Nizamabad | వినాయక్ నగర్, జూన్ 19 : దొంగతనం కేసులో శిక్ష పడి జైలు లో రిమాండ్ ఖైదీగా ఉన్న వ్యక్తికి జమానత్ పెట్టి విడిపించిన ఇద్దరి జామానత్ దారలకు రూ.80 వేలు కట్టాలని గురువారం నిజామాబాద్ కోర్టు తీర్పు వెలువరించింది. వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని జైనులబోద్దీన్ గల్లీ కి చెందిన మహమ్మద్ అహ్మద్ హుస్సేన్ పలు దొంగతనపు కేసులలో ముద్దాయిగా నేరారోపణలు ఎదుర్కొంటున్నాడు. నిజామాబాద్ అదనపు జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు జడ్జి ఖుష్భూ ఉపాధ్యాయ్ ఆర్డర్ మేరకు జ్యూడిషియల్ రిమాండ్ ఖైదీగా నిజామాబాద్ కేంద్ర కారాగారంలో ఉండేవాడు. అతను న్యాయవాది ద్వారా కోర్టులో బెయిలు దరఖాస్తు దాఖలు చేయడంతో అతడికి కోర్టు రూ.పది వేలకు గాను ఇద్దరు జమానాత్ సమర్పించాలని బెయిలు ఉత్తర్వులో పేర్కొన్నది.
సదరు ఉత్తరవులననుసరించి బైంసా మండలం లింగా గ్రామానికి చెందిన శిల్కె శంకర్, జక్లి గ్రామ నివాసి వాగ్మారే సోనోభా అనే ఇద్దరు వ్యక్తులు తమ గ్రామ కార్యదర్శి జారీ చేసిన ఇంటి విలువ సర్టిఫికెట్ లను మహ్మద్ అహ్మద్ హుస్సేన్ కు జమానతుదార్లుగా ఉంటామని కోర్టులో అతడి తరఫు న్యాయవాది ద్వారా పిటిషన్ దాఖలు చేశారు. ఆ సమయంలో ప్రతీ కోర్టు పేషికి ముద్దాయిని పంపిస్తామని ప్రమాణ పత్రంతో కూడిన షూరిటీ బాండ్ ను సమర్పించారు. వీరి పిటిషన్ కు ఇంటి వాల్యూవేషన్ సర్టిఫికెట్స్, ఇంటి పన్ను రశీదు, ఆధార్ కార్డు జిరాక్సులనుజత చేశారు. పిటిషన్ ను పరిశీలించిన కోర్టు వారి జమానత్ను అంగీకరించి ముద్దాయిని జ్యూడిషియల్ కస్టడీ నుండి విడుదల చేసింది.
విడుదల అయినంత అనంతరం అతను కోర్టు వాయిదాలకు రాక పోవడంతో బెయిలుకు వీలులేని అరెస్ట్ వారంట్ జారీ చేసి షూరిటీ దారులిద్దరికీ నోటీసులు ఇచ్చి కోర్టు కు పిలియించింది. కొన్ని నెలల సమయం ఇచ్చిన అనంతరం కూడా ముద్దాయిని వారు హాజరు కు రప్పించక పోవడంతో వారు జమానత్గా ఉన్నందున నాలుగు కేసులలో ఒక్కొక్క కేసుకు గాను రూ.పది వేల చొప్పున మొత్తం రూ.40 వేలు ఒక్కొక్కరు చెల్లించాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. లేకుంటే నెల రోజుల సాధారణ జైలుశిక్ష అనుభవించాలని జ్జి ఆదేశించారు. దీంతో ఇద్దరు జమానత్దారులు ఒక్కొక్కరు రూ.40వేల నగదు కోర్టు లో చెల్లించడంతో వారి జమానత్ ను రద్దు చేస్తూ జడ్జి ఖుష్భూ ఉపాధ్యాయ్ ఉత్తర్వులు జారీ చేశారు.