కామారెడ్డి, మే 29 : కామారెడ్డి మండలం నర్సన్నపల్లి గ్రామ శివారులోని ఓ స్విమ్మింగ్ పూల్‌లో స్విమ్మింగ్ చేస్తూ ఊపిరాడక మృతి చెందిన సంఘటన చోటు చేసుకున్నది. దేవునిపల్లి ఎస్సై రంజిత్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో అటవీ శాఖ సెక్షన్ అధికారిగా పనిచేస్తున్న చింతకింది శ్రీనివాస్ (43) కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విద్యానగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు.
తన కుమారుడికి ఈత నేర్పించేందుకు గురువారం సాయంత్రం నర్సన్నపల్లి శివారులోని స్విమ్మింగ్ పూల్‌కు తీసుకెళ్లాడు. అక్కడ కుమారుడికి ఈత నేర్పిస్తున్న క్రమంలో శ్రీనివాస్ ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోవడంతో కొడుకు గట్టిగా కేకలు వేశాడు. వెంటనే అక్కడున్న వారు నీటిలో మునిగిపోయిన శ్రీనివాస్‌ను బయటికి తీసి సీపీఆర్ చేసి, జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు తెలిపారు. శ్రీనివాస్‌కు ఈత సరిగ్గా రాకపోవడంతో నీట మునిగి మరణించాడని ఎస్సై తెలిపారు. శ్రీనివాస్‌కు భార్య, ఒక కుమారుడు,కుమార్తె ఉన్నారు. భార్య స్వప్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.