నిజామాబాద్, జూలై 19(నమస్తే తెలంగాణ ప్రతినిధి) ;వానలు దంచికొతున్నాయి. వరదలు పోటెత్తుతున్నాయి. అటు గోదావరి, ఇటు మంజీర పరవళ్లు తొక్కుతున్నాయి. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో శ్రీరాంసాగర్, నిజాంసాగర్ సహా చిన్ననీటి ప్రాజెక్టులు జలకళ సంతరించుకుంటున్నాయి. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో 63, కామారెడ్డి జిల్లాలో 46 తటాకాలు మత్తడి దుంకుతున్నాయి. భారీ వర్షాలతో అక్కడక్కడ రోడ్లు తెగిపోయాయి. వానలు దంచికొడుతుండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది. మరోవైపు, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే ప్రజలు నిజామాబాద్ కలెక్టరేట్లోని కంట్రోల్ రూం (08462 220183)ను సంప్రదించాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు. అలాగే తన కార్యాలయం (08462 250666) కూడా నిరంతరం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.
రైతులకు తీవ్ర నిరాశతో ప్రారంభమైన వానకాలం సీజన్లో భారీ వానలు మొదలయ్యాయి. నెలన్నర రోజులు ఆలస్యంగా వర్షం దంచికొడుతున్నది. పంటల సాగుకు రైతన్నలంతా వేయికండ్లతో ఎదురు చూసినప్పటికీ వర్షాలు లేక చాలా మంది సాగుపై రంది పడ్డారు. క్లిష్ట సమయంలో కాళేశ్వరం నీళ్లను ఎత్తిపోస్తూ శ్రీరాంసాగర్‌కు సీఎం కేసీఆర్ జలాలను తీసుకువచ్చారు. పునరుజ్జీవ పథకం ద్వారా ధైర్యాన్ని కల్పించే ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా 3 టీఎంసీలు వరద కాలువ ద్వారా ఎస్సారెస్పీలోకి ఎత్తిపోశారు. అంతలోనే వానలు ఊపందుకోవడంతో వరద ఇప్పుడిప్పుడే వేగం పుంజుకుంటున్నది. ఎస్సారెస్పీకి భారీగా వరద వస్తుండడంతో ఆయకట్టు రైతుల్లో మరింత ధైర్యం పెరిగింది. కేసీఆర్ రూపంలో లభించిన కొండంత అండతో ధైర్యంగా సాగుకు ముందడుగు వేసిన వారంతా భారీ వర్షంతో మరింత ఉత్సాహంతో కదులుతున్నారు. పొలం పనుల్లో కర్షకులంతా బిజీబిజీ అవుతున్నారు. నాలుగైదు రోజుల వానలకు ఉమ్మడి జిల్లాలో వందకు పైగా తటాకాలు మత్తడి పోస్తుండగా 2వేల చెరువులకు నీటి రాక మొదలైంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అనేక వాగులు, వంకలు వరదతో పోటెత్తుతున్నాయి. అతి భారీ వానల నేపథ్యంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.
నిజామాబాద్‌లో 55.4 మి.మీ..
జిల్లాలో మంగళవారం రాత్రి వరకు 55.4మి.మీ వర్షం కురిసింది. అత్యధికంగా నవీపేట్ 80.3, అత్యల్పంగా కమ్మర్‌పల్లిలో 35.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 10015.9 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు పేర్కొనారు.
నిజామాబాద్‌లో కంట్రోల్ రూం
ఖలీల్‌వాడి, జూలై 19: నిజామాబాద్ నగరంలోని కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు తెలిపారు. వర్షాలతో ఎక్కడైనా ప్రజలకు ఇబ్బందులు ఎదురైతే కంట్రోల్ రూమ్ నెంబర్ 08462-220183కు ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు. ఈ కంట్రోల్ రూమ్ నిరంతరం పని చేస్తుందని, ఏ సమయంలోనైనా ప్రజలు సమాచారం తెలుపవచ్చన్నారు. సమాచారం అందించిన వెంటనే సహాయక చర్యలు చేపట్టేలా ఆయా శాఖల అధికారులు, సిబ్బందిని ఇప్పటికే అప్రమత్తం చేశామని కలెక్టర్ తెలిపారు.
