మన డబ్బులకు రెట్టింపు ఇస్తామంటూ నెలరోజుల్లో ఇద్దరికి టోకరా
చెత్త పేపర్ల బ్యాగులు అప్పగించి ఉడాయించిన దుండగులు
పోలీసులను ఆశ్రయించిన బాధితులు
శక్కర్‌నగర్, మే 23 : ఇండియన్ కరెన్సీకి రెట్టింపు విదేశీ డబ్బులు ఇస్తామని ఓ ముఠా మోసాలకు పాల్పడుతున్నది. బోధన్‌ను కేంద్రంగా ఎంచుకుని ఆ ముఠా పని చేస్తున్నదనడానికి ఇటీవల వెలుగు చూసిన సంఘటనలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. నెలరోజుల వ్యవధిలో ఇద్దరు వ్యక్తులను దుండగులు ఇండియా డబ్బులకు విదేశాలకు చెందిన డబ్బులు రెట్టింపు ఇస్తామని మోసానికి పాల్పడిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఏప్రిల్ 10న ఓ జంట బాన్సువాడ పట్టణంలోని ఇస్లాంపురాకు వెళ్లింది. జంటలోని వ్యక్తి తన పేరు శివకుమార్ అని అక్కడే నివాసం ఉండే ఎజాజ్ ఖాన్‌కు పరిచయం చేసుకున్నాడు. తనవద్ద దుబాయ్‌కు చెందిన కరెన్సీ ఉందని తెలిపాడు. తమకు అత్యవసరంగా ఊరికి వెళ్లాల్సి ఉందని ఇక్కడి డబ్బులు అవసరం ఉన్నాయని తెలిపాడు. ఆదివారం కావడంతో కరెన్సీని మార్చుకునేందుకు అవకాశం లేదని నమ్మబలికాడు. దీంతో ఎజాజ్‌ఖాన్ బేరం ఆడి రూ.500లకు విదేశీ కరెన్సీని సదరు వ్యక్తి నుంచి తీసుకున్నాడు. శివకుమార్‌గా పరిచయం చేసుకున్న వ్యక్తి ఎజాజ్‌ఖాన్ నుంచి సెల్‌ఫోన్ నంబర్‌ను తీసుకున్నాడు. ఎజాజ్‌ఖాన్ విదేశీ కరెన్సీని మార్చుకున్నాడు.
తిరిగి 14వ తేదీన సదరు వ్యక్తి ఫోన్ చేసి తాను బోధన్‌లో ఉన్నానని తన వద్ద రూ.5లక్షల విలువ చేసే విదేశీ కరెన్సీ ఉందని చెప్పాడు. దీంతో ఎజాజ్‌ఖాన్ రూ.2.5 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడు. ఒప్పందం ప్రకారం రూ.2.50 లక్షలు వారికి ఇవ్వగా రూ.5లక్షల విలువ చేసే విదేశీ కరెన్సీ ఉందని చెప్పి ఓ బ్యాగును ఎజాజ్‌ఖాన్‌కు అప్పగించి వెళ్లిపోయా రు. బ్యాగును తెరచి చూడగా.. అందులో చిత్తుకాగితాలు, న్యూస్‌పేపర్లు మాత్రం కనిపించడంతో ఎజాజ్‌ఖాన్ మోసపోయానని గ్రహించాడు. వారికోసం వెతికినా ఫలితం లేకపోయింది. దీంతో 18న బోధన్ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్న క్రమంలోనే ఇదే తరహాలో మరో మోసం వెలుగు చూసింది. ఈ నెల 21న సాయంత్రం మ హారాష్ట్రలోని నాందెడ్‌కు చెందిన సజ్జత్ పటేల్ అనే వ్యక్తిని బోధన్‌లోని పోస్టాఫీస్ ప్రాంతానికి పిలిపించుకున్నారు. అతని వద్ద నుంచి రూ.2.5 లక్షలు తీసుకుని రూ.5 లక్షల విలువైన విదేశీ కరెన్సీ ఉందని చెప్పి ఓ బ్యాగును సజ్జత్పటేల్కు అప్పగించి దుండగులు వెళ్లిపోయారు. కొద్దిసేపటికి సజ్జత్ పటేల్ బ్యాగును తెరచి చూడగా అందులో తెల్లకాగితాలు కనిపించడంతో నివ్వెరపోయి రాత్రి బోధన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టా రు. రాత్రి వాహనాల తనిఖీ ముమ్మరం చేశారు. సమీపంలోని సీసీ ఫుటేజీలను సేకరించారు. నెల రోజుల్లోపే రెండు సంఘటనలు చోటు చేసుకోవడంతో బోధన్‌లో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విచారణ జరుపుతున్నాం.. : ఏసీపీ
బోధన్‌లో డబ్బు మార్పిడి పేర జరిగిన మోసాలపై విచారణ జరుపుతున్నామని బోధన్ ఏసీపీ నిగిడాల రామారావు తెలిపారు. ఈ నెల 21న రాత్రి సమయంలో జరిగిన సంఘటనతో పాటు ఇటీవల ఇదే తరహాలో జరిగిన మోసంపై ఆయనను వివరణ కోరగా, గతంలోనే అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించామన్నారు. అయినా, ప్రజలు శ్రమలేకుండా డబ్బులు సంపాదించాలనే దురాశతో మోసాల బారిన పడుతున్నారని అన్నారు. అయితే, రెండు సంఘటనలు కూడా ఒకే విధంగా జరగడంపై ఆరా తీస్తున్నామని, రెండు సంఘటనల్లో నిందితులు ఒకరేనా? వేర్వేరా ? అనే కోణంలో విచారణ జరుపుతున్నామన్నారు. సీసీ ఫుటేజీలతో పాటు సదరు వ్యక్తుల నమూనాల కోసం బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్నామని వారు ఏ విధంగా పరిచయం అయ్యారనే కోణంలో విచారణ జరుపుతున్నామన్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని అన్నారు. ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని ఏసీపీ రామారావు కోరారు.