బిచ్కుంద, సెప్టెంబర్ 16: జుక్కల్ నియోజక వర్గానికి కేంద్ర బిందువుగా ఉన్న బిచ్కుంద ప్రభుత్వ దవాఖానలో రెగ్యులర్ వైద్యులను వెంటనే నియమించాలని మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన బిచ్కుంద ప్రభుత్వ దవాఖానను సందర్శించారు. రోగులతో మా ట్లాడి వైద్యసేవల గురించి అడిగి తెలుసుకున్నారు. రోగులకు సరిపడా డాక్టర్లు లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు.
30 పడకల దవాఖానలో కనీసం పది మంది డాక్టర్లు ఉండాల్సి ఉండగా కేవలం నలుగురు డిప్యుటేషన్‌పై విధులు నిర్వర్తించడంపై షిండే అసహనం వ్యక్తంచేశారు. వర్షాల కారణంగా వ్యాధులు విజృంభిస్తున్న నేపథ్యంలో దవాఖానకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందికి సూచించారు. అందుబాటులో ఉన్న వైద్యుల వివరాలు, మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై దవాఖాన సూపరింటెండెంట్ కాళిదాస్‌ను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా షిండే మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే వంద పడకల దవాఖానగా అప్‌గ్రేడేషన్ చేసినట్లు తెలిపారు. ఎన్నికలకు ముందు ప్రస్తుత ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు బిచ్కుంద ప్రభుత్వ దవాఖానలో ఒకే డాక్టర్ ఉన్నాడని విమర్శించారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 22 నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఒక్క రెగ్యులర్ డాక్టర్‌ను ఎందుకు నియమించలేదని ప్రశ్నించారు. రెగ్యులర్‌గా ఒక్క డాక్టర్ లేకుండానే దవాఖాన నడుస్తున్నదన్నారు.
అధికారంలో లేని సమయం లో తోట లక్ష్మీకాంతారావు తాను మాట్లాడిన మాటలను ఒక్కసారి గుర్తుచేసుకోవాలని సూచించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పం దించి దవాఖానలో రెగ్యులర్ వైద్యులను నియమించాలని డిమాండ్ చేశా రు. షిండే వెంట సొసైటీ చైర్మన్ నాల్చర్ బాలాజీ, వైస్ చైర్మన్ యాదారావు, డాక్టర్ రాజు, బస్వరాజ్ పటేల్, అవార్ శ్రీనివాస్, అశోక్, ముఖిద్, కొనింటి విఠల్, బజరంగ్ తదితరులు ఉన్నారు.