బిచ్కుంద, జూన్ 21: జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే వినూత్నంగా నిరసన చేపట్టారు. బిచ్కుంద పట్టణంలో సెంట్రల్ లైటింగ్, రోడ్డు విస్తరణ పనులు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి బస్టాండు వద్ద ప్రధాన రహదారిపై ఏర్పడిన మోకాలు లోతు గుంతల్లో నిలిచిన బురదనీటిలో కూర్చొని నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా షిండే మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండున్నరేండ్లు గడుస్తున్నా ఇప్పటివరకు పనులు పూర్తి చేయడం లేదని మండిపడ్డారు. పనులు పూర్తికాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు.
జుక్కల్ నియోజక వర్గానికి గుండెకాయలాం టి బిచ్కుంద పట్టణాన్ని మరింత అధ్వానంగా మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అభివృద్ధిని పూర్తి గా విస్మరించారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభు త్వం వచ్చాక బిచ్కుందలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. శనివారం కురిసిన చిన్నపాటి వర్షానికే రోడ్డుపై ఏర్పడిన భారీ గుంతల్లో నీరు నిలిచి వాహనదారులు గాయాలపాలవుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే కండ్లు తెరిచి ప్రజల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సెంట్రల్ లైటింగ్ పనులు పూర్తి చేయాలన్నారు. బిచ్కుంద -బాన్సువాడ రోడ్డులో మద్దెల్ చెరువు నుంచి కందర్పల్లి వరకు 7 మీటర్ల వెడల్పుతో తారు రోడ్డు తన హ యాం లో మంజూరైందని తెలిపారు. పనులు చేపట్టడం చేతగాక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు.సెంట్రల్ లైటింగ్,రోడ్డు విస్తరణ పనులు పది రోజుల్లో ప్రారంభించకపోతే రిలే నిరాహార దీక్షలు చేపడుతామని హెచ్చరించారు.
కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని మాజీ ఎమ్మెల్యే షిండే అన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్ రైతులను అన్ని విధాలుగా ఆదుకున్నారని గుర్తుచేశారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఇచ్చిన హామీలను అమలుచేయకుండా రైతులను మోసం చేస్తున్నదని మండిపడ్డారు. రైతులు పండించిన పంటలను సకాలంలో కొనుగోలు చేయడంలో రేవంత్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
యూరియా యాప్‌తో రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. కొంద రు రైతుల వద్ద స్మార్ట్ ఫోన్లు లేవని, ఎలా బుక్ చేయాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. పంట పెట్టుబడి సాయం అందించడంలో రేవంత్ సర్కారు విఫలమైందన్నారు. యూరియా యాప్ ను వెంటనే ఎత్తివేసి పాత విధానంలోనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకట్రావు దేశాయ్, ఏఎంసీ మాజీ చైర్మన్ నాల్చర్ రాజు, మాజీ వైస్ ఎంపీపీ రాజు పటేల్, సొసైటీ చైర్మన్ నాల్చర్ బాలాజీ, నాయకులు సంజు పటేల్, బొమ్మల్ లక్ష్మణ్, మైపత్ హన్మాండ్లు, రాంచందర్, నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.