ లేదన్నారు. దాడి చేసిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జడ్పీ మాజీ చైర్మన్ విఠల్‌రావు, నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు రాజు, నేతలు తెలంగాణ శంకర్, సుజీత్‌సింగ్ ఠాకూర్, సత్యప్రకాశ్, రవిచంద్ర పాల్గొన్నారు.
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి గుజరాతీ గులామ్ అని రేవంత్‌రెడ్డి అంటుండు. రేవంత్‌రెడ్డి ఇటలీ గులామ్ అని కిషన్‌రెడ్డి అంటుండు. ఇలాంటి గులాంలు మనకు అవసరమా? తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలను రద్దు చేయాలన్నారు. వరంగల్‌లో రేవంత్‌రెడ్డి మాటలు విని అబద్ధమే సిగ్గుతో తలదించుకున్నదని ఎద్దేవాచేశారు. మహారాష్ట్రలో సైతం అబద్ధపు ప్రచారాలు చేసి అబద్ధపు హామీలిచ్చారన్నారు. రైతులకు 9 హామీలిచ్చి ఒక్కటి అమలుచేసిన పాపాన పోలేదని గుర్తుచేశారు. రైతుల పక్షాన నిలిచింది బీఆర్ఎస్ పార్టీ అయితే, నేడు రైతులను నిండా ముంచింది కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. ఫాదర్ ఆఫ్ ద లయ్యర్, తెలంగాణ ప్రజలకు డయ్యర్ రేవంత్‌రెడ్డి అన్నారు.