మోర్తాడ్, మే 4: దొడ్డు వడ్లు కొనుగోలు చేయడంలేదని, రైస్ మిల్లర్లు క్వింటాలుకు పది కిలోల కడ్తా అడుగుతున్నారని ఆగ్రహించిన రైతు లు మోర్తాడ్ మండలకేంద్రంలోని జాతీయ రహదారిపై సోమవారం రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ..రైస్‌మిల్లర్లు పది కిలోల కడ్తా అడుగుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. కడ్తాలో అధికారులకు వాటా ఉండి ఉంటుందని, వాటా ఎంతో చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలోలేని కడ్తా ఇప్పుడు ఎలా వచ్చిందని ప్రశ్నించారు.
కష్టపడి పండించిన పంటను విక్రయించడానికి తెస్తే పట్టించుకునే వారే కరువయ్యారని, ప్రభుత్వ తీరుతోనే రోడ్లపైకి రావాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. 15 రోజులుగా కొనుగోలు కేంద్రాలకు రాని తహసీల్దార్ రైతులు రోడ్డెక్కితేనే వచ్చారని, తాము రాస్తారోకో చేస్తున్నారని తెలిసి ఆదివారం లారీల కాంట్రాక్టర్లు, రైస్‌మిల్లర్లతో మాట్లాడడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండుసార్లు జిల్లాస్థాయిలో సమావేశమై కొనుగోలు చేయాలని నిర్ణయించినా, ఎందుకు కొనుగోలు చేయడంలేదని ప్రశ్నించారు. దొడ్డు వడ్లు పండించవద్దని చెబితే పండించబోమని, పండించిన తర్వాత రైతులను రోడ్లపాలు ఎందుకు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 15 రోజులుగా కాంటా చేయని వడ్లు అకాల వర్షాలు వస్తే పరిస్థితి ఏమిటని నిలదీశారు. తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
‘యూరియా యాప్’ను రద్దు చేయాలి
యూరియా యాప్‌తో చాలా మంది రైతులకు యూరియా దొరకడం లేదని, దానిని రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న రైతుల వద్దకు తహసీల్దార్ కృష్ణ వచ్చి సముదాయించే ప్రయత్నం చేశారు. రైతు సమస్యలన్నంటినీ జేసీకి వివరించి, వారం రోజుల్లో మోర్తాడ్‌లో ఉన్న వడ్లన్నీ తరలించే ప్రయత్నం చేస్తామని తహసీల్దార్ రైతులకు భరోసా ఇచ్చారు. సమస్య పరిష్కరించని పక్షంలో నియోజకవర్గస్థాయిలో ఆందోళన కార్యక్రమం చేపడుతామని రైతులు హెచ్చరించారు. అంతకు ముందు బస్టాండ్ సమీపంలోని సమావేశమైన రైతులు తహసీల్ ఆఫీస్ వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలనిస్తూ ర్యాలీ నిర్వహించారు.
విద్యుత్‌పై అవగాహన.. అడ్డుకున్న రైతులు
మోర్తాడ్, మే 4: దొడ్డు వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్‌తో ఆందోళనకు సిద్ధమైన రైతులందరూ మోర్తాడ్‌లోని వ్యవసాయదారుల సంఘం వద్దకు చేరుకున్నారు. సందెట్లో సడేమియా అన్నట్లు రైతులందరు ఒకేచోట ఉన్నారని తెలుసుకున్న విద్యుత్ అధికారులు అక్కడే విద్యుత్‌పై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. స్టార్టర్లు ఎత్తుపై ఉంచాలి, రైతులు తప్పనిసరిగా చెప్పులు వాడాలి తదితర అంశాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విద్యుత్ ఏఈ రమేశ్ వివరించారు. ఒకవైపు ఏఈ చెబుతుండగానే, రైతులు ఇకచాలు అంటూ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. గతంలో మాదిరిగా విద్యుత్ ఇస్తే చాలని విద్యుత్ అధికారులను కోరారు.