శక్కర్‌నగర్/బోధన్, ఏప్రిల్ 21: బోధన్ ఎమ్మెల్యేగా గెలిచిన సుదర్శన్‌రెడ్డి అహంకారం, నిరంకుశత్వం ప్రదర్శిస్తున్నారని, ఆయనకు లోక్‌సభ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి, బాల్కొండ వేముల ప్రశాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రతిపక్ష నేతలపై కేసులు పెడతామని బెదిరించడం, అవిశ్వాస తీర్మానాలతో రాజకీయాలు చేయడం చూస్తుంటే.. సుదర్శన్‌రెడ్డికి పోయేకాలం దగ్గరపండిందని అనిపిస్తున్నదని, ఆయనకు బోధన్ నియోజకవర్గ ప్రజలే తగిన గుణపాఠం చెప్పే రోజలు వచ్చాయని అన్నారు. ఎడపల్లి మండల కేంద్రంలోని సరయూ ఫంక్షన్ హాల్లో ఆదివారం రాత్రి నిర్వహించిన బీఆర్ఎస్ బోధన్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో వేముల ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్‌పై పోలీసులు అక్రమ కేసులు పెట్టి వేధించడం దుర్మార్గమని, పిల్లవాడన్న జ్ఞానం కూడా లేకుండా రాజకీయకక్షతో ఇలా చేయడాన్ని ప్రజలు క్షమించబోరని అన్నారు. షకీల్ అందుబాటులో లేకపోయినా కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటుచేసి బాధ్యతలను తన భుజాలకు ఎత్తుకున్న ఆయన సతీమణి ఆయేషా ఫాతిమాను అభినందించారు. బీఆర్ఎస్కు కార్యకర్తలే అండగా ఉన్నారని, లోక్‌సభ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ను గెలిపించేందుకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం అమలుచేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎంపీ అర్వింద్‌తో సుదర్శన్‌రెడ్డి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని గెలిచాడని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా జీవన్‌రెడ్డిని నిలబెట్టడం వెనుక సుదర్శన్‌రెడ్డి హస్తం ఉన్నదని, ఆయన అడ్డును కూడా తొలగించుకునే దురుద్దేశం ఉందన్నారు. వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామంటూ గద్దెనెక్కిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించిందని అన్నారు.
నిజామాబాద్ ఎంపీగా గెలిచిన వెంటనే బోధన్ – బీదర్ రైల్వేమార్గాన్ని నిర్మాణం చేయిస్తానని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని కాంగ్రెస్, బీజేపీలు రాజకీయం కోసం వాడుకుంటున్నాయని, ఆ పార్టీలకు చెరుకు రైతులు, కార్మికులపై ఎంతమాత్రం చిత్తశుద్ధిలేదని విమర్శించారు. తాను ఎంపీగా గెలిచిన తర్వాత నిజాం షుగర్స్‌ను తెరిపించే బాధ్యత తీసుకుంటానన్నారు. ఐదేండ్లపాటు ఎంపీగా ఉన్న అర్వింద్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించేందుకు ఎందుకు ప్రయత్నించలేదని గోవర్ధన్ ప్రశ్నించారు. బోధన్ నియోజకవర్గంలో సుదర్శన్‌రెడ్డి అరాచకాలను ఎదుర్కొంటానని పేర్కొన్నారు. తనను అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు శక్తివంచనలేకుండా కృషిచేయాలని కోరారు. సమావేశం అనంతరం ఆయేషా ఫాతిమా ఆధ్వర్యంలో ఈద్ మిలాప్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్, బోధన్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్చార్జి దాదన్నగారి విఠల్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్‌రెడ్డి, బిగాల గణేశ్ గుప్తా, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, బోధన్ మాజీ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ సతీమణి ఆయేషా ఫాతిమా, బీఆర్ఎస్ బోధన్ నియోకజవర్గం నాయకులు గిర్దావర్ గంగారెడ్డి, పి.రవికిరణ్, గోగినేని నరేంద్రబాబు (నర్సయ్య), సంజీవ్‌కుమార్, రవీందర్‌యాదవ్, నర్సింగ్‌రావు, ఎం.ఎ.రజాక్, భూంరెడ్డి, శ్రీరామ్, తెలంగాణ శంకర్, ఎడపల్లి ఎంపీపీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.