మోర్తాడ్, జనవరి 20: సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలేదంటూ మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి నిరసన వ్యక్తంచేశారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులతో పాటు తులం బంగారం ఇస్తామని సీఎం ఇచ్చిన మాట తప్పినందుకు ఈదఫా చెక్కు ల పంపిణీ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నానంటూ కలెక్టర్‌కు లేఖ రాసి, ప్రభుత్వ తీరుపై నిరసన తెలియజేశారు. లేఖలోని వివరాలు..
కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కల్యాణలక్ష్మి పథకం కింద లక్ష రూపాయల చెక్కుతోపాటు తులం బంగారం కూడా ఇస్తానని రేవంత్‌రెడ్డి మాట ఇచ్చారని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చి ఏడాదిమీద నెలరోజులు గడిచినా ఇప్పటికీ తులం బంగారం ఇవ్వక మాట తప్పినందుకు నిరసనగా చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఈదఫా వచ్చిన చెక్కులను ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శుల ద్వారా గ్రామంలోనే నేరుగా లబ్ధిదారులకు అందజేయాలని సూచించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం వెంటనే తులం బంగారం పథకాన్ని మొదలుపెట్టాలని, ప్రభు త్వం ఏర్పడిన రోజు నుంచి ఇప్పటి వరకు కల్యాణలక్ష్మి చెక్కులు అందుకున్న లబ్ధిదారులందరికీ కూడా తులం బంగారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.