కంఠేశ్వర్, మార్చి 10: దళారుల దోపిడీతో కుదేలవుతున్న పసుపు రైతులు రోడ్డెక్కారు. వ్యాపారులు, అధికారులు కుమ్మక్కయ్యారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగా రు. సోమవారం నిజామాబాద్ మార్కెట్ యార్డు నుంచి వందలాది మంది కర్షకులు ర్యాలీగా వచ్చి బస్టాండ్ ఎదుట మెరుపు ధర్నా చేపట్టారు. పసుపుబోర్డు అని చెప్పి ఒకరు మోసం చేస్తే, మద్దతు ధర పేరు చెప్పి మరొకరు దగా చేశారని మండిపడ్డారు.
దళారులు దగా చేస్తున్నారని ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ వచ్చి సమస్యను పరిష్కరించే వరకూ ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. రెండు గంటలకు పైగా బైఠాయించడంతో ఇరువైపులా భారీగా ట్రాఫిక్ నిలిచి పోయింది. అడిషనల్ కలెక్టర్ కిరణ్‌కుమార్ వచ్చి నచ్చజెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు.
నాణ్యత పేరుతో ధర తగ్గిస్తుండడం, మార్కెట్లో వందలాది పసుపు కుప్పలుంటే ఒకటి, రెండింటికి మాత్రమే ధర కోట్ చేసి, మిగతా వాటికి వేయకపోవడంతో కడుపు మండిన అన్నదాతలు సోమవారం ఆందోళనకు దిగారు. మార్కెట్ యార్డు కార్యాలయాన్ని ముట్టడించారు. అక్కడి నుంచి భారీ ర్యాలీగా వచ్చి బస్టాండ్ ఎదుట బైఠాయించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
మార్కెట్ యార్డు మొత్తం దళారులు, వ్యాపారుల చేతిలో ఉన్నదని, రైతు ల గురించి ఆలోచించే వారు ఒక్కరూ లేరని వాపోయారు. రైతులకు మద్దతు ధర ఇవ్వకుండా వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడ్డారని, పసుపు నాణ్యత లేదని వంక చూపుతూ తక్కువ ధర చెబుతూ ముంచుతున్నారని మండిపడ్డారు. మార్కెట్ యార్డు కు పసుపు తీసుకొచ్చి వారం రోజులు గడుస్తున్నా కొనడం లేదని, ఈ క్రమంలో దిక్కు తోచక వ్యాపారులు చెప్పిన రేటుకే పసుపు విక్ర యించి కన్నీటితో తిరిగి వెళ్లాల్సి వస్తున్నదని వాపోయారు.
బాగా ఎండిన పసుపునకు కూడా నాణ్యత లేదని ధర కోట్ చేయడం లేదని తెలిపారు. మార్కెట్ యార్డుకు తీసుకొచ్చిన పసుపును వారమైనా ఎందుకు కొనడం లేదని అధికారులను అడిగితే, నాణ్యత లేదని వ్యాపారులంటున్నారని, వారు కొనకపోతే తామేం చేయగలమని అధికారులు నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డులో వందల కుప్పల పసుపు ఉన్నప్పటికీ, ఒకటి రెండు కుప్పలను మాత్రమే పరిశీలిస్తున్నారని తెలిపారు. పూర్తిస్థాయిలో పసు పు పరిశీలించకుండానే నాణ్యత లేదనే వంకతో కొనడానికి ఎవరూ ముందుకు రావట్లేదన్నారు. అసలే పెట్టుబడి ఖర్చు లు కూడా రావడం లేదని.. రోజుల తరబడి మార్కెట్ యార్డులో ఉండడంతో అదనపు భారం పడుతున్నదన్నారు.
ఆందోళనకు దిగిన రైతులతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో పోలీసులు వచ్చి అన్నదాతలకు నచ్చజెప్పే ప్రయత్నం చేయగా, కలెక్టర్ వచ్చే వరకూ తాము కదిలేది లేదని స్పష్టం చేశారు. అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్ వచ్చి రైతులతో మాట్లాడారు. పచ్చి పసుపును మార్కెట్‌కు తీసుకొస్తున్నారని వ్యాపారులు చెబుతున్నారని ఆయన తెలుపడంతో ఒకసారి మార్కెట్‌యార్డుకు వచ్చి పసుపును పరిశీలించాలని అన్నదాతలు కోరారు.
ఆయన అంగీకరించడంతో ఆందోళన విరమించిన రైతులు ర్యాలీగా మార్కెట్‌కు చేరుకున్నారు. అక్కడ పసుపు ఉత్పత్తులను పరిశీలించిన అదనపు కలెక్టర్‌తో రైతులు తమ గోడు వెల్లబోసుకున్నారు. బాగా ఎండిన పసుపు కొమ్ములను చూపుతూ ఇంతకంటే నాణ్యత ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. మీకు దండం పెడతాం. మాకు గిట్టుబాటు అయ్యేలా చూడాలని వారు వేడుకున్నారు. దీంతో సరైన ధర వచ్చేలా చూస్తామని ఆయన హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.
పసుపు పండించుడంటే మాటలు కాదు. తొమ్మిది నెల్లు కాయలే. మస్తు శ్రమ జేయాలే. ఎండనక, వాననక చిన్నపిల్లలను ఇం ట్ల ఇడుసవెట్టి పసుపు పండించినం. కష్టానికి దగ్గ ఫాయిదా అత్తదని మార్కెట్లకు అత్తే ఏమున్నది. నిండా ముంచుతుండ్రు. పసుపు కొమ్ము దగ్గరికి అచ్చి సూసేటోడు లేడు. కొనేటోడు లేడు. గింత అధ్వానంగా ఎప్పుడు లేకుండే. పదిహేను వేల ధర అయిన ఇయ్యుండ్రి.. లేకుంటే ఇంత పురుగుల మందు అయిన తెచ్చియ్యుండ్రి.
– లక్ష్మి, పసుపు రైతు, కోమన్‌పల్లి
ఎలక్షన్లకు ముందు కేంద్ర ప్రభుత్వం పసుపుబోర్డు ప్రకటిస్తే సంతోషమేసింది. చైర్మన్‌ను నియమించుడుతోని ఇగ మా కష్టాలు పోయినయ్. మం చి ధర అత్తదని మురిసి పోయి నం. పసుపు తీస్కోని మార్కెట్ కు వస్తే ఈడ ఏం పాడైంది. మద్దతు ధర కాదు గదా. కనీసం పసుపు కొనేటోడే లేకుండా పోయిండు. బోర్డు అచ్చి ఏం ఫాయిదా పాడైంది. మార్కెట్ల ఏం జరుగుతున్నదని ఒక్కడన్న అచ్చి సూత్తుండా? రైతుల గురించి పట్టించుకుంటుండా? అందుకే కడుపు మండి రోడ్డెక్కినం.
– మహేందర్‌రెడ్డి, పసుపు రైతు, వాడి