నిజామాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిజామాబాద్ నగరంతో పాటు కామారెడ్డి, ఆర్మూర్, బోధన్ వంటి పట్టణాల్లో వెలిసిన అనేక రెస్టారెంట్లు, హోటళ్లు, బేకరీల్లో పరిశుభ్రత తీసికట్టుగా మారింది. ఆహారంలో పురుగులు, వ్యర్థాలు వెలుగు చూస్తుండడం సాధారణమై పోయింది. అన్నంలో పురుగులు, చెడిపోయిన కూరలు, నాణ్యతలేని బిర్యానీలు, కంపుకొడుతున్న మాంసపు ముక్కలు రావడం పరిపాటిగా మారింది. వందలు వెచ్చించి తింటున్న ఆహారంలో నాణ్యత ఉండడం లేదు.
బేకరీల్లో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. పాచిపోయిన, మిగిలిన ఐటమ్స్ వేడిచేసి కస్టమర్లకు అందిస్తున్నారు. యువత ఇష్టంగా తినే కేకులు, బర్గర్లు, ఫిజ్జాలు, పఫ్‌లు ఏ రోజుకారోజు ఫ్రెష్‌గా తయారు చేసి విక్రయించాల్సి ఉండగా.. మిగిలిపోయిన వాటిని మరుసటి రోజు అమ్మేస్తున్నారు. ఇలా ఎక్కువగా కర్రీ, ఎగ్ పఫ్‌లు విక్రయిస్తున్నారు. ఆహార కల్తీ నియంత్రణ అధికారులు తరచూ తనిఖీలు చేపడితే.. ఇలాంటి ఘటనలు జరగవు. కానీ వారు కనీసం అటువైపు చూడకపోవడం, మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడంతో బేకరీ, హోటళ్ల నిర్వాహకులకు ఆడిందే ఆట, పాడిందే పాటగా తయారైంది.
చూడడానికి బేకరీలు అద్భుతంగా కనిపిస్తున్నా.. వాటి తయారీ కేంద్రాలు మాత్రం కంపుకొడుతున్నాయి. బల్దియా అధికారులు, ఆహార కల్తీ సిబ్బంది పట్టించుకోకపోవడంతో బేకరీల నిర్వాహకుల ఆగడాలకు అడ్డుకట్ట పడడం లేదు. ఇప్పటివరకు ఫుడ్ సేఫ్టీ అధికారులు జరిపిన దాడుల్లో ఎక్కువగా హోటళ్లు, రెస్టారెంట్లే ఉన్నాయి. తిరుబండారాల దుఖాణాలు, బేకరీలు, స్వీట్ హోముల్లో తనిఖీలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. మిఠాయిలకు గడువు తేదీ ఉండడం లేదు.
నిజామాబాద్‌లోని పులాంగ్ దారిలో ఉన్న ఓ స్వీట్ దుకాణంలోని మిఠాయిలో బొద్దింక బయటపడడం గమనార్హం. ఈ విషయంలో బీజేపీ ప్రజాప్రతినిధి ఒకరు జోక్యం చేసుకొని వివాదం సద్దుమణిగేలా చేశారని సమాచారం. ఫిర్యాదు చేయని, ఠాణాకు చేరని ఘటనలో నిత్యం జరుగుతూనే ఉన్నాయి. బేకరీల్లో సాస్ డబ్బాలను శుభ్రం చేయడం లేదు. కాలం చెల్లిన సాస్‌ను అందిస్తున్నారు. అపరిశుభ్ర పదార్థాలను సరఫరా చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. నిత్యం తనిఖీలు నిర్వహిస్తేనే.. హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీల నిర్వాహకుల్లో మార్పు వస్తుందని ప్రజలు అంటున్నారు.
