ఆర్మూర్టౌన్, జూన్ 9: యూరియా యాప్ రద్దు చేసి, పాత పద్ధతిలోనే సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ అన్నదాతలు ఆందోళన చేపట్టారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో 63వ నంబర్ జాతీయ రహదారిపై మంగళవారం రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. యూరియా కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన యాప్ను తొలగించి, పాత పద్ధతిలోనే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. కొందరు రైతులకు యూరియా యాప్ వాడడం రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
యూరియా సరఫరాపై ప్రభుత్వానికి సరైన అవగాహన లేకపోవడం తో రైతులకు సరిపడా యూరియా అందడంలేదన్నారు. ప్రభుత్వం రైతులపై నిర్లక్ష్యం వహిస్తున్నదని మండిపడ్డారు. రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలుచేయడంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులను చిన్నచూపు చూస్తే సహించేదిలేదని హెచ్చరించారు. రాస్తారోకో చేయడంతో రోడ్డుకు ఇరువైపులా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ఆర్మూర్ ఎస్హెచ్వో సత్యనారాయణ గౌడ్ ఘటనా స్థలానికి చేరుకొని రైతులను సముదాయించి రాస్తారోకో విరమింపజేశారు.