ఆర్మూర్ టౌన్, జూలై 2: ఆర్మూర్ సొసైటీలో రైతులకు పోలీసు భద్రత మధ్య ఎరువులను పంపిణీ చేశారు. మంగళవారం సొసైటీకి వచ్చిన రైతులకు యూరియా అందకపోవడంతో ఆందోళన చేపట్టారు. సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు బుధవారం యూరియా కోసం వచ్చిన రైతులకు టోకెన్లు అందజేశారు. టోకెన్ల ప్రకారం పోలీసు భద్రత నడుమ ఎరువులను పంపిణీ చేశారు. ఎరువుల కోసం రైతులు ఉదయం నుంచే బారులు తీరారు. యూరియాను సకాలంలో అందించడం లో అధికారులు విఫలమయ్యారని అన్నదాతలు మండిపడ్డారు.
ఆర్మూర్టౌన్/ముప్కాల్, జూలై 2: ఆలూర్ మండలం ఇస్సాపల్లి, ముప్కాల్ మండల కేంద్రంలోని సొసైటీ గోదాముల వద్ద యూరియా కోసం రైతులు ఉదయం నుంచే బారులు తీరారు. వందల సంఖ్య లో రైతులు తరలిరాగా.. క్యూలో చెట్ల కొమ్మలు, చెప్పులు ఉంచి పడిగాపులు కాశారు. ఇస్సాపల్లిలో కేవలం 450 బస్తాల యూరియా అందజేయడంతో మిగతా రైతులు నిరాశతో వెనుదిరిగారు.