కోటగిరి : ధాన్యం కొనుగోళ్లలో జాప్యం, కాంటాలో అవకతవకలపై రైతులు ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే..నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎత్తోండ గ్రామంలో సహకార సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంట చేసినప్పటికి సకాలంలో లారీలు రాకపోవడం వల్ల కాంట చేసిన తర్వాత ఐదు కిలోల తరుగు వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. తహసీల్దార్ సమస్యను పరిష్కరించాలని నినాదాలు చేశారు.
అనంతరం కోటగిరి బస్టాండ్ చేరుకొని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆందోళన దిగారు. రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మండుటెండలో గంటలు తరబడి రాస్తారోకో చేశారు.
న్యాయం చేసే వరకు ఇక్కడి నుండి కదిలే ప్రసక్తే లేదని రైతులు భీష్మించి కూర్చున్నారు. రైతుల సమస్యను పరిష్కారం అయ్యేంతవరకు ఇక్కడి నుంచి కదలమని రైతులు స్పష్టం చేశారు. ఈ విషయం తెలుసుకున్న కోటగిరి ఎస్ఐ సునీల్ ఘటన స్థలాన్ని చేరుకున్నారు. తహసిల్దార్ గంగాధర్ తో ఫోన్లో మాట్లాడి రైతుల సమస్యలను వివరించారు. తహసీల్దార్ గంగాధర్ సమస్యను పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. దీంతో రైతులు శాంతించారు. ఈ కార్యక్రమంలో అగ్గు హన్మంతు, జగదీష్, శ్యామ్, శంకర్, జలయ్య, అన్సార్, సాయిలు, అల్లాద్దీన్, దశరథ్ తదితరులు ఉన్నారు.