నిజాంసాగర్, జూలై 26 : దేశంలోనే మొట్టమొదటి భారీ నీటి పారుదల ప్రాజెక్టుల్లో నిజాంసాగర్ ఒకటి. 1931 సంవత్సరంలో దాదాపు 92 సంవత్సరాల క్రితం నిర్మించిన చారిత్రక ప్రాజెక్టుకు రెండున్నర దశాబ్దాలుగా జలకళ సంతరించుకోవడం కలగానే మిగిలింది. నిజాంసాగర్ ప్రాజెక్టు ఎగువ భాగాన కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు అక్రమంగా ఎన్నో ప్రాజెక్టులను నిర్మించడంతో నిజాంసాగర్‌లో నీటి జాడలు లేక కళాహీనంగా మారింది. ఆయకట్టుకు సాగునీరు అందకుండా ఉత్సవ విగ్రహంగా మారింది. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్న అనంతరం సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఒక్క ఎకరం భూమి కూడా ఎండిపోకుండా ఉండాలన్నదే లక్ష్యంగా, రైతును రాజు చేస్తానని ప్రకటించి గోదావరి నీటిని కాళేశ్వరం ద్వారా నిజాంసాగర్‌లోకి మళ్లింపు చేయడం, వర్షాలు సమృద్ధిగా కురవడంతో నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ భాగం నుంచి భారీ ఇన్‌ఫ్లో వస్తున్నది. దీంతో నేడు నిజాంసాగర్ ప్రాజెక్టు జలకళను సంతరించుకున్నది. ప్రస్తుతం నిజాంసాగర్ ప్రాజెక్టులో 1405.00 అడుగుల (17.80 టీఎంసీలు)కు గాను 1402.04 అడుగుల (13.73 టీఎంసీలు) నీటితో నిల్వ ఉండగా.. ఎగువ భాగం నుంచి ప్రాజెక్టులోకి 20 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది.
1931లో నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట గ్రామశివారులో మంజీరా నదిపై నిర్మించిన ప్రాజెక్టు నిజాంసాగర్. 29.72 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు 2.75 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందించేలా నిర్మించారు. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో అక్రమంగా ప్రాజెక్టులను నిర్మించడం, నిజాంసాగర్ ఎగువభాగంలో సింగూరు ప్రాజెక్టును నిర్మించడం, శ్రీరాంసాగర్ ప్రాజెక్టును నిర్మించి నిజాంసాగర్ ఆయకట్టు కొంతమేరకు స్థిరీకరించడంతో నిజాంసాగర్ ఆయకట్టు 2.31 లక్షల ఎకరాలకు పరిమితమైంది. ప్రస్తుతం అలీసాగర్ వరకు లక్షా 35 వేల ఎకరాలకు మాత్రమే నీటిని అందిస్తున్నారు.
