నిజామాబాద్, ఆగస్టు 30, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వరద కష్టాలు నిజామాబాద్ జిల్లాను వీడటం లేదు. బోధన్ డివిజన్ వ్యాప్తంగా గోదావరి ఉప నది మంజీరా బీభ త్సం సృష్టిస్తోంది. గ్రామాలను ముంచెత్తుతూ సాగుతోంది. పంట పొలాలను కప్పేసుకుని ప్రవహిస్తోంది. ఐదు రోజులవుతోన్న మంజీరాలో ప్రవాహ స్థాయి తగ్గుముఖం పట్టలేదు. 1983లో మంజీరా ఉగ్రరూపం దాల్చగా 42 ఏళ్లలో ఇప్పుడే ఇంత ఘోరమైన దుస్థితి ఏర్పడిందని పరివాహక ప్రాంత ప్రజలు చెబుతున్నారు.
నిజాంసాగర్, పిట్లం, మద్నూర్, డోంగ్లి, పోతంగల్, కోటగిరి, బోధన్, రెంజల్(కొద్ది భాగం) మండలాల్లో మంజీరా సృష్టిస్తోన్న విధ్వంసానికి పంట పొలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కందకుర్తి తర్వాత గోదావరి నది సైతం భారీ ఎత్తున దిగువకు పరుగులు తీస్తూ పరివాహక ప్రాంత ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ తరం ప్రజలెవ్వరూ గతంలో ఎన్నడూ చూడని విధంగా మంజీరా నదిలో వరద వస్తుండటంతో అంతా వీస్తూ పోతున్నారు. నాలుగు దశాబ్దాల క్రితం నాటి పరిస్థితులను చూసి అవాక్కు తింటున్నా రు.
మంజీరా పరివాహకంలో ప్రధానంగా సోయా పంట సాగు చేస్తున్నారు. మొక్కలు దా దాపుగా 2 -4 అడుగులకు ఎదిగింది. సోయా మొక్కలు దాదాపుగా వరదలో నీటిలో కనిపించకపోవడంతో రైతుల్లో ఆందోళన ఏర్పడింది. ఐదు రోజులుగా వరద జలాలు నిలకడగానే ఉండటం, మొన్నటి వర కు వే గంగా ప్రవహించిన వరదతో పంట పరిస్థితి ఏమై ఉం టుందో? అన్న ఆందోళన కర్షకుల్లో నెలకొంది.
బోధన్ నియోజకవర్గంలో బోధన్, సాలూర మండలాల్లో మంజీరా నది తీవ్ర ప్రభావాన్ని చూపింది. రికార్డు స్థాయిలో వరద రావడంతో సాలూర మండలంలో ఖాజాపూర్, హున్సా, మందర్నా గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయాయి. సుమారుగా ఐదు కిలోమీటర్లు మేర ఎటు చూసిన జాలలతో మంజీరా కనిపించింది. నది తీర ప్రాంతాన్ని దాటుకుని విస్తృతంగా ప్రవహించింది. వరద నీరు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతూ గ్రామాలను చుట్టేసింది. దీంతో రాకపోకలు నిలిచి పోవడంతో గ్రామస్థులు తీవ్రంగా ఇక్కట్లు ఎదుర్కొన్నారు.
వేలాది ఎకరాల్లో పంట పొలాలు కనిపించకుండా వరద నీరే బుధవారం నుంచి శనివారం వరకూ దర్శనం ఇస్తోందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. బోధన్ మండలంలోని హంగర్గా, కొప్పర్గా, ఖండ్గామ్, బిక్నెల్లి, సిద్దాపూర్ గ్రామాలు సైతం తీవ్రంగా ప్రభావానికి లోనయ్యాయి. ఈ గ్రామాల్లోనూ రాకపోకలకు మంజీరా వరద నీరు ఆటంకం కలిగించింది. కొప్పర్గా, హంగర్గా గ్రామాల మధ్య రెండు చోట్ల రోడ్డుపై మంజీరా భారీ స్థాయిలో ప్రవహించడం వల్ల బోధన్‌కు రావడం గగనమైంది.
