అన్నదాత మురిసి పోతుండు. ఏ రందీ లేకుండా ముందుకు ‘సాగు’తున్నడు. సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతో ఉత్సాహంగా పొలం బాట పడుతున్నడు. పదో విడుత రైతుబంధు డబ్బులు అన్నదాతల ఖాతాల్లో జమ అవుతున్నాయి. గత నెల 28 నుంచి ప్రారంభమైన పెట్టుబడి సాయం పంపిణీ కొనసాగుతున్నది. బుధవారం కూడా ఉమ్మడి జిల్లాలోని రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. పంటల సాగుకు ఠంచన్‌గా పైసలు వస్తుండడంతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతున్నది. అప్పులు, ఆర్థిక కష్టాలు దూరమయ్యాయని రైతాంగం సంబురపడుతున్నది. పెట్టుబడి సాయం తమకు ఎంతో సౌలత్గా మారిందని రైతులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి వల్లే తమకు వడ్డీల బాధ తప్పిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు ఎంతో మంచి చేస్తున్న కేసీఆర్ సారు సల్లంగుండాలని నిండు మనస్సుతో దీవిస్తున్నారు.
సమైక్య పాలనలో వ్యవసాయం దండుగ అన్న పరిస్థితులు.. స్వరాష్ట్ర పాలనలో పండుగలా మారింది. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలు వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏడో రోజు బుధవారం రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ అయ్యాయి. ఐదు ఎకరాలపైబడి ఉన్న రైతులకు డబ్బులు జమ కావడంతో హర్షం వ్యక్తంచేస్తూ పనుల్లో బిజీ అయ్యారు.
-నమస్తే తెలంగాణ యంత్రాంగం
ఏడో రోజు వరకు రైతుల ఖాతాల్లో..
విద్యానగర్, జనవరి 4: కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఏడో రోజు బుధవారం వరకు 2,47,808 మందికి రైతుబంధు అందగా, మొత్తం రూ.170,14,80,438 నగదు ఖాతాలో జమ అయినట్లు జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. మిగతా వారికి కూడా త్వరలో డబ్బులు జమ అయితాయని పేర్కొన్నారు.
టైమ్‌కు వస్తున్నాయి..
నస్రుల్లాబాద్, జనవరి 4: నాకు మూడు ఎకరాల భూమి ఉన్నది. రూ.15వేల రైతుబంధు సాయం అందింది. కూలీలకు పోగా మిగతా డబ్బులతో ఎరువులు కొన్నా. యాసంగి వ్యవసాయ పనులకు రైతుబంధు డబ్బులు టైమ్‌కు రావడం సంతోషంగా ఉన్నది. సీఎం కేసీఆర్ రైతుబంధుతోపాటు ఉచిత కరెంటు ఇవ్వడంతో తిప్పలు తప్పినాయ్.
– గొడిసెల యాదగిరి గౌడ్,రైతు,నస్రుల్లాబాద్
అప్పుల కోసం తిరుగుడు తప్పింది…
నస్రుల్లాబాద్, జనవరి 4:నాకు నాలుగు ఎకరాల భూమి ఉన్నది. గతంలో దానిని సాగు చేయాలంటే చేతిలో చిల్లి గవ్వలేక బ్యాంకులు, తెలిసిన వారి వద్దకు అప్పు కోసం తిరిగేది. రోజుల తరబడి తిరిగినా అప్పుదొరికేది కాదు. ఇప్పుడు ఆ బాధ లేదు. సీఎం కేసీఆర్ రైతుబంధు ఇవ్వడంతో పెట్టుబడి పెట్టేందుకు ఇబ్బంది లేదు. వ్యవసాయ పనులు చేసుకుంటున్న.
– కేతావత్ నరేశ్, రైతు, లింగంపల్లి తండా, నస్రుల్లాబాద్.
కేసీఆర్ వచ్చినంక రైతులకు కలిసొచ్చింది..
నస్రుల్లాబాద్, జనవరి 4:మాకు నాలుగు ఎకరాల భూమి ఉన్నది. గతంలో పంట పెట్టుబడి కోసం వ్యాపారుల వద్ద అప్పు చేసేవాళ్లం. బోరు బావుల కింద సాగు చేసేవాళ్లం. కరెంటు సక్రమంగా ఉండక వ్యవసాయంలో నష్టాలు వచ్చేవి. సీఎంగా కేసీఆర్ వచ్చినంక పెట్టుబడికి డబ్బులు వచ్చినాయ్.. నీళ్లు పారుతున్నాయ్.. నిత్తెం కరెంటు ఉంటుంది. ఆయన వచ్చినంకనే మా రైతులకు కలిసొచ్చింది.
– పందిరి దత్తబోయి, నెమ్లి, నస్రుల్లాబాద్
పండుగలా మారింది…
నస్రుల్లాబాద్, జనవరి 4: నాకు ఉన్న భూమిలో వరితోపాటు మక్కజొన్న, కూరగాయలు పండిస్తున్న. కేసీఆర్ సీఎం అయ్యాక వ్యవసాయంలో విప్లవాత్మన మార్పులు వచ్చాయి. 24గంటలు ఉచిత కరెంటు, పంట పెట్టుబడి సాయంతో వ్యవసాయం పండుగలా మారింది. పండిన పంటను సైతం మద్దతు ధరకు ప్రభుత్వమే కొంటున్నది. ఇబ్బందులన్నీ పోయి రైతు కుటుంబాలు సంతోషంగా ఉంటున్నాయి. దానికి ముఖ్యమంత్రి కేసీఆరే కారణం.
