కోటగిరి : పంటల సాగుకు సహకార సంఘం ద్వారా పంట రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కోటగిరి మండలం లింగాపుర్ గ్రామ రైతులు మంగళవారం కొత్తపల్లి సహకార సంఘం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఏళ్ల తరబడి నుంచి పంట రుణాలు కావాలని అడుగుతుంటే ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని సహకార సంఘం సీఈఓ ను ప్రశ్నించారు. రైతుల సమస్యలు మీకు పట్టవా అని నిలదీశారు. కొత్తపల్లి సహకార సంఘం పరిధిలోని లింగాపూర్ గ్రామంలో సుమారు 1800 ఎకరాలు సాగు విస్తీర్ణం ఉందని, రైతుల సౌకర్యం కోసం లింగాపూర్ గ్రామంలో గోదాం నిర్మాణం చేపట్టాలని పలుమార్లు విన్నవించిన పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గ్రామంలో గోదాం లేకపోవడం వల్ల లింగాపూర్ నుంచి కొత్తపల్లి సొసైటీ రావాల్సి వస్తుందని, వచ్చేలోపు ఎరువులు ఉండడం లేదని రైతులు వాపోయారు. ఈ విషయం తెలుసుకున్న కోటగిరి ఎస్సై సునీల్ సంఘటన చేరుకుని ఘటన సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఎస్ఐ భరోసా ఇచ్చారు. దీంతో రైతులు శాంతించారు. ఈ కార్యక్రమంలో రైతులు హనుమంతు, కొండారెడ్డి,శంకర్,రవి,శేఖర్, గంగూండ తదితరులు ఉన్నారు.