రామారెడ్డి (సదాశివనగర్), జూన్ 8: యూరియా కోసం రైతులు ఆందోళన చేపట్టారు. సదాశివనగర్ మండలం పద్మాజివాడి సొసైటీకి ఆదివారం 3,500 యూరియా బస్తాలు వచ్చాయి. వీటిని ఉదయం 6 గంటల నుంచి యాప్ ఓపెన్ చేయగా 20 నిమిషాల్లో 1106 యూరియా బస్తాలను రైతులు బుక్ చేసుకున్నారు. బుక్ చేసుకున్న రైతులు యూరియా తీసుకోవడానికి సొసైటీ వద్ద సోమవారం ఉదయం నుంచే బారులు తీరారు.
అధికారులు సర్వర్ రావడంలేదని తెలుపడంతో ఆగ్రహించిన రైతులు ఆందోళన చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ జడ్పీటీసీ పడిగెల రాజేశ్వర్‌రావు సొసైటీ వద్దకు చేరుకొన్నారు. మండల వ్యవసాయాధికారి ప్రజాప్రతితో మాట్లాడారు. సొసైటీ పరిధిలో ఐదు కౌంటర్లు ఏర్పాటు చేసి, ఐదు రోజులపాటు యూరియా సరఫరా చేస్తామని మండల వ్యవసాయాధికారి చెప్పడంతో రైతులు శాంతించారు.
తాడ్వాయి/నిజాంసాగర్, జూన్ 8: రెండు రోజుల క్రితం తాడ్వాయి మండల కేంద్రంలోని ఆగ్రో కేంద్రాల్లోకి యూరియా రావడంతో రైతులు అక్కడికి పరుగెత్తారు. కానీ యాప్‌లో బుక్ చేసిన వారికి మాత్రమే యూరి యా ఇస్తామని చెప్పడంతో నిరాశ చెందారు. యాప్‌తో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వ్యవసాయాధికారులకు చెప్పగా…. యాప్‌లోని పలు సాంకేతిక సమస్యలను సరిచేస్తామని తెలిపారు. మహ్మద్‌నగర్ మండల కేంద్రంలోని గున్కుల్ సొసైటీకి సోమవారం 900 బస్తాల యూరియా రాగా, కొంతమంది రైతులు యాప్ ద్వారా బుక్ చేసుకుందామని సెల్ఫోన్లో సైట్ ఓపెన్ చేస్తామనే లోపు మూడు నిమిషాల్లోనే 900 బస్తాల యూరియా ఖాళీ అయిపోయింది. దీంతో రైతులు ఇంటి ముఖం పట్టారు.