ద్విచక్రవాహనాల్లో ప్రయాణం ప్రమాదకరంగా మారడంతో అత్యవసరానికి ట్రాక్టర్లలో బయటకు వస్తున్నారు. శనివారం ఈ గ్రామాలను అదనపు కలెక్టర్ అంకిత్‌తో పాటుగా బోధన్ సబ్ కలెక్టర్, ట్రైనీ కలెక్టర్ సందర్శించారు. వరద పరిస్థితులను పరిశీలించి వెనుదిరిగారు. బాధితులకు కనీసం ధైర్యం ఇవ్వలేక పోయారు. ఆర్థిక సాయంపై ప్రకటన కూడా చేయలేదు. బోధన్ డివిజన్లోని పోతంగల్ మండలంలోని కల్లూరు, కొడిచర్ల, హంగర్గ, కారేగామ్, హెగ్డోలి, కొల్లూరు, సోంపూర్, సుంకిని, టాక్లి గ్రామాలను ముంచెత్తుతూ మంజీరా ప్రవహిస్తోంది. 850 మంది రైతులకు సంబంధించిన వేయి ఎకరాలు ఇందులో మునిగి పోయాయి.
ముంపు గ్రామాల్లో తాగునీటికి ప్రజలు తీవ్రంగా అవస్థ పడుతున్నారు. చుట్టూత మంజీరా నది ఆవరించి ఉన్నప్పటికీ తాగేందుకు మంచి నీళ్లు కరువయ్యాయి. ఈ ప్రాంతంలో స్కూళ్లకు టీచర్లు వచ్చేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో బడులను మూసేశారు. శనివారం వాటర్ ట్యాంకర్లతో తాగునీటిని సరఫరా చేశారు. ఖాళీ బిందెలతో హంగర్గా, కొప్పెర్గా ప్రజలు పోటీ పడాల్సి వచ్చింది. శుక్ర, శనివారాల్లో భారీ వర్షం పడలేదు. రానున్న కొద్ది రోజుల్లో భారీ వానలు ఉన్నట్లుగా అంచనాలు వినిపిస్తున్నాయి. వర్షం మరోసారి కురిస్తే ఈ గ్రామాల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారే వీలుంది.
ఎగువ నిజాంసాగర్‌కు ఇన్‌ఫ్లో తగ్గడం, పోచారం ప్రవాహం కూడా నెమ్మదించడంతో మంజీరాలో శనివారం మధ్యాహ్నానికి స్వల్పంగా ప్రవాహం తగ్గినట్లు కనిపిస్తున్నప్పటికీ ముప్పు నుంచి ముంపు గ్రామాలు బయట పడలేదు. బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి ఇప్పటి వరకు ఈ ప్రాంతాలను సందర్శించలేదు. హైదరాబాద్ నుంచే అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తున్నారు. కష్టంలో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు క్షేత్ర స్థాయికి రావాలని స్థానికులు కోరుతున్నారు. శనివారం అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఆదివారం నాడు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించే వీలున్నట్లుగా తెలుస్తోంది. బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తారా? లేదా? అన్నది వేచి చూడాల్సి ఉంది.
రెంజల్ మండలంలోని కందకుర్తి త్రివేణి సంగమ క్షేత్రం భయంకరంగా మారింది. నలభై ఏళ్ల తర్వాత కందకుర్తి గ్రామంలోకి గోదావరి జలాలు చొచ్చుకుని వచ్చాయి. రాత్రికి రాత్రి వరద ప్రవాహం పెరగడం మూలంగా శుక్రవారం నుంచి గ్రామస్థులు వేరే ప్రాంతాలకు వెళ్లి పోతున్నారు. మంజీరా ప్రవాహానికి తోడుగా గోదావరి నదిలోకి ఎగువ మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున వరద వస్తోంది. దీంతో కందకుర్తికి నాలుగు దశాబ్దాల్లో తొలిసారి రికార్డు స్థాయి వరద కనిపిస్తోంది.
దిగువ ఎస్సారెస్పీ ప్రాజెక్టు 39 గేట్ల నుంచి 4.50లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లోకు 5.74లక్షల క్యూసెక్కులు వదులుతున్నప్పటికీ కందకుర్తి వద్ద పరిస్థితి అదుపులోకి రాలేదు. ఆదివారం వరకు వర్షం లేకపోతే త్రివేణి సంగమం శాంతించే వీలుంది. కందకుర్తి నుంచి ఎగిసి పడుతోన్న గోదావరి జలాలు బాసర పుణ్యక్షేత్రం వద్ద ప్రమాదకరంగా మారగా ప్రమాదకరంగా వస్తోన్న వరదతో నవీపేట మం డలంలోని యంచ, మిట్టాపూర్ గ్రామా లు సైతం గోదావరి వరదతో జలదిగ్భంధంలో కొట్టుమిట్టాడుతున్నాయి.