Andrew Strauss : ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్ (Andrew Strauss) రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య చనిపోయిన ఏడేళ్లకు అతడు మళ్లీ వివాహ బంధంలో అడుగుపెట్టాడు. హాంకాంగ్‌కు చెందిన ఆంటోనియా లిన్నేస్ పీట్(Antonia Linnaeus-Peat, Ruth)ను స్ట్రాస్ మనువాడాడు. ఈ విషయాన్ని అతడు ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు. నన్ను నా బిడ్డలను ప్రేమిస్తున్నందుకు ధన్యవాదాలు అని భార్య మంచితనాన్ని పొగుడుతూ పోస్ట్ పెట్టాడు స్ట్రాస్.
‘ప్రపంచంలో మాకు ఎంతో ఇష్టమైన ప్రదేశంలో ప్రత్యేకమైన రోజును సెలట్రేట్ చేసుకుంటున్నాం. నన్ను, నా పిల్లలను ప్రేమిస్తున్నందుకు నీకు ధన్యవాదాలు. నీలాంటి వ్యక్తి లభించినందుకు నేను అదృష్టవంతుడిని. మై గర్ల్.. మనం జీవితకాలం అందమైన జ్ఞాపకాలను మిగుల్చుకుందాం’ అని స్ట్రాస్ తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు. లిన్నేస్ విషయానికొస్తే ఆమె ఒక పీఆర్ ఎగ్జిక్యూటివ్. ప్రస్తుతం ఆమె తన పేరిటనే నడుపుతున్న లిన్నేస్ ఫైన్ ఆర్ట్ అడ్వైజరీ లిమిటెడ్ కంపెనీకి డైరెక్టర్. స్ట్రాస్ కంటే ఆంటోనియా18 ఏళ్లు చిన్నది.
స్ట్రాస్ మొదటి భార్య రుతుకు 2018 ఆరంభంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉందని తేలింది. ఆ రుగ్మతకు చికిత్స లేదని వైద్యులు చెప్పారు. దాంతో.. ప్రాణాంతకమైన క్యాన్సర్‌తో పోరాడిన రుతు అదే ఏడాది డిసెంబర్ 29న ఆమె కన్నుమూసింది. అప్పటికీ వారికి 13, 10 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమారులున్నారు. ఆమె జ్ఞాపకార్థం 2019లో స్ట్రాస్ సేవా సంస్థను ఏర్పాటు చేశాడు. ఆ సంస్థ ద్వారా నిధులు సేకరించి.. పొగాకు రహిత ఊపిరితిత్తుల క్యాన్సర్ బాధిత కుటుంబాల ఆర్ధిక సాయం చేస్తున్నాడు.