నిజామాబాద్, ఏప్రిల్ 7, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : శనగ పంట రైతు చేతికి వస్తున్న క్రమంలో బహిరంగ మార్కెట్లో ధర అమాంతం తగ్గిపోవడం రైతులను తీవ్రంగా కలిచి వేస్తోంది. ప్రైవేటు వ్యక్తులు చొరబడి ఇదే అదనుగా తక్కువ ధరకే శనగ పంట కొనుగోలు చేస్తున్నారు. ఇష్టారాజ్యంగా పంటలను కొనుగోళ్లు చేయడం ద్వారా అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. కనీస మద్దతు ధరకు భిన్నంగా కొనుగోళ్లకు తెగబడుతుండటంతో జుక్కల్, ఎల్లారెడ్డి, బోధన్ నియోజకవర్గాల్లోని రైతులకు ఇబ్బంది దాపురించింది. రైతుల దీన స్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఆలస్యంగా స్పందించడంతో లాభం లేకుండా పోయింది. సరైన సమయానికి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ముందస్తుగానే ప్రైవేటు వర్తకుల చేతుల్లోకి శనగ పంట చేరింది. ఇప్పుడు కేంద్రాలు ఏర్పాటు కావడంతో అందుబాటులో అమ్ముకునేందుకు రైతుల చేతలో శనగ పంట లేకుండా పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వా కం మూలంగా శనగ కేంద్రాల వల్ల ప్రైవేటు వ్యాపారులకే లాభం జరిగిందని రైతులు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో శనగ కొనుగోలు చేయాలని రేవంత్ రెడ్డి సర్కారు నిర్ణయం తీసుకున్నప్పటికీ ఊరట మాత్రం దక్కడం లేదు.
నిజామాబాద్ జిల్లాలో శనగ సాగు విస్తీర్ణం తక్కువే. ఈసారి సీజన్లో సుమారుగా 14వేల టన్నుల మేర దిగుబడి వస్తుందని మార్క్‌ఫెడ్ అధికారులు అంచనా వేశారు. కామారెడ్డి జిల్లాలో ఏటా భారీగా శనగ పంట సాగవుతోంది. గతం నుంచి జుక్కల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి నియోజకవర్గాల పరిధిలోని రైతులు… శనగల సాగుకు ఉత్సాహం చూపుతుంటారు. 20వేల టన్నుల పైచిలుకు కామారెడ్డి జిల్లా నుంచి శనగ పంట వస్తుందని అంచనాలున్నప్పటికీ ప్రభుత్వం ముందస్తుగా ఏర్పాట్లు చేయలేదు. నిజామాబాద్ జిల్లాలో కేవలం 7 చోట్ల మాత్రమే కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రభు త్వం అనుమతి ఇచ్చింది. బోధన్ మండలంలోని మావండ్ ఖుర్ధ్, కల్దుర్కి, సాలూ ర మండల కేంద్రంతో పాటుగా హున్సా, రెంజల్ మండలంలోని నీల, పోతంగల్ మండల కేంద్రంతో పాటుగా వర్ని మండలంలోని పైడిమల్లో కొనుగోలు కేంద్రాలు నెలకొల్పారు. కామారెడ్డి జిల్లాలో 12 చోట్ల శనగ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. బిచ్కుంద మండల కేంద్రంతో పాటుగా పుల్కల్, మద్నూర్, డోంగ్లి, జుక్కల్, పెద్దకొడప్గల్, గాంధారి, సదాశివనగర్‌లోని ఉత్తనూర్, పద్మాజివాడి, రాజంపేట మండలంలోని ఆర్గొండ, తాడ్వాయి మండల కేంద్రంతో పాటుగా దేమికలాన్‌లో ఏర్పాటు చేశారు. 14శాతం తేమ పేరుతో ఇబ్బందులకు గురి చేసి కోత పెట్టారు. కనీస నాణ్యత ప్రమాణాల పేరుతో గిట్టుబాటు కల్పించలేదు. మద్దతు ధర రూ.5875 రావాల్సి ఉండగా రైతులకు రూ.5వేలు వరకే దక్కింది.
రైతులు పండించిన శనగ పంటను కొనుగోలు చేసేందుకు మార్క్‌ఫెడ్ సిద్ధంగా ఉంది. బోధన్, సాలూర మండలాల్లో పెద్ద ఎత్తున కేంద్రాలకు శనగ వస్తోంది. ఇప్పటి వరకు 5వేల మెట్రిక్ టన్నులు శనగ సేకరించాము. మరింత సేకరించేందుకు సిద్ధంగా ఉన్నా ము. నిర్ణీత ప్రమాణాలు పాటించి క్వింటాకు రూ.58 75 కనీస మద్ధతు ధరను పొందాలని రైతులను కోరుతున్నాము.
– మహేశ్ కుమార్, మార్క్‌ఫెడ్ మేనేజర్, నిజామాబాద్ జిల్లా
అదును దాటిన తర్వాత ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు వెలిశాయి. ప్రైవేటు మార్కెట్లో శనగకు క్వింటాకు రూ.5000 మాత్రమే దక్కింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కనీస మద్దతు ధర రూ.5875లకు శనగ పంటను కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకునేందుకు సూత్రపాయంగా అంగీకారం తెలిపినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగి పోయింది. ప్రైవేటు వ్యక్తులు శనగలను క్వింటాకు రూ.5వేల లోపే కొనుగోలు చేయడంతో నష్టాలు తప్పలేదు. పంట ఉత్పత్తులను రైతుల నుంచి వెనువెంటనే కొనుగోలు చేయడంతో దళారులు సిద్దహస్తులు. చేతికొస్తున్న పంటను గమనించి వెంటనే రైతు వద్ద వాలిపోతుంటారు. బహిరంగ మార్కెట్లో డిమాండ్‌ను, కనీస మద్దతు ధరను అంచనా వేసుకుని దాదాపుగా 10 నుంచి 15శాతం తక్కువకు ప్రైవేటు వ్యక్తులు శనగ పంట సేకరిస్తున్నారు. శనగల విషయంలోనూ ఏటా వ్యాపారులు ఆడే గిమ్మిక్కు ఇదే. తద్వారా క్వింటాకు రూ.500 నుంచి రూ.800 వరకు రైతులు నష్టపోతున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో తీవ్ర ఇబ్బంది ఎదురైంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మార్క్‌ఫెడ్ యంత్రాంగం ద్వారా సమయానికి శనగ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వారికి ఊరట కల్పించేది. కానిప్పుడు అలాంటిదేమీ లేదు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో సుమారుగా 35వేల మెట్రిక్ టన్నులు శనగ ఉత్తత్తి అంచనాలు ఉండగా ఇందులో 40శాతం వరకు బయటి వ్యక్తుల చేతుల్లోకి చేరింది.