కంఠేశ్వర్/ ఖలీల్‌వాడి, డిసెంబర్ 9 : సమగ్ర శిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, వారికి న్యాయం చేయాలని నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధన కోసం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మూడు రోజులుగా ఎస్ఎస్ఏ ఉద్యోగులు నిరాహార దీక్షలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో బాజిరెడ్డి సోమవారం వారి వద్దకు వెళ్లి సంఘీభావం ప్రకటించారు. సమగ్ర శిక్ష ఉద్యోగులను రేవంత్ ప్రభుత్వం వెంటనే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కోరారు. మహిళా సిబ్బందికి వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవులు ఇవ్వాలన్నారు. మరోవైపు, తమ సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన కార్యక్రమాలను ఆపబోమని ఎస్ఎస్ఏ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాజు స్పష్టంచేశారు.
మంగళవారం నుంచి పూర్తిస్థాయి సమ్మె చేయనున్నట్లు సమగ్ర శిక్ష ఉద్యోగులు తెలిపారు. ఈ మేరకు సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్‌ను కలిసి సమ్మె సమాచారమిచ్చారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల రెగ్యులరైజేషన్ సాధన కోసం రిలే నిరాహార దీక్షలు చేపట్టినా ప్రభుత్వం నుంచి స్పందన లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మె విరమించేది లేదని స్పష్టంచేశారు.