నిజాంసాగర్ ప్రాజెక్టుకు హల్ది వాగు ఆయువుపట్టుగా నిలిచింది. గోదావరి నీరు సిద్ధిపేట జిల్లా వర్గల్ మండలం అంబర్పేటఖాన్ చెరువు నుంచి ఆరంభమయ్యే హల్దివాగు..యావాపూర్ వద్ద మెదక్ జిల్లాలోకి ప్రవేశిస్తుంది. మెదక్ జిల్లాలో 47 కిలోమీటర్లు ప్రవహించి మెదక్ మండలంలో ర్యాలమడుగు-ఎల్లాపూర్ వద్ద మంజీరా నదిలో కలుస్తుంది. మంజీర వాగు పరుగులు తీస్తూ గోదావరి జలాలు కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట మండలం గోలిలింగాల మీదుగా నిజాంసాగర్‌కు చేరేలా పనులు పూర్తిచేయడంతో సాగర్‌కు పూర్వవైభవం వచ్చింది. దీనికి తోడు వర్షాలు సమృద్ధిగా కురవడంతో నిజాంసాగర్‌లో ప్రస్తుత వానాకాలం సాగుతో పాటు రానున్న యాసంగి పంటలకు సైతం సాగు నీటి ఢోకా లేదని ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నిజాంసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 13.73 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. ఎగువ భాగం నుంచి 20 వేల క్యుసెక్కుల ఇన్‌ఫ్లో ప్రాజెక్టులోకి ప్రవహిస్తున్నది. ప్రాజెక్టు మరో రెండోరోజుల్లో పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోనున్నది. ఏ క్షణంలోనైనా వరద గేట్ల ద్వారా నీటిని మంజీరా నదిలోకి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. నీటిని విడుదల చేస్తారన్న సమాచారంతో ఉమ్మడి జిల్లా ప్రజలు సంతోషంగా ఉన్నారు. గడిచిన 30 సంవత్సరాల నుంచి జూలై నెలలో నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండడం ఇది రెండోసారి. గతేడాది జూలై నెలలోనే నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండడంతోపాటు వరద గేట్ల ద్వారా మంజీరలోకి నీటిని విడుదల చేశారు. మంజీర పరీవాహక ప్రాంతంలో రైతులు ఉత్సాహంగా పంటలను సాగుచేస్తున్నారు. 12 సంవత్సరాల క్రితం 59.57 టీఎంసీల నీటిని నిజాంసాగర్ ప్రాజెక్టు వరద గేట్ల ద్వారా మంజీరలోకి విడుదల చేశారు. అనంతరం గతేడాది 72.91 టీఎంసీల నీటిని మంజీరలోకి విడుదల చేశారు.
అప్పటిరోజులు వచ్చాయి
అప్పట్లో నిజాంసాగర్ ప్రాజెక్టు ఎప్పుడు చూసినా జలకళ సంతరించుకొని ఉండేది. దీంతో ప్రతి ఏడాది రెండు పంటలను సాగు చేసుకునేవాళ్లం. రోజులు గడిచే కొద్ది నిజాంసాగర్‌లోకి నీటి ఇన్‌ఫ్లో లేకపోవడంతో వానకాలం సీజన్లోనే పంటలను సాగు చేసుకొని, యాసంగిలో బీడు భూములుగా ఉంచుకుంటున్నాం. సీఎం కేసీఆర్ చొరవతో నిజాంసాగర్‌లోకి గోదావరి నీరు రావడంతో సాగు నీటికి ఢోకా లేకుండా పోయింది. పాత రోజులు మళ్లీ రావడం సంతోషంగా ఉన్నది.
– ప్రకాశ్, రైతు, మహ్మద్‌నగర్
చాలా సంతోషంగా ఉన్నది
నిజాంసాగర్ ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటిమట్టానికి నీరు చేరుకుంటుండడం చాలా సంతోషంగా ఉన్నది. గతేడాది నాలుగు నెలల పాటు నిజాంసాగర్ వరద గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. మంజీర పరీవాహక ప్రాంతంలో నాకు పది ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. గతేడాది వానాకాలంతోపాటు యాసంగిలో కూడా పంటలు సాగు చేశా. ప్రస్తుతం మళ్లీ నిజాంసాగర్‌లో పూర్తిస్థాయి నీటి మట్టానికి నీరు చేరుకుంటున్నది. దీంతో చాలా సంతోషంగా ఉంది.
– కమ్మరికత్త అంజయ్య, రైతు, మాగి
నీటి విడుదలకు సిద్ధంగా ఉన్నాం
గతంలో ఎప్పుడూ లేని విధంగా నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి గతేడాది 52 రోజుల పాటు 72.91 టీఎంసీల నీటిని మంజీరా నదిలోకి విడుదల చేశాం. ప్రస్తుతం నిజాంసాగర్ ప్రాజెక్టు నీరు 1402 అడుగులు దాటుతూ పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరువలో ఉన్నది. ఎగువ భాగం నుంచి ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో భారీగానే వస్తున్నది. నిజాంసాగర్ ప్రాజెక్టు నిండగానే వరద గేట్ల ద్వారా నీటిని విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నాం.