ఖలీల్‌వాడి, మే 11 : జిల్లాలో ఇప్పటివరకు ఒక్క ఇందిరమ్మ ఇల్లు నిర్మించలేదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. రూ.50వేలు తీసుకొని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను కాంగ్రెస్ పార్టీ నేతలు తమ ఇండ్లల్లో కూర్చొని ఎంపిక చేస్తున్నారని ఆరోపించారు. గ్రామసభల ద్వారానే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తానని హామీ ఇస్తే, ప్రజలు నమ్మి ఓటు వేశారని తెలిపారు. అధికారంలోకి వచ్చి 17 నెలలవుతున్నా దసరా, సంక్రాంతి అంటూ మాటలు చెబుతూ వాయిదా వేస్తున్నారని మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లాలో లక్షా 80 వేల మంది పేదలు దరఖాస్తు చేసుకోగా.. కాంగ్రెస్ నేతలు ఇండ్లలో కూర్చొని 70 వేల మందిని ఎంపిక చేశారని తెలిపారు.
జిల్లాలో 70 వేల మంది అర్హులని చెప్పిన కాంగ్రెస్ నేతలే, ఇప్పుడు 17 వేల మందికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నట్లు ప్రకటించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చిన జీవో 7 ప్రకారం గ్రామసభల ద్వారా అర్హులను ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. గ్రామసభల ద్వారా అంగీకారం తెలిపిన వారికే కలెక్టర్ ఇండ్లను మంజూరుచేయాలని సూచించారు.
గ్రామసభల ద్వారానే ఎంపిక చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు ఒక్క గ్రామసభ నిర్వహించలేదని తెలిపారు. కాంగ్రెస్ నేతలు అక్రమంగా ఎంపిక చేసిన ఫైనల్ లిస్టును ఖరారుచేస్తే పేదలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. న్యాయంగా ఇండ్లు రావాల్సిన వారికి గులాబీ కార్యకర్తలు అండగా నిలువాలని, తహసీల్, పంచాయతీ కార్యాలయాల ఎదుట నిరసన చేపట్టాలని పిలుపునిచ్చారు.
జేబులు నింపుకోవడానికి రాజీవ్ యువ వికాస్
కాంగ్రెస్ నేతలు జేబులు నింపుకోవడానికి రాజీవ్ యువవికాస్ పథకం ప్రవేశపెట్టారని వేముల విమర్శించారు. డబ్బులు ఇచ్చిన వారికి, కాంగ్రెస్ కార్యకర్తలకే ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారని అన్నారు. పథకం ద్వారా రూ. 6500 కోట్లు నేరుగా కాంగ్రెస్ నేతల జేబులు నింపేందుకు పక్కాప్లాన్ వేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు మాత్రమే రాజీవ్ యువ వికాస్ పథకం, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని మినరల్ డెవలప్మెంట్ చైర్మన్ ఈరవత్రి అనిల్ బహిరంగంగా చెబుతున్నారని తెలిపారు.
ఈ సందర్భంగా అనిల్ మాట్లాడిన వీడియోను విలేకరుల సమావేశంలో ప్రదర్శించారు. ఇందిరమ్మ ఇండ్లకు కేటాయించిన రూ.12వేల కోట్లనుంచి రూ. 6,500 కోట్లు కాంగ్రెస్ కార్యకర్తలకు ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. ఎవరి సొమ్మని కాంగ్రెస్ పార్టీ నేతలు జేబులో నింపుకొంటున్నారని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ నిధులు కార్యకర్తలకు ఇచ్చుకుంటే అభ్యంతరం లేదని, తెలంగాణ ప్రజల సొమ్ము పేదలకు చెందాలన్నారు. రాజీవ్ యువవికాస్, ఇందిరమ్మ ఇండ్ల జాబితాలను గ్రామసభల్లోనే ఫైనల్ చేయాలని డిమాండ్ చేశారు. గ్రామసభలు నిర్వహించకుండా రికార్డుల్లో రాసి, కాంగ్రెస్ నేతలు చెప్పిన వారిపేర్లు రాసి కలెక్టర్‌కు పంపితే అధికారులను కోర్టుకు ఈడుస్తామని హెచ్చరించారు.
మందకొడిగా ధాన్యం కొనుగోళ్లు
ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ మందకొడిగా సాగుతున్నదని వేముల తెలిపారు. రైస్‌మిల్లర్లు వెంటనే అన్లోడ్ చేయడం లేదని, సన్నపు వడ్లు తీసుకోవడంలేదన్నారు. నిర్దేశిత లక్ష్యం ప్రకారం 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉండగా.. ఇప్పటివరకు 7 లక్షల 50 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారని తెలిపారు. ఇంకా లక్షా 50 మెట్రిక్ టన్నుల ధాన్యం కల్లాల్లో ఉందన్నారు. లక్షా 20 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం లారీల్లో ఉందని తెలిపారు.
17 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తరుగు కింద తీసేసి, రైస్‌మిల్లర్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. కలెక్టర్ చొరవ తీసుకుని ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. 45 రోజులైనా కొనుగోళ్లు పూర్తి కావడంలేదన్నారు. సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి, 45 రోజులైనా ఇవ్వలేదన్నారు.
అన్ని రకాల వడ్లకు రూ. 500 బోనస్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అందాల పోటీలపై పదిసార్లు సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్‌రెడ్డి..ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ధాన్యం కొనుగోళ్లపై కూడా సమీక్షించాలని సూచించారు. సమావేశంలో జడ్పీ మాజీ చైర్మన్ విఠల్‌రావు, నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, బీఆర్ఎస్నాయకులు సత్యప్రకాశ్, సూదం రవిచందర్, నవీద్ ఇక్బాల్, రాజాగౌడ్, ప్రవీణ్‌రెడ్డి పాల్గొన్నారు.