మోర్తాడ్, జూలై 24: రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడుత రూ.లక్షలోపు రుణమాఫీ చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించి జాబితా వెల్లడించినప్పటి నుంచి రైతుల్లో ఆందోళన కొనసాగుతూనే ఉన్నది. రుణమాఫీ విషయంలో అధికారులకు పూర్తిస్థాయి సమాచారం లేక ఇంట్లో ఉన్నవారందరీ రుణాలను లెక్కించి వచ్చే దఫాలో వస్తాయని, రూ.2లక్షల వరకు ఉంటే ఆగస్టు 15 తర్వాత వస్తాయని అప్పటి వరకు ఆగాలని రైతులకు చెబుతున్నారు. రుణమాఫీ విషయంలో ఏమైనా ఫిర్యాదులు వస్తే రికార్డులో రాసుకోవాలని పైఅధికారులు చెప్పినట్లు వ్యవసాయాధికారులు అంటున్నారు.
ఈ పరిస్థితుల్లో రేషన్‌కార్డులు లేనివారు, రేషన్‌కార్డు ఉన్నా అందులో పేరు లేనివారు, గల్ఫ్ వెళ్లిన కారణంగా రేషన్‌కార్డుల్లో పేరులేని వారి పరిస్థితి ఏమిటన్న విషయంలో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా సొసైటీ, బ్యాంకుల్లోనూ 25శాతం మాత్రమే రూ.లక్షలోపు రుణమాఫీ పొందిన రైతులు కనబడుతున్నారు. మోర్తాడ్ సొసైటీలో మొత్తం 686 మంది రైతులు రుణాలు తీసుకున్నారు. ఇందులో రూ.50వేల వరకు 401 మంది, రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు 156 మంది, రూ.లక్ష నుంచి లక్షన్నర వరకు 75 మంది, రూ.లక్షన్నర నుంచి 2లక్షల వరకు 54 మంది రైతులు రుణాలు తీసుకున్నారు. ఇందులో 557 మంది రైతులు రూ.లక్ష వరకు రుణాలు తీసుకున్న వారు ఉండగా కేవలం 61మంది రైతులకు మాత్రమే రుణమాఫీ అయ్యింది. దీంతో చాలా మంది రైతులు రోజూ సొసైటీకి వచ్చి తమకెందుకు రుణమాఫీ రాలేదని అడిగి తెలుసుకుంటున్నారు.

చాలా మంది రైతులకు రూ.లక్షలోపు రుణం ఉన్నా మాఫీ రాలేదు. రేషన్‌కార్డు ప్రామాణికం అని చెప్పడం, రేషన్‌కార్డు లేకున్నా రుణమాఫీ ఇస్తామని చెప్పడం, రేషన్‌కార్డు కుటుంబానికి ప్రామాణికత కోసమేనని, రుణమాఫీ కోసం కాదని ఇలా రోజుకో ప్రకటన రావడంతో రేషన్‌కార్డు లేని, రేషన్‌కార్డుల్లో పేరులేని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఇంతకూ తమకు మాఫీ వస్తుందా లేదా అని అధికారులను అడిగితే రేషన్‌కార్డులో పేరులేనందున రాలేదని చెబుతున్నారని రైతులు అంటున్నారు. ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లిన వారి కుటుంబాలకు రేషన్‌కార్డులు ఉన్నా గల్ఫ్ వెళ్లిన వారి పేర్లు రేషన్‌కార్డుల్లో లేవు. అలాంటి వారికి కూడా రుణమాఫీ రాలేదు. గల్ఫ్ వెళ్లిన వారు తామేం పాపం చేశామని, తమకెందుకు రుణమాఫీ రాలేదని వాపోతున్నారు. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం విధిస్తున్న వివిధ రకాల కొర్రీలతో రైతులు వర్రీ అవుతున్నారు. రూ.2లక్షల రుణమాఫీ జాబితా ప్రకటించే వరకు తమకు కూడా మాఫీ వస్తుందన్న ఆశాభావంతో ఉన్నారు.