అలుగులు పోస్తున్న చెరువులు.
నిజామాబాద్ జిల్లాలో మొత్తం 1087 చెరువులున్నాయి. వీటిలో 111 చెరువుల్లో 0-25శాతం, 351 చెరువుల్లో 25-50శాతం, 438 చెరువుల్లో 50-75శాతం, 124 చెరువుల్లో 75-100శాతం మేర నీటి నిల్వ ఉన్నది. దాదాపు 63 చెరువులు మత్తడి దుంకుతున్నట్లుగా ఇరిగేషన్ శాఖ లెక్కలు చెబుతున్నాయి. కామారెడ్డి జిల్లాలో 1426 చెరువుల్లో 822 చెరువులకు నీటి రాక మొదలైంది. వీటిల్లో 0-25శాతం మేర నీటి నిల్వ చేరుకున్నది. 426 చెరువుల్లో 25-50శాతం, 99 చెరువుల్లో 50-75శాతం, 33 చెరువుల్లో 75-100 శాతం మేర వరద చేరింది. 46 చెరువులు ఏకంగా అలుగులు పోస్తున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 2513 చెరువులుండగా 109 చెరువులు మత్తడి దుంకుతున్నాయి. అనేక తటాకాలు జలకళను సంతరించుకుంటున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వానలతో వాగులు, వంకల్లో వరద కనిపిస్తున్నది. పలు చోట్ల భారీ ఎత్తున వరద ఉప్పొంగి ప్రవహిస్తున్నది. వాగుల్లో చెక్‌డ్యాములను దాటుకొని వరద దిగువకు ఉరకలెత్తుతున్నది.
మంజీరలో జలకళ..
గోదావరి ఉపనది మంజీరలోకి వరద మొదలైంది. నిజాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగానే జలాలు వస్తున్నాయి. దిగువ మంజీర నదిలోనూ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి కలుస్తున్న వరద పరుగులు తీస్తూ కందకుర్తి వద్ద గోదావరిలో సంగమిస్తున్నాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. ఫలితంగా అంతటా వాతావరణం చల్లబడింది. ఉష్ణోగ్రతలు అంతకంతకూ పడిపోవడంతో శీతల గాలులతో రాత్రివేళల్లో వణుకు మొదలవుతున్నది. భూగర్భ జలం అడుగంటిన సమయంలో భారీ వానలు కాసింత ఊరటను అందించాయి. భూగర్భ జలం సమృద్ధిగా పెరిగేలా ఏకధాటి వానలు దోహదం చేస్తాయని ప్రజలంతా భావిస్తున్నారు. నిజామాబాద్ నగరంలో భారీ వానలతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీ వర్ష సూచన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమయ్యింది. ఆస్తి, ప్రాణనష్టం సంభవించకుండా జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఇరు జిల్లాల కలెక్టర్లు సమీక్షా సమావేశాలు నిర్వహించి అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేసింది.
ఉరకలెత్తుతున్న గోదావరి..
ఎగువ మహారాష్ట్రతోపాటు తెలంగాణలో కురుస్తున్న వానలతో గోదావరి నదీమా తల్లీకి వరద పోటెత్తుతున్నది. నిన్నా, మొన్నటి వరకు బోసిపోయిన నదిలో భారీ వరద వచ్చి చేరుతున్నది. ఎగువ నుంచి భారీ ప్రవాహం రూపంలో వస్తున్న గోదావరి.. కందకుర్తి వద్ద మంజీర నుంచి వస్తున్న వరదను కలుపుకొని శ్రీరాంసాగర్ వైపునకు పయనిస్తున్నది. వారం రోజుల్లో ఎస్సారెస్పీలోకి 7 టీఎంసీల వరద వచ్చి చేరింది. ముప్కాల్ పంప్‌హౌస్ ద్వారా 2.5టీఎంసీల కాళేశ్వరం జలాలను ఎత్తిపోశారు. జూలై 1న బాబ్లీ గేట్లు ఎత్తడంతో ఒకటిన్నర టీఎంసీలు వచ్చింది. మొత్తం ఈ సీజన్లో 13టీఎంసీలు మేర వరద వచ్చినట్లుగా ఇరిగేషన్ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ సీజన్లో అత్యధికంగా బుధవారం 30వేల క్యూసెక్కుల మేర వరద ఎస్సారెస్పీకి పోటెత్తింది. సీజన్ మొదలయ్యే నాటికి ప్రాజెక్టులో 20టీఎంసీల నీళ్లు ఉండగా ప్రస్తుతం 33టీఎంసీలు దాటుకుంటున్నది. గతేడాది ఇదే సమయానికి శ్రీరాంసాగర్‌లో 1088 అడుగుల్లో 76.424టీఎంసీల నీరు నిల్వ ఉంది.
