రైతులు ఎన్నో కష్టనష్టాలను భరించి సాగుచేసిన పంట చేతికొచ్చే సమయంలో అడవిపందులు దాడిచేసి తినేస్తుంటాయి. దీంతో నష్టం భరించలేక రైతులు వ్యవసాయమంటేనే వెనుకంజ వేసే పరిస్థితి నెలకొంటుంది. కర్షకులకు అడవిపందులు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పంట ఏదైనా తీరని నష్టాన్ని మిగుల్చుతున్నాయి. ముఖ్యంగా మక్కజొన్న, వరి, జొన్న, వేరుశనగ, పొద్దు తిరుగుడు, పండ్ల తోటలపై అడవి పందుల దాడి ఎక్కువగా ఉంటుంది. పంట ఉత్పత్తులను తినడంతోపాటు వాటి సంచారంతో పంట నాశనం అవుతుంది. తెల్లవారుజామున, అర్ధరాత్రి వేళ గుంపులు గుంపులుగా వచ్చి దాడి చేస్తుంటాయి. వీటికి వినికిడి, చూపు తక్కువగా ఉన్నా, గ్రహణశక్తి అధికంగా ఉండడంతో దూర ప్రాంతాల నుంచే పంటలను గుర్తిస్తుంటాయి. నోటి భాగంతో భూమిని లోతుగా తవ్వుతూ మొక్కవేళ్లను పెకిలించి నష్టం కలుగజేస్తున్నాయి. అడవి పందులు, ఇతర వన్యప్రాణుల నుంచి పంటలను రక్షించుకోవడంపై ప్రత్యేక కథనం..
-ఎల్లారెడ్డి రూరల్, అక్టోబర్ 7
కందకం తవ్వే పద్ధతి
పంట పొలం చుట్టూ ఒక అడుగు దూరంలో గట్ల వెంబడి రెండు అడుగుల వెడల్పు, ఒకటిన్నర అడుగుల లోతైన కందకాలను ఏర్పాటు చేస్తే అడవి పందులు పొలంలోకి ప్రవేశించలేవు. ఈ పద్ధతి ఒక్క అడవి పందుల నివారణకు మాత్రమే కాకుండా వర్షాభావ ప్రాంతాల్లో నేలలోకి తేమను వృద్ధి చేయడానికి ఒక పొలం నుంచి ఇంకో పొలానికి సోకే పురుగుల తాకిడిని తగ్గించడానికి కూడా తోడ్పడుతుంది.
సౌరశక్తి కంచె (సోలార్ ఫెన్సింగ్ )
సోలార్ ఫెన్సింగ్ పద్ధతి సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇందులో సోలార్ ప్లేట్ల ద్వారా 12 వోల్టుల విద్యుత్ ప్రసరిస్తుంది. దీంతో అడవిపందులకు స్వల్పం గా షాక్ తగులుతుంది. తద్వారా అవి పంటలవైపు రావడానికి సాహసించవు. ఈ కంచెను ఏర్పాటు చేయడానికి ఒక ఎకరానికి సుమారు రూ.90వేల ఖర్చు అవుతుంది.
జీఐ తీగ కంచె
పొలం చుట్టూ ఒక అడుగు దూరంలో జీఐ తీగను భూమికి ఒక అడుగు ఎత్తులో మూడు వరుసల్లో బిగించి కంచెలా కట్టాలి. ఇది అడవి పందులు పొలంలోకి వెళ్లకుండా నిరోధిస్తుంది. ఈ జీఐ తీగ ప్రహరీకి అక్కడక్కడ గుండ్రటి ఉచ్చులను ఏర్పాటు చేస్తే అడవి పందులు వాటిలో చిక్కుకొని పొలంలోకి వెళ్లలేవు. ఒక ఎకరం పొలం చుట్టూ ఈ కంచె వేయడానికి సుమారు రూ.2వేల ఖర్చు అవుతుంది.
లేజర్ ఫెన్సింగ్:ఈ పద్ధతి ప్రకారం వలయాకారంలో ఉన్న కంచెను పొలం గట్ల వెంబడి ఒక అడుగు దూరంలో అమర్చినట్లయితే కంచెకు ఉండే చిన్న పదునైన బ్లేడ్ల వంటి నిర్మాణాలు అడవి పందుల దేహానికి తీవ్రమైన గాయాలను కలుగజేస్తాయి. ఈ విధంగా చేయడానికి ఒక ఎకరానికి రూ.20వేల ఖర్చవుతుంది.
