Nizamabad | వినాయక నగర్, జనవరి 8 : మధ్యప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణకు అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ముఠా సభ్యులను నిజామాబాద్ ఎక్సైజ్ బృందం పట్టుకుంది. ఆ ప్రాంతంలో తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి నిజామాబాద్ జిల్లాలో అధిక ధర కు విక్రయించేందుకు రవాణా చేస్తున్న ఇద్దరు మహిళలతో కూడిన ఐదుగురు సభ్యుల ముఠాను గురువారం అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి కథనం మేరకు ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పూజా పవర్, దుర్బాధ భాయ్ జాదవ్ ఇద్దరు మహిళలు కలిసి మధ్యప్రదేశ్ లోని సిర్పూర్ ప్రాంతం నుండి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి, మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతానికి చెందిన కిషన్ మోతిరామ్ దాతే, యావత్ మల్ ఇంద్రజిత్ టాగ్రే కలిసి కామారెడ్డి జిల్లా గాంధారి మండలం చెద్మల్ ప్రాంతానికి చెందిన దుంజా వెంకట్రాం అనే వ్యక్తికి విక్రయించేందుకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కంటేశ్వర్ బైపాస్ రోడ్డు ప్రాంతానికి వచ్చారు.
దీంతో నిజామాబాద్ ఎస్హెచ్ఓ స్వప్న ఆధ్వర్యంలో ఎక్సైజ్ బృందం ఐదుగురు సభ్యులు గల గంజాయి ముఠాలు పట్టుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుండి 13 కేజీల ఎండు గంజాయి ఐదు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు మల్లారెడ్డి వెల్లడించారు. ఈ ముఠాలు పట్టుకునేందుకు సీఐ స్వప్న తో పాటు ఎస్సైలు మల్లేష్, సుస్మిత, సిబ్బంది సునీల్, ప్రభాకర్, రవి, సంగయ్య, సౌమ్య,సుచరిత, సంజయ్ కృషి చేశారని ఈ సందర్భంగా వారిని అభినందించారు.