వర్ని (రుద్రూర్), మార్చి 19 : ప్రభుత్వ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలు ఆగడం లేదు. వర్ని మండలం కోటయ్య క్యాంప్‌లో ఉన్న ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్లో బుధవారం 23 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్లో ఉదయం అన్నం, పప్పు తిన్న 23 మంది విద్యార్థినులు పాఠశాలకు వెళ్లగానే వాంతులు చేసుకున్నారు.
వారిని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఫుడ్ పాయిజన్ కారణంగానే అస్వస్థకు గురై ఉండవచ్చని విద్యార్థినులకు చికిత్స చేసిన మెడికల్ అధికారిణి స్నేహ తెలిపారు. అనంతరం విద్యార్థులను వసతిగృహానికి పంపించారు. విషయం తెలుసుకున్న డీఎంహెచ్‌వో రాజశ్రీ ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్‌కు వెళ్లి విద్యార్థినులతో మాట్లాడారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందజేయాలని వార్డెన్‌కు సూచించారు. డీఎంహెచ్‌వో వెంట డాక్టర్ అయేషా సిద్ధిఖా, రవి ఉన్నారు.