– షేక్ మోసిన్, రైతు,నస్రుల్లాబాద్.
వ్యవసాయంపై ఆసక్తి పెరిగింది
గాంధారి, జనవరి 4: పంట పెట్టుబడులకు రందీ లేకుండా, టైమ్‌కు పెట్టుబడి డబ్బులు కేసీఆర్ ప్రభుత్వం ఇస్తుండడంతో వ్యవసాయంపై ఆసక్తి పెరిగింది. పంటలు సాగు చేసే సమయానికి పెట్టుబడి డబ్బులు అందుతుండడంతో నాలాంటి యువకులు వ్యవసాయంపై మక్కువ చూపుతున్నారు. కేసీఆర్ పాలనలో ఒకవైపు పెట్టుబడికి సాయం చేయడంతోపాటు రైతుబీమా, ఉచిత కరెంట్నిస్తూ పండిన పంటను కొనుగోలు చేస్తుండడంతో యువకులు దర్జాగా వ్యవసాయం చేసేందుకు ముందుకొస్తున్నారు.
– సారంగి శేఖర్, యువరైతు, పొతంగల్ కుర్దూ
కేసీఆర్ పాలనలో రైతేరాజు
గాంధారి, జనవరి 4: కేసీఆర్ పాలనలో ప్రతి రైతు రాజుగా మారిండు. ఎవుసం చేసే రైతులను ఆదుకునేటందుకు రైతుబంధు పథకాన్ని పెట్టుడు సంతోషకరం. వానకాలం, యాసంగిల పంటలు ఏసేటి టైమ్‌కు రైతుబంధు పైసలు అచ్చినయ్. కరెక్ట్ టైంల కేసీఆర్ గవర్నమెంటు పైసలు ఏసుట్ల పెట్టువడి ఖర్సుల బాధ తప్పింది. కేసీఆర్ అచ్చినంక రైతుబంధు, రైతుబీమా, 24గంటల ఉచిత కరంటు ఇచ్చుట్ల మేమంతా రాజులుగా మారుతున్నం.
– గైరబోయిన పెద్ద గంగయ్య, రైతు, గాంధారి
రైతుకోసం ఆలోచించే నేత..
కమ్మర్పల్లి, జనవరి 4: సీఎం కేసీఆర్ రైతు కోసం ఆలోచించే నాయకుడు. గిన్నేండ్లళ్ల మమ్ములను పట్టించుకున్నోడు లేదు. కేసీఆర్ వచ్చినంక సంతోషంగా ఉన్నం. ఎవుసం పనులు మొదలువెట్టంగనే పెట్టువడికి పైసలు ఇచ్చి ఆదుకుంటున్నడు. సీఎం సారు రైతుకోసం ఆలోచించే నాయకుడు. నిజమైన ప్రేమ ఉంటెనే గిసుంటి సాయం చేస్తరు.
-జిన్న చిన్న రాజన్న, రైతు, కమ్మర్పల్లి
సీఎం సారుకు కృతజ్ఞతలు
ఏర్గట్ల, జనవరి 4: ఏటా వానకాలు, యాసంగిలో వ్యవసాయం పనులు మొదలయ్యేటప్పుడు చేతిలో డబ్బులు లేక చాలా ఇబ్బంది పడేటోళ్లం. ఇప్పుడు ఆ కష్టాలన్నీ దూరమయ్యాయి. పెట్టుబడి కోసం ముందే రైతుల బ్యాంకు అకౌంట్ల డబ్బులు వేస్తున్నరు. సీఎం కేసీఆర్ సారుకు కృతజ్ఞతలు.
-కొలిప్యాక అంజయ్య, రైతు, ఏర్గట్ల
మా బాధలను అర్థంచేసుకున్న దేవుడు..
ఏర్గట్ల, జనవరి 4: ఇత్నాలు, ఎరువుల కోసం ఇప్పటిదాకా ఎవ్వలు పైసలియ్యలేదు. మా రైతన్నల బాధలను అర్థం చేసుకున్న దేవుడు సీఎం కేసీఆర్. ఎవుసం పనులు మొదలుకాంగనే బ్యాంకు అకౌంట్ల పైసలు వేస్తున్నడు. ఆయన సల్లంగుండాలె.
-ముక్కెర దేవన్నయాదవ్, రైతు, గుమ్మిర్యాల్, ఏర్గట్ల
కలకాలం సల్లంగుండాలె..
ఏర్గట్ల, జనవరి 4: రైతుబంధు పేరుమీద మమ్ములను పెద్ద మనసుతో ఆదుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సల్లంగుండాలె. వానకాలం, యాసంగిలో ఠంఛన్‌గా పైసలు వస్తున్నయ్. ఇప్పుడు రైతులకు పెట్టుబడి కోసం చేతులు చాచే పరిస్థితి లేదు.
-రాజేందర్‌రెడ్డి, రైతు, దోంచంద, ఏర్గట్ల మండలం