నేను ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్తున్నాను. అయితే మా కుటుంబానికి సంబంధించిన రేషన్‌కార్డులో నాపేరు లేదు. నాకు బ్యాంకులో రూ.90వేల రుణం ఉంది. ప్రభుత్వం రూ.లక్షలోపు రుణాలు ఉన్నవారందరికీ మాఫీ చేసిందని తెలిసి బ్యాంకులోకి వెళితే రుణమాఫీ రాలేదని చెప్పారు. ఎందుకు రాలేదని వ్యవసాయాధికారులను అడిగితే రేషన్‌కార్డులో పేరులేదని చెబుతున్నారు. రేషన్‌కార్డులో పేరు లేకపోతే నాకు రుణమాఫీ రాదా, గల్ఫ్ వెళ్లడమే మేము చేసుకున్న తప్పా?
– నల్ల గంగాధర్,రైతు, మోర్తాడ్
నాకు బ్యాంకులో రూ.48వేల పంట రుణం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్షలోపు రుణాలు ఉన్న వారికి మాఫీ చేస్తున్నామని ప్రకటించడంతో నాకు కూడా వస్తుందని అనుకున్నాను. కానీ బ్యాంకుకు వెళ్లి అడిగితే మాఫీ రాలేదన్నారు. కారణమేంటని అడిగితే నీ పేరు యూసుఫ్‌లో వై అనే అక్షరం లేనందున అని చెప్పిండ్రు. పేరు తప్పెవరు పంపించిండ్రు, మాఫీ రాకపోవడానికి కారణమెవరు? నాకు మాఫీ రాకపోతే బ్యాంకు వారు తిరిగి డబ్బులు కట్టమని అడగరా, మేమేం తప్పు చేశామని మాకు రుణమాఫీ రాదు. అన్ని పత్రాలు సరిగ్గానే ఉన్నాయి అయినా మాఫీ రాలే.
– యూసుఫ్, మోర్తాడ్
నాకు స్టేట్ బ్యాంకులో వడ్డీతో కలిపి రూ.96వేల రుణం ఉన్నది. రుణమాఫీ జాబితాలో నాపేరు లేదు. బ్యాంకు మేనేజర్ దగ్గరకు వెళ్లి అడిగితే మాకేం సంబంధం లేదు, రుణాలకు సంబంధించి మేమేం లిస్ట్ పంపించలేమంటున్నారు. వ్యవసాయ అధికారుల దగ్గరికి వెళ్తే మాకేం తెలియదు అంటున్నారు. నాలాగే చాలా మందికి రుణమాఫీ రాలేదు. ఈ విషయంలో బ్యాంక్ అధికారులు, వ్యవసాయ అధికారులు సమాధానం చెప్పడం లేదు. నాకు రుణమాఫీ వస్తుందా….రాదా అనేది ప్రశ్నగానే ఉన్నది. కనీసం రాని వారి నుంచి తిరిగి దరఖాస్తులు కూడా తీసుకోవడం లేదు. మరో రెండు విడుతల రుణమాఫీ ప్రకటిస్తే పరిస్థితి ఏంటో అర్థమవుతలేదు.
-గోపిడి సత్యనారాయణ, మోర్తాడ్
నాకు రేషన్‌కార్డు లేదు. రుణమాఫీ రాలేదు. నేను మోర్తాడ్ సొసైటీలో రూ.52 వేల లోన్ తీసుకున్న. రుణమాఫీ చేసిండ్రని సొసైటీకి వెళ్లి అడిగితే మాఫీ రాలేదన్నరు. ఎందుకని తెలుసుకుంటే రేషన్‌కార్డు లేనందుకు మాఫీ రాలేదంటుండ్రు. రేషన్‌కార్డు లేకుంటే రుణమాఫీ చెస్తరో..చెయ్యరో.
– ఎలేటి వెంకన్న, రైతు, తిమ్మాపూర్