ప్రాజెక్టుల్లోకి పెరుగుతున్నఇన్ఫ్లో..
నిజాంసాగర్ : నిజాంసాగర్ ప్రాజెక్టులోకి మంజీర ఎగువ ప్రాంతాల నుంచి 1600 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. ప్రస్తుతం ప్రాజెక్టులో 3.49 టీఎంసీల నీరు నిలువ ఉన్నది. పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు కాగా ప్రస్తుతం 1388.54 అడుగుల వరకు నీరున్నది. పోచారం ప్రాజెక్టులోకి 3,085 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, పూర్తిస్థాయి నీటిమట్టం 1464 అడుగులకు గాను 1453.33 అడుగుల వరకు నీరు నిలువ ఉన్నది. కౌలాస్‌నాలా ప్రాజెక్టులోకి 1759 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, పూర్తిస్థాయి నీటిమట్టం 458మీటర్లకు 456.10 మీటర్ల నీరు నిలువ ఉన్నది. సింగీతం, కళ్యాణి ప్రాజెక్టుల్లోకి స్వల్పంగా ఇన్‌ఫ్లో వస్తున్నది.
ఎస్సారెస్పీలోకి ఇన్‌ఫ్లో
బాలేగావ్ ప్రాజెక్టు నుంచి 20వేల క్యూసెక్కుల నీటి విడుదల
మెండోరా, జూలై 19: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఎస్సారెస్పీలోకి భారీగా ఇన్‌ఫ్లో వస్తున్నది. దీంతో ప్రాజెక్టులో క్రమక్రమంగా నీటిమట్టం పెరుగుతున్నదని ఏఈఈ వంశీ తెలిపారు. గోదావరి తీర ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో 33,760 క్యూసెక్కుల వరద వస్తున్నట్లు పేర్కొన్నారు. మహారాష్ట్రలోని బాలేగావ్ ప్రాజెక్టు నుంచి 20వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారని, ఈ నీళ్లు ఎస్సారెస్పీని చేరుకునేందుకు 16 గంటల సమయం పడుతుందని తెలిపారు. కాకతీయ కాలువకు 50, అలీసాగర్, గుత్ప ఎత్తిపోతలకు 450, మిషన్ భగీరథ తాగునీటికి 152 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00అడుగులు (90.313 టీఎంసీలు) కాగా బుధవారం సాయంత్రానికి 1072.30 అడుగులు (33.763టీఎంసీలు) నీటి నిలువ ఉన్నదని తెలిపారు. ఈ సీజన్లో ఎగువ ప్రాంతాల నుంచి 14.338 టీఎంసీల వరద వచ్చి చేరిందని పేర్కొన్నారు.
పోచారం ప్రాజెక్టులోకి భారీగా వరద..
ఎల్లారెడ్డి, జూలై 19: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పోచారం ప్రాజెక్టులోకి భారీ వరద వస్తున్నది. లింగంపేట, గాంధారి ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో లింగంపేట పెద్దవాగు ప్రవహిస్తుండడంతో ఆ నీరు పోచారం ప్రాజెక్టులోకి వచ్చి చేరుతున్నది. మెదక్ జిల్లాలోని వాగులు, వంకల నుంచి ప్రాజెక్టులోకి 3వేల క్యూసెక్కుల వరద చేరుతున్నది. మంగళవారం వరకు కేవలం 11 వందల క్యూసెక్కులు ఉన్న వరద ప్రవాహం బుధవారం సాయంత్రానికి 3వేలు దాటింది. మంగళవారం సాయంత్రం 0.233 టీఎంసీలు ఉన్న నీటి నిల్వ బుధవారం సాయంత్రానికి 0.523 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరేందుకు మరో 13వందల ఎంసీఎఫ్‌టీల నీరు రావాల్సి ఉన్నది.