సాధారణంగా ఇంటి మిద్దెపై పూలమొక్కలు, కూరగాయలు.. కోళ్లు, కుందేళ్లను పెంచుకుంటాం. మరికొందరు బాతులు, గొర్రెలు, మేకలను పెంచుతారు. వీటితోపాటు చేపలను కూడా పెంచుకోవచ్చని.. షోకేజ్ కోసం కాకుండా పెద్ద సంఖ్యలో చేపలను పెంచి మంచి ఆదాయం కూడా పొందవచ్చని చెబుతున్నారు నిపుణులు. అలాంటి ఆలోచనే ఈ మహిళలకు వచ్చింది. మహిళా సంఘ సభ్యురాలు కావడంతో ప్రభుత్వం స్వయం ఉపాధిలో భాగంగా ఇచ్చే స్త్రీనిధి రుణాలను సద్వినియోగం చేసుకుంటూ మిద్దెపైనే చేపలను పెంచడం ప్రారంభించారు.
-గాంధారి, ఫిబ్రవరి 24
ఎక్కడైనా చేపలను చెరువులతోపాటు కుంటల్లో, పంట పొలాల్లో పెంచడం చూశాం. అలాంటిది ఇంటి మేడలపై షెడ్లను ఏర్పాటు చేసుకొని వాటిలో చేపలను పెంచడం కొత్తగా కనబడుతుంది. గాంధారి మండల కేంద్రానికి చెందిన ఇద్దరు మహిళలు స్త్రీనిధి, బ్యాంకు లింకేజీ ద్వారా మంజూరైన రుణాలతో తమ ఇంటి మిద్దెలపై షెడ్లను ఏర్పాటు చేసుకొని చేపల పెంపకాన్ని చేపట్టారు. స్వయం ఉపాధి పొందడంతోపాటు ఆర్థికంగా బలోపేతం కావాలనే ఆలోచనతో చెరువుల్లో పెంచాల్సిన చేపలను ఇంటి మిద్దెలపై పెంచుతున్నారు. కామారెడ్డి జిల్లాలో మరెక్కడా లేనివిధంగా గాంధారి మండల కేంద్రానికి చెందిన చందాపురం రేణుక, నీల రాజ్యలక్ష్మి అనే ఇద్దరు మహిళా సంఘ సభ్యులకు స్త్రీనిధి, బ్యాంకు లింకేజీ ద్వారా మంజూరైన మూడు లక్షల రుణంతో ఇంటి మిద్దెల(డాబా)పై షెడ్లను ఏర్పాటు చేసుకొని చేపల పెంపకానికి శ్రీకారం చుట్టారు.
స్వయం ఉపాధితోపాటు ఆర్థికంగా బలోపేతం..
గాంధారి మండల కేంద్రానికి చెందిన రేణుక, నీల రాజ్యలక్ష్మి మహిళా సంఘాల్లో సభ్యులు కావడంతో స్త్రీనిధి రుణాలతో స్వయం ఉపాధి పొందాలని భావించారు. ఇంటి మిద్దెలపై చేపల పెంపకానికి స్త్రీనిధి రుణాలు మంజూరు చేస్తుడడంతో వారు సైతం చేపలను పెంచేందుకు ఆసక్తి కనబర్చారు. వెంటనే స్త్రీ నిధి రుణాలకు దరఖాస్తు చేసుకున్నారు. ఐకేపీ ఇచ్చే స్త్రీనిధి రుణాలకు మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు లింకేజ్ ఇవ్వడంతో ఒక్కో సభ్యురాలికి రూ.3లక్షల చొప్పున రుణం మంజూరైంది. దీంతో ఇంటి మిద్దెలపై చేపల పెంపకానికి అనువైన షెడ్లతోపాటు చేపపిల్లలను, వాటికి అవసరమైన దాణాను కొనుగోలు చేశారు. ప్రస్తుతం షెడ్లలో పెంచుతున్న చేపపిల్లలు ఆరు నెలల్లో కిలో సైజు వరకు పెరుగుతాయి.
