మోర్తాడ్, జూలై 27: కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులకు ఇన్‌ఫ్లో వస్తున్నది. నిజామాబాద్ జిల్లాలోని ఎస్సారెస్పీకి భారీగా వరద పెరిగింది. ఆదివారం ఉదయం 6గంటలకు 10,484 క్యూసెక్కులుగా ప్రారంభమైన ఇన్‌ఫ్లో, 9 గంటలకు 20, 370 క్యూసెక్కులు, మధ్యాహ్నం 12 గంటలకు 24,500 క్యూసెక్కులు, సాయంత్రం 4గంటలకు 50,503 క్యూసెక్కులకు పెరిగింది.
ఆదివారం సాయంత్రం 6గంటలకు 52,765 క్యూసెక్కుల వరద వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091అడుగులు(80.5టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1070.50అడుగుల (24.237టీఎంసీలు) నీటినిల్వ ఉన్నది. శనివారం రాత్రి 9గంటలకు ప్రాజెక్ట్‌లో 22.181 టీఎంసీల నీరు ఉండగా, ఆదివారం సాయంత్రం 6గంటల వరకు 24.237 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్ట్ నుంచి 622 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతున్నది.
బాన్సువాడ/ఎల్లారెడ్డి రూరల్, జూలై 27: మెదక్ , కామారెడ్డి జిల్లాలో కురిసిన వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి స్వల్పంగా వరద పెరిగినట్లు ఏఈ సాకేత్ తెలిపారు. ప్రాజెక్టులోకి ఆదివారం 1,828 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 17.802 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 4.470 టీఎంసీల నీరు ఉన్నదని తెలిపారు.
ఎల్లారెడ్డి మండలంలోని కల్యాణి ప్రాజెక్ట్‌లోకి 330 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. ఆదివారం ఉదయం రెండు రేడియల్ గేట్ల ద్వారా అంతే నీటిని మంజీరా నదిలోకి వదులుతున్నారు. ఎగువప్రాంతంలోని కల్యాణి, అడ్విలింగాల్, తిమ్మాపూర్, భవానీపేట్ అటవీప్రాంతంలో కురిసిన వర్షాలకు ప్రాజెక్టులోకి వరద వచ్చిచేరుతున్నది. దీంతో ప్రాజెక్ట్ నీటిమట్టం 408.00 మీటర్లకు చేరుకున్నదని అధికారులు తెలిపారు.
రెంజల్, జూలై 27: కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలంలోని కందకుర్తి వద్ద ఉన్న గోదావరిలోకి వరద చేరుతుండడంతో పొంగి ప్రవహిస్తున్నది. దీంతో నదిలోని పురాతన శివాలయం చుట్టూ నీరు చేరింది. ఆలయ శిఖరం మత్రమే పైకి కనిపిస్తున్నది. భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉన్నదని, పుణ్యస్నానాలను భక్తులు పుష్కర ఘాట్లపైనే ఆచరించాలని రెంజల్ ఎస్సై చంద్రమోహన్ సూచించారు. జాలర్లు చేపలవేటకు వెళ్లరాదన్నారు