మోర్తాడ్, మే 13: కలెక్టర్ మాట ఇచ్చిన ప్రకారం ఈ రోజు నుంచి ఎనిమిది రోజుల్లోగా ధాన్యం సేకరణ పూర్తి చేయాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. బుధవారం కమ్మర్పల్లి మండలం కోనాసముందర్ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి, కల్లాల వద్ద రైతులతో మాట్లాడి ధాన్యం సేకరణలో ఎదురవుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. అక్కడి నుంచే అడిషనల్ కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోనాసముందర్ కేంద్రంలో ధాన్యం నిల్వలు పెరిగి పోతున్నాయని, ప్రస్తుతం వస్తున్న రెండు లారీలు సరిపోవన్నారు.
వానాకాలం సమీపిస్తున్న తరుణంలో ధాన్యం తడవకుండా ఉండాలంటే లారీల సంఖ్యను పెంచి, కలెక్టర్ ఇచ్చిన మాట ప్రకారం ధాన్యం సేకరణ పూర్తి చేయాలని సూచించారు. నిజామాబాద్‌లోని భువనేశ్వర్ రైస్ మిల్ వారు సంచికి 43 కిలోల చొప్పున అడుగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఇది నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. రైతుల కష్టాన్ని మిల్లర్ల పాలు చేయనివ్వమని, ధాన్యం సేకరణ విషయంలో మిల్లర్లు వ్యవహరిస్తున్న తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. సంచికి 41.5 కిలోల చొప్పున మాత్రమే ధాన్యం తీసుకోవాలని స్పష్టం చేశారు.
బషీరాబాద్ కేంద్రంలో ఇప్పటివరకు కేవలం 20 శాతం ధాన్యం మాత్రమే లిఫ్ట్ అయ్యిందని, మిగిలిన 80 శాతం ఇంకా కల్లాల్లోనే ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బషీరాబాద్‌లో కూడా లారీల సంఖ్యను పెంచాలని, ధాన్యం లారీలకు ఆటంకం కలగకుండా చూడాలని, అవసరమైతే మట్టి లేదా పెండ తరలించే వాహనాలను కూడా ధాన్యం రవాణాకే వాడాలని సూచించారు. ట్రాన్స్పోర్టర్ల నిర్లక్ష్యంపై కఠినంగా వ్యవహరించాలని కోరారు. రైతులు పండించిన ప్రతి గింజనూ తరుగు లేకుండా ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయాలని, వర్షాల ముప్పు పొంచి ఉన్నందున యుద్ధ ప్రాతిపదికన ధాన్యం తరలింపు చేపట్టాలని డిమాండ్ చేశారు.