కొర్రమీనుల పెంపకం..
మార్కెట్లో కొర్రమీను చేపలకు భలే డిమాండ్ ఉంటుంది. దీంతో వీరిద్దరూ కొర్రమీను చేపలను పెంచేందుకు నిర్ణయించుకున్నారు. నిజాంసాగర్ మండలం మాగిలో ఉన్న ఉదయ ఆక్వా కనెక్ట్స్ అనే ప్రైవేటు కంపెనీ నుంచి చేపపిల్లలను కొనుగోలు చేశారు. ఒక్కో షెడ్డులోని ట్యాంకుల్లో వెయ్యి నుంచి 1200 చేపపిల్లలను వదిలారు. షెడ్లలో పెంచుతున్న చేపపిల్లలకు అవసరమైన దాణాను అదే కంపెనీ సప్లయ్ చేస్తున్నది. ప్రస్తుతం ట్యాంకుల్లో పెరుగుతున్న చేపపిల్లలు మరో ఆరు నెలల్లో కిలో వరకు పెరుగుతాయి. మార్కెట్లో కొర్రమీను చేపలు కిలో రూ.300 నుంచి రూ.400 వరకు ధర పలుకుతుండంతో 3 నుంచి 4 లక్షల ఆదాయం వస్తుందని ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.
చేపలకు డిమాండ్ ఉండడంతో..
మార్కెట్లో చేపలకు మంచి డిమాండ్ ఉంది. దీంతో మా ఇంటి మిద్దెపై చేపలు పెంచడానికి నిర్ణయించుకున్నాం. ఐకేపీ స్త్రీనిధి ద్వారా మంజూరైన రుణంతో మిద్దెపై షెడ్డు వేశాం. ప్రైవేటు కంపెనీ నుంచి కొర్రమీను చేపపిల్లలను కొనుగోలు చేశాం. చేప పిల్లలు పూర్తిస్థాయిలో పెరిగి విక్రయించే వరకు వాటికి అయ్యే దాణాను కంపెనీయే సప్లయ్ చేస్తుంది.
– చందాపురం రేణుక, గాంధారి, మహిళా సంఘం సభ్యురాలు
ఇంటి వద్దనే ఉంటూ చూసుకుంటున్నాం..
స్త్రీ నిధి, బ్యాంకు లింకేజ్ ద్వా రా మంజూరైన రుణంతో ఇం టి మిద్దెపై చేపలను పెంచుతున్నాం. ప్రస్తుతం షెడ్డులోని ట్యాంకులో 1000-1200 చేప పిల్లలు ఉన్నాయి. ఆరు నెలల్లో ఒక్కోటి కిలో సైజు వరకు పెరుగుతాయి. స్వయం ఉపాధి పొందడంతోపాటు ఆర్థికంగా బలోపేతం కావాలనే ఉద్దేశంతోనే చేపల్ని పెంచుతున్నాం. ఇంటి మిద్దెపైనే ఉండడంతో దూరం వెళ్లాల్సిన అవసరం లేదు.
– నీల రాజ్యలక్ష్మి, గాంధారి, మహిళా సంఘ సభ్యురాలు
చేపలు పెంచడం సంతోషకరం
స్త్రీనిధి రుణాలతో ఇంటి మిద్దెలపై చేపలను పెంచేందుకు షెడ్డులను ఏర్పాటు చేయడం సంతోషకరం. మహిళా సం ఘాల సభ్యులు స్త్రీనిధి రుణాలను సద్వినియోగం చేసుకోవాలి. చేపల పెంపకంతో ఇం టి వద్దనే స్వయం ఉపాధిని పొందవచ్చు. ఇతర మహిళా సంఘాలకు సైతం చేపల పెంపకంపై అవగాహన కల్పిస్తాం.
– గంగరాజు, ఐకేపీ ఏపీఎం, గాంధారి