జీవ కంచెలు ఆముదం పంటను నాటడం:
మక్కజొన్న పంట పొలాల చుట్టూ 4-7 వరుసల్లో అముదపు పంటను వేస్తే మక్కజొన్న పంట వాసన కన్నా ఆముదపు పంట వాసన ఎక్కువగా ఉండి త్వరగా వ్యాపిస్తుంది. దీంతో దూరంలో ఉన్న పందులు మక్కజొన్న వాసనను పసిగట్టలేక లోపలికి చొచ్చుకొని పోవడానికి విముఖత చూపుతాయి.
కుసుమలు: కుసుమలు కూడా పంట పొలాల చుట్టు 4-7 వరుసల్లో వేస్తే కుసుమ ముళ్లు అడవిపందులకు కుచ్చుకొని అవి లోపలికి రావడానికి ఇష్టపడవు.
వాక్కాయ మొక్కలు :వాక్కాయ మొక్కలను గట్ల వెంబడి పెంచడంతో వాటి పదునైన ముళ్లు గుచ్చుకోవడంతో అవి అరుస్తూ పారిపోతాయి. వాక్కాయ గింజలను చింతపండుకు ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తారు. జామ్‌లు, పచ్చళ్లు, పండ్లరసాల తయారీలో విపరీతంగా ఉపయోగిస్తారు.
సంప్రదాయ పద్ధతులు..వెంట్రుకలు వెదజల్లే పద్ధతి పనికిరాని వెంట్రుకలను సేకరించి పంట పొలాల గట్ల చుట్టూ ఒక అడుగు వెడల్పు చదును చేసి పల్చగా చల్లాలి. అలవాటులో భాగంగా నేలను తవ్వే అడవి పందులు గాలి పీల్చే సమయంలో వెంట్రుకలు వాటి ముక్కులోకి ప్రవేశించి శ్వాస పరంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తాయి. దీంతో అడవి పందులు వెనుదిరుగుతాయి.
చీరలను కట్టే పద్ధతి :పొలం చుట్టూ కర్రలను పాతి పాత చీరలను గోడల మాదిరిగా కడితే అడవి పందులు రాత్రి సమయాల్లో దాడి చేసినపుడు ఆ చీరల స్పర్శతో మనుషులు ఉన్నట్లుగా భ్రమపడి అరుస్తూ దూరంగా పారిపోతాయి. ఈ శబ్దాలను విన్న మిగతా పందులు కూడా భయపడి దూరం నుంచే వెనుదిరుగుతాయి.
పొగ పెట్టే పద్ధతి : ఊరపందుల పేడ పిడకలను సేకరించి మట్టి కుండల్లో ఉంచి కాల్చడం ద్వారా పొగ వచ్చేటట్లు చేయాలి. ఈ కుండలను రాత్రి సమయంలో పొలం చుట్టూ అక్కడక్కడా ఉంచాలి. తద్వారా వెలువడే వాసన ద్వారా అక్కడ మరో పందుల గుంపు ఉన్నట్లుగా భావించి అడవి పందులు వెనుదిరుగుతాయి.
రసాయన పద్ధతి..
200 గ్రాముల ఫోరేట్ గుళికలు, థిమ్మెట్ గుళికలు ఒక కేజీ ఇసుకలో కలపాలి. గుడ్డ సంచిలో గానీ, ప్లాస్టిక్ సంచీలో గాని మూటగా కట్టి చిన్న రంధ్రాలు చేసి పంట చుట్టూ ఒక అడుగు దూరంలో 3 మీటర్లకు ఒక కర్ర చొప్పున 60 నుంచి 100 సెం.మీ.ల ఎత్తులో ఈ సంచులను వాటికి కట్టాలి. గాలి ద్వారా గుళికల వాసన పంట వాసన కన్నా బలంగా, ఎక్కువగా ఉండడంతో అడవి పందులు దూరం నుంచే వెళ్లిపోతాయి.
ఇనుము ముళ్ల తీగ కంచెలు:
పంట పొలం చుట్టూ కర్రల సహాయంతో ఒక అడుగు ఎత్తులో మూడు వరుసలతో బిగించి కడితే అడవిపందుల రాకను అడ్డుకోవచ్చు. ఈ విధంగా చేయడానికి ఒక ఎకరానికి అయ్యే ఖర్చు సుమారు రూ.7వేలు ఇనుప వల కంచె ( చైన్ లింక్ ఫెన్సింగ్) పొలం నుంచి ఒక అడుగు దూరంలో నుంచి ముళ్లను కలిగి ఉన్న ఇనుప కంచెను మూడు అడుగుల ఎత్తు వరకు ఏర్పాటు చేయడం ద్వారా అది సమర్థవంతంగా అడవిపందుల రాకను నిరోధిస్తుంది. దీనికి అయ్యే ఖర్చు ఎకరానికి సుమారు రూ.11వేలు.