నిజామాబాద్ కార్పొరేషన్ సమీపంలోని ఓ హోటల్లో వినియోగదారులు బిర్యానీ ఆర్డర్ చేయగా.. అందులో నాణ్యత లేమి కనిపించింది. రైథాలో ప్లాస్టిక్ వ్యర్థాలు వచ్చాయి. ఇదేంటని కస్టమర్లు అడిగితే తీసేసి తినాలంటూ ఉల్టా జవాబిచ్చారు నిర్వాహకులు. దీంతో సదరు వ్యక్తులు ఆహార భద్రత, కల్తీ నియంత్రణ అధికారులకు ఫిర్యాదు చేశారు. నెల రోజులవుతున్నా.. పట్టించుకోవడం లేదు.
బస్టాండ్ సమీపంలో ఈ మధ్య వెలిసిన ఓ హోటల్లోనూ ఇదే రకమైన ఘటన వెలుగు చూసింది. బిర్యానీలో లైట్ పురుగులు పడడాన్ని వినియోగదారులు గుర్తించారు. తీసేసి అదే గిన్నెలో బిర్యానీని తిరిగి సర్వ్ చేసినట్లు కస్టమర్లు గుర్తించి కౌంటర్ వద్ద ఉన్న వారితో గొడవ పడ్డారు. తినకుండానే వారు బయటికి వెళ్లి పోయారు.
కొత్త ఏడాది వేడకల కోసం ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఒకరు ప్రగతి నగర్‌లోని ఓ బేకరీలో కేక్‌ను ఆర్డర్ చేశాడు. రాత్రి కేక్‌ను కట్ చేసిన ఆనందంలో ఉండగా.. కేక్‌లో ప్లాస్టిక్ వ్యర్థాలు వెలుగు చూశాయి. ఇదేంటని బేకరీ బాధ్యులను సదరు టీచర్ అడిగితే అడ్డదిడ్డ సమాధానం ఇవ్వడమే కాకుండా.. అతడినే బెదిరించడం గమనార్హం.
గతేడాదిలో సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఆహార కల్తీ నియంత్రణ అధికారులు హల్చల్ చేశారు. వారానికి ఒకసారి హోటళ్లపై దాడి చేసి నిల్వ చేసిన మాంసం, కల్తీ పదార్థాలు, పాడైన ఆహారాన్ని గుర్తించి, నిర్వాహకులకు జరిమానా విధించారు. మూడు నెలలుగా అధికారుల తనిఖీలు లేకపోవడం గమనార్హం. నిజామాబాద్ నగరపాలక సంస్థ సిబ్బంది తనిఖీ చేపట్టి మమ అనిపించారు. ప్రస్తుతం వారు కూడా పర్యవేక్షించకపోవడం అనే రకాల ఊహాగానాలకు తావిస్తున్నది. హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు చేయక పోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఆయా హోటళ్ల యజమానులను బెదిరించి, తమ చెప్పు చేతల్లోకి తెచ్చుకునేందుకు తూతూ మంత్రంగా దాడులు నిర్వహించి మామూళ్ల మత్తులో ఇప్పుడు జోగుతున్నారని విమర్శిస్తున్నారు. ఆహార తయారీ అన్నది నిరంతర ప్రక్రియ అని.. అధికారులు దాడులు చేయడం ఆపేస్తే కల్తీ నిరంతరం కొనసాగుతున్నదని ప్రజలు అంటున్నారు. ఫుడ్ డెలివరీ యాప్స్ ద్వారా ఇంటికే ఆహారాన్ని తెప్పించుకుంటున్న ఘటనల్లోనూ కల్తీ వెలుగు చూస్తున్నది. ఆఫర్లు ఎరగా చూపి, హోటళ్లలో మిగిలిన బిర్యానీ, చికెన్ ఐటమ్స్‌ను అందిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సింగిల్ బిర్యాని ధర మాములుగా రూ.220 వరకూ ఉన్నది. ఆఫర్లలో 50శాతం డిస్కౌంట్ చొప్పున రూ.120 నుంచి రూ.150 వరకే పలు రెస్టారెంట్లు అందిస్తున్నాయి. ఇందులో పాచిన పదార్థాలు కలుపుతున్నారని ప్రచారం జరుగుతున్నది.